Wednesday 29 October 2014

మౌంట్ విసూవియస్

Posted by Kumar N on 10/29/2014 10:37:00 am with No comments
మౌంట్ విసూవియస్...

ఇదొక వోల్కానో. మునుముందు ఎరప్ట్ అవబోయేదిగా పరిగణించబడే ఒక యాక్టివ్ వోల్కానో.

రోమ్ కి సమీపదూరంలో పాంపే, హెర్కులేనియం నగరాలని  సమూలంగా నేలమట్టం చేసి, ఆ నగర పౌరులని సజీవసమాధి చేసిన అగ్నిపర్వతంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది సుపరిచితం.

79AD సంవత్సరంలో హిరోషిమా, నాగసాకి బాంబ్స్ కన్న ఒక లక్షరెట్ల ఎక్కువ వేడితో ఈ పర్వతం లావానీ, యాష్ నీ, మౌంటెన్ రాక్స్ నీ ఎగచిమ్మి ఆకాశాన్నంటి, అటుపై పక్కనున్న పాంపేని ఇరవై అడుగుల లోహపొడిలో ముంచెత్తింది. అప్పుడు పైకెగసి న మోల్టెన్ రాక్ మెటీరియల్ , యాష్ తో కలిసి అతి సన్నటి బూడిదలా తయారయిన ఆ పదార్థం అత్యంత వేడితో భూమ్మీదకొచ్చి, చుట్టూ ఎన్నో మైళ్లకి వ్యాపించింది. ఆ వేడి తగలగానే మనుషులు ఎలా ఉన్నవారలానే అదే క్షణం లో చనిపోయారు. కాని విచిత్రంగా వాళ్లని కమ్మేసిన అతి సన్నటి బూడిద వెంటనే గట్టిపడింది. లోపల ఉన్న శరీరాలు శతాబ్ధాల కాలంలో క్షీణించి నశించి పోయాయి, కాని పైన గట్టిపడిన బూడిద ఆ శరీరాపుకాటారాన్నీ అలాగే ఉంచుకుంది. దాదాపు పదిహేను వందల సంవత్సరాలు కాలగర్భంలోనూ, బూడిదలోనూ మునిగిపోయిన ఈ పాంపే నగరాన్ని 1599 లో మొదటిసారిగా, 1748 లో మరింత విస్తృతంగా ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. ఆ బూడిద కింద ఉన్న మనుషుల ఆకారాలూ, వస్తువులూ ఏ రకమయిన గాలీ, తేమా జొరపడక భద్రంగా ఉన్నాయి. ఆర్కియాలజిస్టులు ప్లాస్టర్ ని ఆ కావిటీస్ లోకి ఇంజక్ట్ చేసి, కొంతమంది శరీరాల మీద ఉన్న వస్త్రధారణ గుర్తులతో సహా మనుషుల చనిపోయిన క్షణంలోని ఆకారాలని రిట్రీవ్ చేయగలిగారు. అలా ప్రాచుర్యం లోకి వచ్చిన పాంపే గత 250 సంవత్సరాలుగా  సందర్శకులని ఆకర్షిస్తూనే ఉంది. పాంపే మీద ఎత్తైన పడగలా నించుని ఉన్న ఈ మౌంట్ విసువియస్ ని ఈ రోజుకి కూడా ప్రమాదకరమయినదిగా వోల్కానాలజిస్టులు పేర్కొంటారు.

గత వంద సంవత్సరాల కాలంలో యూరప్ లో ఎరప్ట్ అయిన ఒకే ఒక్క అగ్నిపర్వతం ఇది. ఇటలీకి వెస్ట్ కోస్ట్ లో, నేపుల్స్ నగరానికి 4,000 అడుగుల పైన యూరప్ లో ఈరోజు అన్నిటికన్నా ఎక్కువ ప్రమాదకరమయిన అగ్నిపర్వతంగా పరిగణించబడుతూ, ప్రపంచంలో మిగతా అగ్నిపర్వతాల కన్నా ఎంతో క్లోజ్ గా మానిటర్ చేయబడుతున్న యాక్టివ్ వోల్కానో ఇది. కొన్ని డజన్ల సెన్సర్స్  దాని టేంపరేచర్, అది వదుల్తున్న వాయువుల డేటాని, ఇరవైనాలుగు గంటలూ కింద ఉన్న నేపుల్స్ నగరం లోని మౌంట్ విసీవుయస్ అబ్జర్వేటరీకి పంపిస్తుంటాయి. యూరోపియన్ సాటిలైట్ ఒకటి దీన్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. కనీసం ఇద్దరు సైంటిస్టులు ఈ డేటాని రోజంతా గమనిస్తుంటారు. కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో ఎక్కడైనా తేడా వస్తుందేమో అని డేటాని, కేబుల్, టేలిఫోన్, రేడియోల ద్వారా కూడా పంపుతూ  ఉంటారు.

రీసెంట్ గా 1944 లో జరిగిన ఎరప్షన్ లో లావా 11 రోజుల పాటు విరజిమ్మి కొంతమంది ప్రాణాలు హరించి వేలమందిని నిరాశ్రయుల్ని చేసింది.  అందుకే ఈ సారి జరగబోయే(!) ఎరప్షన్ కి ఆ ప్రాంతం చుట్టూ ఉండే నగరాలు/గ్రామాల్లోని ఆరు లక్షల పౌరులు నివసించే ప్రాంతాల్ని రెడ్ జోన్ కింద డిక్లేర్ చేసి, అంతమందినీ ఎవాక్యుయేట్ చేసే ప్లాన్స్ ని సిద్దంగా పెట్టుకుంది. మరి అన్ని లక్షల మందిని ముందే ఎవాక్యుయేట్ చేయాలంటే, కనీసం రెండు వారాలయినా పడుతుందనీ, కాబట్టి ఆ రెండు వారాల ముందే ఎరప్షన్ ని ప్రిడిక్ట్ చేయగలిగే డేటా గాదరింగ్ నీ, అందర్నీ సురక్షిత ప్రాంతాలకి ముందే తరలించే సాంకేతిక నైపుణ్యత ని కూడా ఇటలీ ప్రభుత్వం సమకూర్చుకుని సన్నద్ధంగా ఉంది అని చెపుతారు.

ఈ పర్వతం కిందే ఉన్న పాంపే పట్టణానికి అతి సమీపం లో ఉండేది నేపుల్స్ అనే పెద్ద నగరం.  రేవు పట్టణంగా దాదాపు 2,000 ఏళ్ల క్రితం , నిరంతర ప్రయాణీకులతో, వర్తకంతో, రోమన్ కాలానికి వైభవంగా గడిపిన పాంపే లో ఈ రోజుకీ, ఆనాడు పరచిన రోడ్లు, మెట్లూ, పక్కాగా ప్లాన్ చేసి నిర్మించబడ్డ డ్రైనేజ్ సిస్టమ్స్, ప్రధాన రహాదారీ, కూడలి, మార్కెట్ ప్లేస్, తినుబండారాలు వండి సర్వ్ చేసే ప్లేసేస్, ఆడిటోరియం, మెన్, వుమెన్ కి సెపరేట్ గా లెడ్ పైప్స్ లో హాట్ వాటర్ తో స్పా లాంటి సౌకర్యాలూ, ఎక్సర్ సైజెస్ రూములూ, వర్తకప్రయాణికులు మజిలీలో ఆగినప్పుడు వారి కోసం సెక్స్ సర్వీసెస్ అందించే అమ్మాయిల గృహాలు వాటిల్లో వాత్సాయన భంగిమల చిత్రాల మొజాయిక్ పలకలూ, గ్రీక్ , రోమన్ గాడ్స్ అపొలో టెంపుల్ ఇలాంటివన్నీ ఇప్ప్పటికీ చూడవచ్చు.

పాంపేని చూడాలని షుమారుగా 25 మిలియన్స్ విజిటర్స్ వస్తూంటారు ప్రతి సంవత్సరం. ఇటలీకి వెళ్తూ ప్రిపేర్ చేసుకున్న ఇటినరీ లో పాంపే కూడా పెట్టుకున్నాం కానీ, ఆ మౌంట్ వుసీవుయస్ పైకి వెళ్లాలా వద్దా అన్నది అక్కడికి వెళ్లాక చూడొచ్చులే అనుకున్నాం. రోమ్ నుంచి నేఫుల్స్ కి గంటకి మూడు వందల కిలోమీటర్ల స్ఫీడ్ టచ్ చేసిన హై స్పీడ్ ట్రెయిన్ లో వెళ్లి, అక్కణ్నుంచి మన ముంభై, చెన్నై లోకల్ ట్రెయిన్స్ బెటర్ అనిపించేలా నిలువెత్తు గ్రాఫిటీతో మునిగి ఉండి నాకు ఆశ్చర్యాన్నీ, చిరాకునీ పుట్టించి ఉండే  లోకల్ ట్రెయిన్స్ లో నేపుల్స్ నుంచి పాంపే కి ఒక అరగంట-నలభై నిమిషాలు ట్రావెల్ చేసి పాంపేలో దిగి, పాంపే విజిట్ అయిపోగుట్టుకున్నాక.. ఇంకా టైం ఉండటంతో మైదానంలో నిలపడి తల పైకెత్తి దూరంగా చూట్టం మొదలెట్టాను.

అసలు పాంపే కి విజిటర్స్ ని  రప్పించటానికి మూలకారణమయిన మౌంట్ విసీవుయస్ కేసి దీర్ఘంగా చూస్తూంటే, అసలు నాకే పాపమూ తెలీదు, చూడు నేను ఎంత అందంగా, ఠీవీగా నించుని ఉన్నానో అన్నట్లుగా కనిపించింది నాకు. అసలే బ్యూటిఫుల్ డే విత్ క్లియర్ స్కైస్... మంచి వెదర్.. భూమి పుట్టినప్పట్నుంచీ నేనిక్కడే ఉన్నాను ప్రశాంతంగా, కావలిస్తే ఇన్నాళ్లూ నాతో ఉన్న ఈ Naples Bay లో అత్యంత అందంగా కనపడే ఈ నీళ్లనీ, బకెట్ లిస్ట్ అని మీ మానవులు పెట్టుకునే పట్టికలో ఉండే ఈ నేపుల్స్ బే ప్రాంతాన్నీ అడుగు అని నాతో మాట్ళాడినట్లు అనిపించింది.

ఓహో అవునా, సరే అయితే నువ్వేంటో , నీ అమాయకత్వం ఏంటో, నీ పైనుంచి ఆ సుందరమయిన నేపుల్స్ నగరాన్నీ, దాన్ని చుట్టేసిన ఆ స్వచ్చమయిన నీలిరంగు నీళ్లనీ నా కళ్లతో చెక్ చేసుకుంటాను వస్తున్నానుండు అని సిద్దమయ్యాను.

పైన మంటలూ, యమలోకంలోలా సలసల కాగుతున్న లోహామిశ్రమాలూ,
మీది మీదికి ఎగసిపడే నిప్పు రవ్వలూ అలాంటి సీన్స్ ఏం లేవక్కడ :)) హ హ అలా ఉండవని తెలుసులెండి కానీ జస్ట్ ఇన్ కేస్ మనం పైకి వెళ్లగానే కాస్త యాక్టివిటీ ఊపందుకొని ఉంటే ఎలా ఉంటుందా అని :)))) ఎనీవే  అక్కడంత సీన్ ఏం లేదు, ఓ పేద్ద క్రేటర్.. దాంట్లోంచి ఆ సల్ఫర్ వాసన మాత్రం తెలుస్తోంది బానే. కొన్ని సార్లు చాలా పంజెంట్ గా వస్తాయట.. అపుడు కళ్లు కూడా మండుతాయని చెప్పారక్కడి వాళ్లు.

కిందంతా వేడిగా సమ్మర్ డే కదా, పర్లేదులే అనుకున్నాను పైన చల్లగా ఉంటుందని తెలిసి కూడా... కానీ బాబోయ్.. చలి బాగా ఉంది అక్కడ.. అస్సలు చలికి ప్రిపేర్డ్ గా వెళ్లలేదు మేం. తప్పనిసరిగా థిక్ స్వేట్టర్, తలకీ, ఎట్ లీస్ట్ చెవులకి ప్రొటెక్టివ్ వేర్ తీసుకెళ్లటం బెటర్. కాకపోతే ఉండేది కొద్ది సేపు కాబట్టి పర్లేదు కాని , ఇదో ఇలా ఈ గైడ్ లాగా చాలా సేపు ఉండాల్సి వస్తే పేలుద్ది ఫ్రీజింగ్ వెదర్. హాట్ సమ్మర్ లోనే అలా ఉంటే  చల్లగా ఉండే సెప్టెంబర్, అక్టోబర్, మార్చి ల్లో ఎలా వెళ్తారో ఏమో విజిటర్స్ అనుకున్నాను.


Wednesday 8 October 2014

తను తిరిగిన దారుల్లో

Posted by Kumar N on 10/08/2014 03:28:00 am with 2 comments



"సుదూరం లోకి సాగిపోయ్యే రైలు పట్టాల మీద మధ్యాహ్నపు వేళల ఎండ గీసిన వెండి అంచు గీతలూ, దడదడలాడే బోగీల చప్పుళ్లూ, ఇంజన్ కూతలూ, గాల్లోకి అలముకునే పొగా, ఇనపతలపుల వాసనా......................, "

అంతే , ఆ ఇనపకిటికీల వాసన ఎంత బలంగా ముక్కుని తాకిందంటే, 

ఏ వాసనా లేని, చుట్టూ కళ్ళకింపు రంగులతో నింపబడి, ఖరీదైన కలర్ కాంబినేషన్ల దుస్తుల్లోని అందమైన మనుషులు 'నేనే' ముఖ్యం వాళ్లకి అన్నట్లుగా నవ్వుతూ పలకరించే వాతావరణం మధ్య కూర్చుని, కొద్ది నిమిషాలల్లో బరువు తేలికయ్యి, గాల్లోకి తేలిపోయి ఆ సుఖంతో మత్తుగా నిద్రలోకి జారిపోయే అలవాటయిన అనుభవం కోసం సిద్దమవుతున్న నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఉన్నపళాన బయటపడి, ఆ మధ్యాహ్నపు వేడి పొగ అంచు అంటిన గాలిని పీలుస్తూ, ఆ రైలు కిటికీ పక్కన కూర్చొని ఆ ఇనప వాసనని గుండెల్నిండా బలంగా పీల్చాలని ఎంతగా అనిపించిందో!!

చదువుతున్నది ఆపేసి, కళ్లు మూసుకొని warp drive చేసి తండ్లాడాను ఆ వాసన కోసం. ఒక వాసన కూడా అస్థిత్వ రూపకల్పనలో ఒక చిన్న భాగమవుతుందని ఇది రాస్తూంటే తెలిసొస్తోంది.

హబ్బ, ఎప్పటి రైలు ప్రయాణాలూ!!, తరచుగా ఊర్నించి గంటల కొద్దీ ఆ పొగబండిలో. ఎండంతా మనిషి మీద నుంచే..కిటికీ ఊచలకి వీలయినంత వరకీ తలని బయటకి నొక్కి పెట్టి, గడ్డం కింద చేయి పెట్టుకొని, ఆ 'ఎండ గీసిన వెండి అంచు గీతల' వెంట కళ్లు సారించి, బోగీ ఊగినప్పుడల్లా, ఆ వెండి అంచు తళతళ కదలికల్లో సూర్యుడి ప్రతిబింబం కోసం వెతుక్కోవటమో, లేదంటే కళ్లు కిందకి వంచి ఆ వెండి అంచు వెంట వేగంగా వెళ్లి, పట్టాల మీద సూర్యుణ్ణి తదేకంగా చూట్టమో, ఎన్నిసార్లని!!

వెళ్ళేదిశకి వీపు పెట్టి కూర్చుంటే ధూళి కణాలు కళ్లల్లో పట్టం తప్పించుకోవచ్చనీ, అప్పుడప్పుడూ గప్పున వదిలే పొగ వళ్లంతా కప్పేయకుండా కాపాడుకోవచ్చనీ మెదడు చెప్పినా వినకుండా, పోట్లాడి ముందుగా ఒక పుస్తకమో, మరోటేదో విసిరేసి 'ఆ' కిటికీ పక్క సీట్లోకి తోసుకుంటూ వెళ్ళి , కాస్త వేగమందుకున్నాక ఆ ఎదురు గాలి కోసం తల ఏటవాలుగా పైకెత్తి కళ్లు మూసుకొని , ఇంకాసేపయ్యాక దగ్గర్లో వరసగా వస్తూన్న చెట్లకింది "ఊదారంగు నీడల"లోకి వెళ్లిపోయిన నాతో నేనే దోబూచులాడుకుంటూ చేసిన ప్రయాణాలు! 

ఎవరీయన?!! 

***

చీకటిలోంచి, కళ్లు చిట్లించే వెలుతురులోపలకి వచ్చి సెక్యూరిటీ క్లియర్ చేసి, గేట్ దగ్గరికి నడుస్తున్నా.

"ఎక్కడున్నారు, ఎయిర్ పోర్ట్? " అంటూ ఈమెయిల్.

"అవును, ఏం" 

" మీ ఫోన్ లో పిడిఎఫ్ ఓపెన్ అవుతుందా? "

" అవుతుంది "

"మొన్నొక పుస్తకం పంపాను, గుర్తుందా, అసలా ఈమెయిల్ ఉందా, డిలీట్ చేసారా :) సరేలే ఎందుకు వెతుకుతారు కానీ, అటాచ్మెంట్ పంపాను దీనితో, ముందిది ఓపెన్ చేయండి"

"యా, ఈమెయిల్ ఎందుకు డిలీట్ చేస్తానూ? ఉంది ఆ పుస్తకం, ఇంకా చూడలేదు, వీకెండ్ కదా కుదర్లేదు. సరే చూస్తాను "

"చూస్తాను కాదు, ఇప్పుడు ఓపెన్ చేయండి" కరుణ నిండిన సాధికార స్వరం.

దేవుడా, ఈ అమ్మాయి నీ చేతుల్లో తయారయ్యక, ఈ భూమ్మీదకి వదిలేముందు, నువ్వు నీ సృష్టి గురించి ఏం అనుకున్నావో ఒకసారి తెలుసుకోవాలనుంది స్వామీ.

"ఇప్పుడే ఫ్లైట్ లోపలకి సీట్ళోకి వచ్చి కూర్చున్నా, కొద్ది సేపట్లో నిద్రపోతాను, తరువాత తప్పనిసరిగా చదువుతాను ఓకేనా" 

"కుదర్దు, ఇప్పుడే ఓపెన్ చేసి డైరక్టుగా పేజ్ నం. 67 కి వెళ్లిపోండి . [అంతకుముందు మెయిల్ లో పంపిన పుస్తకాల గతేమయిందో నాకు తెలుసు]"

ఈ పిల్లతో వల్ల కాదబ్బా. అమ్మ చూపించే అధికారమే అంతా.

***

అప్పుడు తెరిచాను. ముందు పేజీలలో రచయిత చెప్పిందేంటో వినకుండా నేరుగా 67 కి పోవటం ఇష్టం లేక,

మొదటి పేజీలో మొదట్లోనే..

"......... ఇనపతలపుల వాసనా, వెనక్కి సాగిపోయే గ్రామాలూ, అక్కడక్కడ ఏ తుమ్మచెట్టుకిందనో పరచుకునే ఊదారంగు నీడలు గుర్తొస్తాయి......... మరీ పసితనంలోనే ఇల్లువదలి ఎక్కడో ఒక దూరపు పాఠశాలకు పోవలసి వచ్చిన బాల్యంలో, ఒక బస్సు కిటికీనో లేదా రైలుకిటికీనో ఆశ్రయించి ఏ పంటపొలాల మీద తూనీగ గానో, ఏ మబ్బుదారుల్లో మెరుపుగానో నా మనసుని పోనిచ్చే వాణ్ణి. ఏవేవో కలలు కంటూండే వాణ్ణి. "

నేను కదా ?! 

అసలెవరితను? ఇంతకీ పుస్తకం వచ్చినప్పుడు ఈమెయిల్ లో ఏదో రాసినట్లు గుర్తు, లెట్ మీ సీ.

"ఇది మీరు తప్పక చదవాల్సిన పుస్తకం . ఈయన స్టైల్ గురించి నేను సర్టిఫై చేయక్కర్లేదు మీకు బాగా తెలిసే ఉంటుంది . అసలు అరకు , శ్రీశైలం గురించిన వర్ణన ఆసలు నేను ఎంత మైమరచి చదివానో . బ్యూటిఫుల్ . ఇహ ఇంగ్లాండ్ గురించి అయితే మాత్రం మీకు చాలా చాలా ఇంటరెస్టింగ్ ఉంటుంది . తెలుగులో కూడా ఇంత మంచి travelogues ఉన్నాయని తెలీదు నాకు. అసలు ట్రావెలాగ్ రాసే ప్రతి ఒక్కరు ఒకసారి అవి ఎలా రాయాలో ఇది చదివి అప్పుడు రాస్తే బావుండు . నేను ఓవర్ హైప్ చేయటం ఇష్టం లేదు కానీ, గత కొద్ది కాలంలో నాకు చాలా నచ్చిన బుక్ ఇది. of course, నా టేస్ట్ అంత గొప్పది కాదు కానీ ఆయన లాంగ్వేజ్, రాసిన విశేషాలూ, అబ్జర్వేషన్స్, మనుషుల మీది ప్రేమా అండ్ వాట్ నాట్?!! He mesmerized me! ............"

నో, నాకు ఈయన గురించి తెలీదు, బ్లాగ్ ప్రపంచంలో ఎక్కడో రెండు సార్లు ప్రస్తావన చూసి ఉంటానేమో. గమ్మత్తైన పేరు.

నేరుగా ఆ 67 వ పేజీకే పోయాను.

"...మరీ ముఖ్యంగా, చారిత్రక స్థలాలు చూడటమంటే, నాకెక్కడ లేని ఉత్సాహం. అటువంటి చోట్ల నాకూ, నా ముందు ఈ భూమ్మీద నివసించిపోయిన పూర్వమానవులకీ మధ్య ఒక సంవాదమేదో జరుగుతుంటుంది అనుకుంటాను... "

"ఇంగ్లాండ్!, 

షేక్స్పియర్ రంగభూమి. షెల్లీ, కీట్స్ ల ఇంగ్లాండ్, వర్డ్స్ వర్త్, కాలరిడ్జిల ఇంగ్లాండ్, డికెన్స్, డీక్వెన్సీల ఇంగ్లాండ్, షా, లారెన్స్ ల ఇంగ్లాండ్, మిల్, రస్కిన్ ల ఇంగ్లాండ్, న్యూటన్, డార్విన్ ల ఇంగ్లాండ్, ఆక్స్ ఫర్డ్, కేం బ్రిడ్జిల ఇంగ్లాండ్, స్మిథ్, బెంథామ్ ల ఇంగ్లాండ్, చాప్లిన్, హిచ్ కాక్ ల ఇంగ్లాండ్, మార్క్స్, ఎంగెల్స్ ల ఇంగ్లాండ్, గాంధీ, నెహ్రుల ఇంగ్లాండ్, నా దేశాన్ని పాలించిన ఇంగ్లాండ్, నా జాతి ద్వేషించిన ఇంగ్లాండ్, మా మనుషుల్ని మేల్కొలిపిన ఇంగ్లాండ్. పరస్పర విరుద్దమైన ఎన్నో భావాలు, బలమైనవీ, కోమలమైనవీ; స్పష్టమైనవీ, అస్పష్టమైనవీ ఎన్నో తెరలు తెరలుగా తరలిపోయాయి.. పునరిజ్జీవనం, మాగ్నకార్టా..........చరిత్ర-వర్తమానం విభజనరేఖలు చెరిగిపోయిన విశిష్టబిందువు వద్ద నిల్చున్నానన్న భావన నన్ను సంభ్రమపరిచింది".

ఓ ఎస్, మాగ్నకార్టా!

ఎవరబ్బా ఈయన? 'ఋతుపవనాల మలుపుల్లో తొలిజల్లులు' వేసిన మంత్రాల గురించీ, అవి 'వేసవి నేలల్ని తడుపుతున్నప్పుడు' పుట్టించిన కొత్త ఆయువుల గురించీ మాట్లాడుతూ మాగ్నకార్టా లోకి వెళ్లిపోయాడు!

ఇందాకటి ఈమెయిల్ ఫినిష్ చేయనే లేదు. ఏంటది?

"................మనుషుల మీది ప్రేమా అండ్ వాట్ నాట్?!! He mesmerized me! ముఖ్యంగా మీలాగా ఆయన నేచర్ ని, హిస్టరీ లని ఇష్టపడ్డా, మీలాగే తనకీ హిస్టరీయే కాస్త ఎక్కువిష్టమనుకుంటా. I seriously want to know your opinion on his travelogue".

***

నాలాగే ఈస్ట్ నుంచి వచ్చిన మనిషీయన. వెస్ట్ ఎలా కనపడింది?. ఇంగ్లాండ్ చరిత్ర తవ్వటమంటే, ప్రస్తుత ప్రపంచ చరిత్ర తవ్వటమే. ఎంపైర్ ఎండ్ అవ్వచ్చేమో, కాని ఇష్టమున్నా లేకున్నా, ఇంకా నడుస్తున్న చరిత్ర అది. మనసొప్పుకోకపోయినా అది మనందరి చరిత్ర. అసలు ఆయన దృష్టిలోకి ఏం వెళ్ళాయి? ఏయే మెతుకులు పట్టుకుని చూడాలనుకున్నాడు? 

ఈయన ఒక గాఢ భావుకుడన్నది తెలూస్తూనే ఉంది. నేత్రద్వయం సహాయంతో ఊహాలోకాల్లో వేసుకున్న చిత్రాలని పచ్చటి తెర మీదకి తిరిగి చిక్కటి వచనంలో ప్రొజెక్ట్ చేయటం ఆయన బలమే, కానీ గిరగిరా తిరుగుతూ దొర్లిపోయే ఈ గుండ్రటి ప్రపంచం దారిలో తనే తెల్లటి తెరయై పరుచుకోని, అది వెళ్లిపోతూ విడిచిపోయిన ముద్రణలు భద్రపరచుకోని, తనే ఒక పెయింటింగ్ అయిపోవడం ఈయన ప్రత్యేకత. అనుభూతుల్ని కలిగించే చిత్రంగానే కాదు, అధ్యయనం చేయాల్సిన గ్రంధంగా కూడా తను ఎదగడం ఈయన సత్యశోధన ప్రయత్నాలకి సాక్షం.

అసలివన్నీ కాదు. వీటన్నిటికన్నా మిన్నగా, ఈయన ఒక గొప్ప విధ్యార్ధి. 

కొత్త విషయం నేర్చుకోవటానికి వెళ్లినప్పుడు, మసక ముగ్గుపిండి కలరే కాదు, మరే ఇతర రంగూ పైన పేరుకోని నల్ల పలకని శుభ్రంగా పెట్టుకుని తీసుకుని వెళ్లే ఒక సిన్సియర్ విద్యార్థి.

అంతేకాదు ఈయన మనస్సొక పరుసవేది. తన ఇంద్రియాలకి గోచరించినవీ, అంతచక్షువులకి స్ఫురించినవీ ఆయన రాసుకుంటున్నప్పుడు, ఆ మనో:పలక పైన కంటికి కనిపించని అరల లోకి,పొరలలోకి అవన్నీ కవిత్వమై ఇంకుతాయి అనుకుంటాను. 

అందుకే కాబోలు, మన అదృష్టం బావుండి అది మనకి చదివే అవకాశం దొరికిన రోజున, చిక్కటడవి లాంటి చరిత్ర సైతం పత్రహరిత వనమై మనల్ని లోపలకి ఆహ్వానిస్తుంది. మనమెప్పుడూ చదవని కవుల కవిత్వానువాదాలు, తియ్యటి పళ్ల రూపం దాల్చి చేతికందే ఎత్తులో వేలాడుతుంటాయి. చర్చ్, స్టేట్ వ్యవహారాల ఏనుగులు మనముందే గంభీరంగా చెవులూపుకుంటూ వెళతాయి. మర్రిచెట్టు పైన కోకిల పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం వినిపిస్తుంది, ఆ చెట్టు కింద కూర్చున్న తత్వవేత్తలు ఆ పాటలో, తమ పాఠాలు కలుపుతారు. పశ్చిమ గ్రామీణ ప్రాంత సౌందర్యాలు నెమలికంఠం రంగు పరికిణీలు కట్టుకున్న అమ్మాయిలయి అనంతమైన ఆకుపచ్చటి మైదానాల్లో ఆడుకుంటాయి. 

నాటకానికి మకుటాయమైన ప్రదేశంలోంచి వచ్చిన ట్రెడిషనల్ నాటకాలు, ఫౌస్ట్ నాటకాలూ అప్పటికప్పుడు అడవిలో మనకోసం ప్రదర్శించబడతాయి. థియేటర్ అనుభవాలు, గ్రామీణ జీవితపు కబుర్లూ, లైబ్రరీల, మ్యూజియం ల, గ్యాలరీల సందర్శనాలు వనంలోని చెట్లయి, ప్రతీ చెట్టూ పైనా ఉండే రామచిలుకలు మనల్ని దగ్గిరకి పిలిచి తమతమ చెట్ల గురించి ముచ్చట్లు చెపుతాయి. 

వెదురుబొంగులూ, రావిచెట్టు ఆకులూ, సరస్సు పక్కన రెల్లుగడ్డి పొదలు కలిపి చేసే ఆహ్లాద ధ్వనుల్లో పాశ్చాత్య శాస్త్రీయ ఆరోహణావరోహణల్లోని బి.బి.సి సింఫనీలూ, స్ట్రావిన్ స్కీ కృతులూ వినిపిస్తాయి. రెనసాన్స్ నాటి చిత్రకళా మేఘం చివరనుండి జారి, మోడర్న్ ఫోటోగ్రఫీ మెరుపొకటి కనిపించని చీకట్ల మీద మెరిసి, చాటున దాక్కున్న దృశ్యాల్ని చూపిస్తుంది. అంత త్వరగా అంతుపట్టని ఆధునికశిల్పకళ, ఊహా మేఘమై అర్ధం చేసుకోగలిగే ఆకారం లోకి వదిగి రంగులు మారుతుంది. 

లండన్ నగరం 'లక్షపక్షులు వాలిన రాజోద్యానంలా' కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. మేఘం చాటు చంద్రుడి వెన్నెల కొండపై పడి శిఖరాగ్రాన కూర్చున్న లండన్ పట్టణం, కిందనున్న వనమంతటికీ మెరుస్తూ కనపడుతుంది. వీధిపక్కన వాయిద్యం వర్షారణ్యపు మిస్ట్ అయి మన మీద కురుస్తుంది. వనంలో మనం దారి తప్పితే థాచర్, మేజర్, బ్లెయిర్ లు సరయిన దారి చూపించటానికి నేనంటే నేనే సరయిన వ్యక్తినని పోటీ పడి వస్తారు. 

షేక్స్పియర్ బాలనాగమ్మ మాంత్రికుడవుతాడు. క్రైటీరియన్ నాటకశాల లో కొత్త స్క్రిప్ట్ రచయితలు ఆ మాంత్రికుణ్ని బంధించి గేళి చేసే రాకుమారులవుతారు. పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థ, వ్యక్తి శ్రేయోవాదం, సాంఘికవాదాలు బుర్రకథల రూపం దాల్చుతాయి. 

మార్క్స్, ఎంగెల్స్ మనం తిరుగుతున్న వనం లోని చెట్ల కాండాల్ని పరీక్షించడానికి వచ్చి, మనకేసి ఎగాదిగా చూసి పెదవి విరుచుకొని తలలడ్డంగా ఊపుతూ పోతారు. ఊహలవాడ యుటోపియా లో ఉల్లాసంగా సాగిన థామస్ మూర్ నడక, వాస్తవం వాగు రాళ్ళడ్డం పడి బోల్తాపడినప్పుడు, వనంలో వంతెన మీద మొండెం నుంచి తెగ్గొట్టబడిన ఆ స్వప్నప్రపంచపు తల వేలాడుతూ ఊగి ఆగిన దృశ్యం దుఖాన్ని తోడుతుంది. 

మన గాయం మీదనుంచి రాలిన రక్తపుధూళి ని కప్పుకున్న కోహినూర్ వజ్రం ఎప్పుడో తప్పిపోయి, ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. కానీ వనం లోంచి వెళ్లే ప్రతీ బాటసారి నిబిడాశ్చర్యంతో తడమడంతో కడగబడటం వల్లనేమో, స్వచ్చధవళంలా ఆకుచాటునుంచి మెరుస్తుంది.

ఎముకలుకొరికే చలిలోని బిక్షగాళ్లు కలతనిద్రల్లోంచి నడచొచ్చి పచ్చనివనంలో కాకులయి వాలతారు.

మరోతోవ లేకుండా ప్రపంచాన్ని అక్షరాస్యత వైపు నెట్టిన గూటెన్ బర్గ్ తొలి ముద్రిత గ్రంధం చెట్టు తొర్రలో కనపడ్డప్పుడు కమ్మిన ఉద్వేగం సుడిగాలయి రేగుతుంది. ఒకప్పుడు అల్లనేరేడి పళ్లని విరివిగా రాల్చిన చెట్టు ఈ రోజు ఎప్పుడో ఒకప్పుడు ఒకటీ అరా కాయ విదిలిస్తోందని ఇంగ్లీష్ సినిమా గురించి వాపోయిన వైనం వేడిగాలయి చుడుతుంది.

***

ఏం చెప్పను?

వనమంతా తిరిగొచ్చాక కండెన్స్డ్ మిల్క్ తో ఒక తీయటి పానీయం తాగిన అనుభూతిని మిగిల్చి, తల పైకెత్తి గ్లాస్ లోని ఆఖరి చుక్కలు సైతం గొంతులోకి వంపుకోవాలనిపించి, ఆ పై ఇంకా కావలనిపించి గ్లాస్ వెనకాల ఒకచేత్తోబాదినట్లుగా, అక్కడక్కడా పేజీలు తిప్పి మళ్లీ చదివి, ఆ పై మొదటిసారి గ్లాసోవర్ చేసిన లైన్లని తిరిగి చదివిపించాలనిపించే శైలి ఈ చినవీరభద్రుడి గారిది.

***
ఇంతకీ ఈ నిత్య పథికుడు నడుస్తూ చూస్తూ ఏమనుకున్నాడు? 

"..... దాని ఉదాసీనతా, గతంలోని రక్తపు చారికలు, అది లేవనెత్తిన పారిశ్రామిక నమూనాలోని భయానక పరిణామాలు, దాని అంతర్గతసంక్షోభం నాకు కలిగించిన సిక్ నెస్ మొదటివారమంతా నన్నంటి పెట్టుకునే ఉంది.......................కానీ ఈ నాగరిక ఉదాసీనతలో సూర్యరశ్మిలాగా మనుషుల ఆత్మీయత నన్నూరడించింది"

".......బ్రిటీష్ ఆంథ్రోపాలజిస్టుతో నేనన్నాను కదా....నన్నాకర్షించినవెన్నో ఉన్నప్పటికీ నేను మొట్టమొదట చెప్పగలిగేది మీ ప్రజలు అభ్యాగతుల పట్ల చూపిస్తున్న ఆదరణ. నా దేశం తన ఐదువేల ఏళ్ల సాంస్కృతిక చరిత్రలో ఎన్నో విలువల్ని పైకి తీసుకొచ్చింది. కాని ఆగంతకుడు, అభ్యాగతుడూ నీ ఇంటిముందుకు వచ్చినప్పుడు అతన్ని మిత్రుడిగా చేరదీసుకోవడమనేది నా దేశంలో ఇంకా ఆదర్శమే తప్ప పూర్తి ఆచరణకు రాలేదు. కాని ఇక్కడ ఎన్నో ఉదాహరణలు. మీ దేశం వైభవం మీ పరిశ్రమల్లో , కవిత్వంలో, రాజవంశీకుల ఆభరణాల్లో, ఆర్కిటెక్చర్ లో లేదు. అది అపరిచుతుల్ని మిత్రులుగా దగ్గరకు తీసుకోగలిగే సంస్కారంలో ఉంది అని"

".....తన లోపాల గురించి తనకు గల ఈ జాగృతి లోనే ఐరోపీయమానవుడి నిజమైన విజయం ఉందనిపించింది నాకు. .."

"..ఆ రాత్రి నేను క్రీస్తు పునరుత్థానం చెందడాన్ని కళ్లారా చూసాను. మృత్యుతుల్య హిమరాత్రులనుండి సూర్యరశ్మిమంతమైన వసంతప్రభాతల్లోకి మేల్కొంటున్న జనజీవితం నన్నుకూడా నా గాఢనిద్రనుండి పైకి లేపింది........ ఆ రాత్రి నేను నా జీవితంలోకెల్లా అత్యంతసుందరమయిన దాన్ని దేన్నో చూసినట్లే భావిస్తున్నాను. లండన్ మహానగరంలోని ఆ రాత్రి తరువాత నేను మరింత బలోపేతుడిగా, సంతోషభరితుడిగా మారానని చెప్పుకోడానికి నాకేమీ సంకోచం లేదు..."
*
ఎన్నో రకాల సంవేదనలనంతరం ఆయన స్పందనలేమిటి? ఈ విద్యార్థి "నేను తిరిగిన దారుల్లో" అని పేరు పెట్టుకున్న పుస్తకంలోని ఈ దారి చివర కూర్చొని చివరి పేరాగా ఏం రాసుకునుంటాడు?

"ఈ కొద్ది రోజుల అనుబంధంలో ఇంగ్లీష్ మానవుడి గురించి ఏం గ్రహించాను నేను? ఎన్నో సందర్భాల్లో అతని ఔదార్యానికీ, సంస్కారానికి చేతులు జోడించాను. మరెన్నో సందర్భాల్లో అతని వ్యథకీ, సంక్షోభానికీ నా సంఘీభావాన్ని ప్రకటించాను. ఒకప్పుడు ఇతర జాతుల్ని ద్వేషించి అణచి వుంచిన ఇంగ్లీష్ మానవుడు కాడు ఇతను. మహాచారిత్రకయుగాల అనంతర దశలోని మానవుడు ఇతను". 

"హైద్రాబాద్ లో బాగా నిద్రపట్టిన ఒక రాత్రి ఏదో రెక్కలగుర్రంలో కలలో ఆ పచ్చికబయళ్లలోకి తప్పిపోయి ఒకరోజంతా తిరిగి మళ్లా ఏ కారణంచేతనో నాగదిలోకి నా రొటీన్ లోకి మేలుకున్నట్లుంది , ఇప్పుడా యాత్ర గుర్తొస్తే".

*****

ఈ అధ్యాయం ఒక్కదానికే పుస్తకంలో నాలగవ వంతు కేటాయించారు రచయిత. ఇది కాక ఇంకా అరకు, శ్రీశైలం, పాపికొండలు, త్రయంబకం, ఆగ్రా, మధుర, అరుణాచలం, ఢిల్లీ లో తన యాత్రానుభవాలు, యాత్రాలేఖలు, యాత్రాకథనాలు భద్రపరిచి, తన భద్రమన్నయ్యకి అంకితమిచ్చారు. 

మరి, పరాయిదేశమే కాదు, ఒకప్పుడు తనని పాలించిన దేశమూ, తనంతగా ఇష్టపడని పారిశ్రామిక నమూనా సంఘంలోనే ఆత్మ సౌందర్యాన్ని చూడగలిగిన మనసు, తన దేశంలోనే రంగు రంగు అందాల మెత్తటి పూపొప్పొడి పరుపుల్లోకి విసరబడ్డప్పుడూ, ఆధ్యాత్మికత జ్యోతి తన ఆత్మని వెలిగించినప్పుడూ తన మనసు ఏం లిఖించుకొని ఉంటుందో కదా?!!

అవి చదువుతుంటే, మసీదులోని బాబా మనకై పొగ ఊది, చేతిలోని దండంతో మెత్తటి ఈకలని కళ్ల మీదుగా జార్చినప్పుడు కలిగే అనుభూతి కలుగుతుంది. 

ఓపికుంటే ఆ వివరాలు మరెప్పుడైనా.