Sunday 4 January 2015

చిన్నప్పుడెప్పుడో కథ చదువుకున్నాం గుర్తుందా?

యమధర్మరాజు తన కోసం భూమ్మీదకొచ్చినప్పుడు తప్పించుకునేందుకై, ఒక ప్రఖ్యాత నైపుణ్యుడైన శిల్పి తనలాంటి ఏడు విగ్రహాలని తయారు చేసి వాటి మధ్యలో తనూ ఒక శిలలా నించున్నాడనీ, వాటిని చూసిన యముడికి అందులో ఎవరు సజీవమైన మనిషో, ఏది నిర్జీవమైన శిలయో గుర్తుపట్టలేక నీరుగారిపోయాడనీ, పరాజితుడై పోలేక చిట్టచివరకి ఒక ఉపాయం తట్టి అతిశయాలంకారలతో శిల్పిని పొగిడి ఔరా ఈ శిల్పి ఎవరని ఆశ్చర్యపోతే, పొగడ్తలు తలకెక్కిన శిల్పి , అది నేనే అని ముందుకొచ్చి నించున్నాడనీ తద్వారా తనకి యమపాశం వాత పడిందనీ.

నీతి మనందరకీ తెలిసిందే. పొగడ్తలకి గుండెపొంగని, కొండొకచో మెదడు వాయని మనిషి ఉండడని.

అయితే ఇదే కథ దీనికి వ్యతిరేకంగా జరిగి ఉంటే?

పొగడ్తలకి శిల్పి లొంగిపోకుండా, యమధర్మరాజే ఆ శిల్పకళ కి దాసోహమయి ఉంటే?!!

***

“జీవకళ ఉట్టిపడుతోంది”,
“జీవం తొణికసలాడుతోంది”

గొప్ప కళాకారుల సృష్టి గురించి ఇలాంటి పోలికలూ, పొగడ్తలూ అక్కడక్కడా, అప్పుడప్పుడూ వింటూంటాం .

ఒక అద్భుత సౌందర్యవంతమైన విగ్రహాన్ని చెక్కి, అది జీవకళ ఉట్టిపడేలా తయారు చేసే పనితనం గొప్పదే. అదో గొప్ప లోకమే. కానీ ఈ లోకంలో శిల్పి చేతిలో ముడిసరుకు రాయి మాత్రమే. అహర్నిశలూ అభ్యాసం ద్వారా సాధించిన నైపుణ్యంతో చెక్కిన ఆ ముడిసరుకుకి జీవకళ అబ్బుతుంది.

Stone takes a lively form here.

కానీ ఆ లోకాన్ని దాటి వెళ్తే కొన్ని ఊర్ధ్వలోకాలుంటాయి. అందులో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది.

ఆ లోకాల్లో బ్రహ్మ ఉంటాడు. ఆయన చేతిలో ఉండే ముడిసరుకు ‘లైఫ్’. దాంతో ఏం చేసినా సజీవమైన సృష్టే జరుగుతుంది. లైవ్లీ, లవ్లీ లకి అవతలి లోకం అది. లైఫ్ సర్వాంతర్యామి అయిన లోకం.

Life manifests into many forms here.

***

కథ లో ఏమయింది ఇంతకీ?

ముందు శిల్పి తెలివితేటలకి ముచ్చటనొందిన యముడు, ఆ పై ఆ శిల్పకళానైపుణ్యం తనని స్థిరచిత్తువుని చేసిన క్షణాలు గుర్తుతెచ్చుకున్నాడు.

మహిషం దిగి ఆ శిల్పాల ముందు నిలపడి మరోసారి గమనిస్తూ, దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. గుండెలో అనాదిగా దాగున్న చిన్న బుడగ ని తాకి ఏదో కదిలిస్తోందోన్న విషయం యముడికి తెలుస్తోంది. అది హఠాత్తున పగిలిపోయి ఆ ఖాళీ,  హృదయం లో సన్నటి బాధకి కేంద్రమవుతోందని అనుభవంలోకొస్తోంది.

మరో నిమిషం అక్కడే తచ్చాడి, వాహానారోధితుడై బ్రహ్మపురికేగాడు.

తనదగ్గిరకొచ్చిన యముణ్ణి చూసి, బ్రహ్మ భయాశ్చర్యానికి లోనయినా తేరుకొని యముని వంక అనుమానంగా చూసాడు. అలనాడు యముడికిచ్చిన వరం గుర్తొచ్చింది. యమపాశానికి తిరుగు లేదనీ, ఒకసారి ప్రయోగించాక విఫలమవదనీ తనిచ్చిన మాట గుర్తొచ్చింది. రాకూడని చోటకి యముడెందుకు వచ్చాడా అని సాలోచనగా చూసాడు.

ఆతృత తో వచ్చిన యముడు, ఆలస్యం చేయకుండా తన విన్నపాన్ని మొదలుపెట్టాడు.

“కమలసంభవా, కర్తవ్యబద్దంగా నిరంతర భూలోక ప్రయాణీకున్నయిన నాకు, ఎన్నడూ నీ ముంగిటకి రావలసిన అవసరం కలగలేదు. కనుక నీ సృష్టి ఎలా జరుగుతుందో నాకు తెలియదు. నిరూప, నిర్గుణ, నిర్యాద్యంత లోకాల్లో కాలం లేని శూన్యం లోంచి, మానవ రూపాన్ని సృష్టించి, ప్రాణాన్ని పోసి, తనకి కాలాన్ని ఆరంభం చేసి భూమ్మీదకి పంపే నీ సృష్టి ప్రక్రియని నేనెప్పుడూ గాంచలేదు.

నేను అంతిమధర్మ అమలుకర్తననీ, పక్షపాత,రాగద్వేషాలకతీత బాధ్యతలు కలవాణ్ణనీ, కించిత్తు కర్తవ్యలోపమైనా సరే, సమస్తలోక సమతుల్యతని దెబ్బతీస్తుందన్న సత్యభారంతో, యుగాలుగా నిర్వికారంగా నా పాశంతో ప్రాణాన్నాపి, నీ మానవుణ్ణి నిర్జీవిని చేస్తూ వస్తూన్న నేను, మొదటిసారిగా సృష్టి ఎలా జరుగుతుందో చూసాను .  జీవం బయటకి రావటం తెలిసిన నేను, జీవకళ రాయి లోపలకి ఎలా వెళ్తుందో చూసాను. చివరి తాకిడి పిదప ఉలి పక్కన పెట్టిన శిల్పి, కళ్ళారా తన సృష్టిని చూసి కళ్ళూ, హృదయం నింపుకోవడం చూసాను.

ఓ చతుర్ముఖా, యుగాంతమెరుగని నేను, మానవులకి వారి అంతిమగమ్యం గా సుపరిచతమయ్యాను. అనంతంగా, వినాశ ధర్మ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ మానవులకి దుఖాన్నిస్తున్న నాకు, ఒక్కసారి నా ఈ స్థానంలోంచి , నీ స్థానంలోకి రావాలనుంది. అనంత ప్రాణికోటి మృత్యానంతర శూన్యాన్ని మనుషుల మీదకి వంతులవారీగా పంచుతూ పోయే నేను, ఆ నిరంతర నిర్వికారపు స్థితి స్థానంలో, నీ సృజన క్రియ మాధుర్యాన్నీ, కొత్తసృష్టిని కలిగించటంలో జనించే అమృతానందాన్ని ఒక్కసారయినా అనుభవించాలనుంది అబ్జజా”, అన్నాడు.

అది విన్న వాణీవిభుడు ఆశ్చర్యపోయాడు. అంతం ఆది అవాలనుకుంటోందా? ప్రళయకాల సంకేతమేమీ కాదు కదా ఇది? అని ఆలోచించాడు. యుగాలుగా జరుగుతోన్న మానవలోక సంపర్కం మానవీయ రాగద్వేషాల వైపు యముణ్ణి నెడుతోందనీ, దుఖకారకుణ్ణన్న స్పృహ యముణ్ణి ప్రభావితం చేస్తోందనీ, తను మానవదుఖశాపగ్రస్తుడవుతున్నాడనీ బ్రహ్మ గ్రహించాడు. వృత్తాకారంలో మృత్యుప్రాణాలొకదానివెంట మరొకటి నిరంతరంగా పరిభ్రమిస్తూ ఏర్పరిచే సమతూకం లోంచి తను సడలిపోతే జరిగే ప్రమాదం బ్రహ్మ ముందు కదలాడింది. యమధర్మరాజు కోరికని కొద్దికాలం కోసమయినా తీర్చి, తనలో ఉత్తేజాన్నినింపి, తిరిగి కర్తవ్యమార్గంలో పెట్టాల్సిన భాద్యత తనమీద ఉందని అనుకున్నాడు.

చిన్నగా నవ్వి, “ఓ సూర్యపుత్రా, సమసమాజ సమానత్వం అంటూ ఆర్తి పడే మానవజాతికి అంతిమ సమానత్వాన్ని అందించే భాద్యతని నిర్వర్తిస్తున్న ఏకైక దేవదేవుడివి, నీవిలా దిగాలు పడటం భావ్యమా?! అయినప్పటికినీ నీ కోరిక సమంజసమే అన్న భావన కలుగుతోంది. ఈ క్షణమే నిన్ను నా స్థానంలో కూర్చోపెడుతున్నాను.

నీలో సంవేదనని పరాకాష్టకి చేర్చి, ఈ కోరికని ఉధ్బవించేలా చేసిన శిల్పిని చూడాలన్న ఉత్సుకత నాలో మొదలయింది. నా సృష్టి చేసిన సృష్టి, నిన్ను మరో సృష్టి చేయడానికి ప్రేరేపించిందా?! భళా! వెనువెంటనే భూగ్రహవాసానికి వెళ్తాను”

అని మానవమరణానంతర ధర్మకర్తని, తాత్కాలికంగా మానవజన్మారంభపు సృష్టికర్తగా చేసి, బ్రహ్మ మానవావతరం ధరించి భూమ్మీదికొచ్చాడు.

యముణ్ని కదిలించిన శిల్పినీ, తన నైపుణ్యాన్నీ , తన సృష్టినే తలదన్నేట్లున్న ఆ శిల్పాల్నీ చూసి అవాక్కయ్యాడు, అసూయ చెందాడు, కించిత్తు స్వీయావమానభారాన్ననుభవించాడు.

ఔరా, నా చేతుల్లోంచి జారిన మనిషి, చివరకి నా స్థానాన్నే జార్చేసాడే!. సాక్షాత్తూ బ్రహ్మని అయిన నేను, తలచుకుంటే ఈ శిల్పి శిల్పకళని దిగదుడిచేలా, రాబోయే అనంత కాలంలో అనేకసార్లు రాబోయే యముడు అబ్బురంతో ఆనందపడేలా, మరింకో సారి మరే ఇతర మానవుడి శిల్పకళకీ మైమరపు చెంది కర్తవ్యం మరవకుండా ఉండేలా, అంతే కాదు సమస్త దైవలోకం సైతం అచ్చెరువొంది వారి వారి విశ్రాంత వేళల ధరణీవిహార సందర్శనా స్థలం లా, మానవ లోకం మలుపు తిరిగేలా సృష్టించటం నాకు చిటికెలో పని కదూ !
అని తలంచిన పద్మోద్భభవుడు, రాతిని చేతుల్లోకి తీసుకోని రెండు చేతులతో మర్ధించి, మైనం లా చేసి, చేతివేళ్లతో చెట్టువేరుల్నిరప్పించి, అందులోంచి ఆకుల్ని పుట్టించి, ఆకుల్లో కాండాల్నీ , అందులోంచి లతల్నీ, ఆ లతలు అల్లుకున్న మానవ దేహంలో నాడీ మండలాల్ని సృష్టించి, దాని చుట్టూ ఉన్న వంపుల్లో మాంసాన్ని కూర్చి, కళ్ళల్లో భావావేశాల్నీ, చెక్కిట కన్నీటి చుక్కల్నీ అలవోకగా అమర్చి, "అపోలో అండ్ డాఫ్నే" యే కాక, మరెన్నో సజీవ రూపాల శిల్పకళతో ఆ ఆదిశిల్పి  మానవలోక మనోలోకాన్ని నిబిడాశ్చర్యంతో స్థంభింపచేసాడు.

మానవ రూపంలో ఉన్న ఆ బ్రహ్మనే , ఆ లోకం బర్నీని అని పిలుచుకుంది.

***

కానీ, అమరత్వమెరుగని నేలపైనున్న లలాటలిఖితుడికి ఆ విష్ణుమాయ తప్పలేదు. సృష్టికార్యతృప్తిఫలాల్ని యమధర్మరాజు కి అందించాలనుకొని, తన లోకాన్నీ, స్థలకాలాంతారస్థానాన్నీ త్యాగం చేసొచ్చి మానవాకారాన్ని ధరించిన విధాత కి, అనివార్యమయిన మానవజన్మ దు:ఖం ఎదురయింది.

జన్మనిచ్చానే కానీ, ప్రాణమివ్వలేకపోయానే అని కుమిలిపోయిన బ్రహ్మ దు:ఖం తో, సమస్త మానవజాతి ఏకమయింది.
***
Below: Rape of Persephone by Bernini
(Pictures taken from Google Images)

Saturday 3 January 2015

Art of Storytelling in Art

Posted by Kumar N on 1/03/2015 04:49:00 pm with 2 comments

ఒక కథ చెప్పాలనుకున్నారనుకోండి, ఎలా చెప్తాం?

అనగనగా అని మొదలుపెట్టి అంచెలంచెలుగా ముందుకెళ్లొచ్చు, లేదంటే అప్పుడేమయిందంటే అని చెప్పి, అలా ఎందుకయిందో చెప్పడానికి వెనక్కెళ్లొచ్చు. అదీ కాదంటే అక్కడక్కడా చెపుతూ టీజ్ చేస్తూ ఒక మేజ్ లోకి తీసుకొచ్చి తననే మొత్తం దారినీ, తద్వారా కథలోని పాత్రలతో ఎంపథీనీ వెతుక్కోమని పాఠకుణ్ణి వదిలేయచ్చు.ఇలా ఇంకా చాలా రకాలుగా చెప్పొచ్చు.

వరస సరే,మరి కథ చెప్పే పద్దతీ, టోన్? వీటికసలు అంతే లేదు..

బాగా వర్షం పడ్డాక పుట్టుకొచ్చి కొండగోడలకంటుకుని ఘాట్ రోడ్ పక్క న వడివడిగా పారుతున్న కాలవలా చెప్పొచ్చు, లేదంటే చూరునుంచి గోడనానుకొని శబ్ధం లేకుండా నిరంతరంగా జారుతూ చాపంతా తడిపే సన్నటి ధారలా చెప్పొచ్చు. అదీ కాదంటే పందిరి మీదున్న ఆకు చివర నుంచి ఒకదాని వెంట కాసింతసేపాగి మరొక చుక్క జారిపడే వైనంలా చెప్పొచ్చు,అవే కాదు, సిగ్నల్ దగ్గర కార్ ఆగి ఉన్నప్పుడు, వెనక నుంచి వెళ్లి ఇంకో కార్ తో అమాంతం గుద్దేసిన కుదుపుతో చెప్పొచ్చు, పెళ్ళింటి గుమ్మంలోఅమ్మాయి అత్తరు చల్లుతున్నట్లుగా చెప్పొచ్చు, చీకట్లో బొంత మీద వెచ్చగా దుప్పటి కప్పుకొని రెడీ అయ్యాక, ఆహ్లాదంగా మొదలెట్టి ఆంజనేయస్వామీ ఎప్పుడు తెల్లారుతుందా అనిపించి వణికించేలా చెప్పొచ్చు, . ఇలా ఎన్నో రకాలుగా చెప్పొచ్చు.

కానీ సామెతేదో చెప్పినట్లుగా, బ్రెయిడ్స్, బాంగ్స్, బాబ్స్, అప్-డూస్, ఫ్రెంచ్-ట్విస్ట్స్,ప్లెయిట్స్ ఇవన్నీ వేసుకోగలగాలంటే హెయిర్ ఉండాలి కదా ముందు. అలాగే మూలమలుపుల తో మాజిక్స్ నీ, చెప్పే గొంతు ఎత్తొంపులతో శ్రోతల గొంతుల్ని పట్టేయటాన్నీ ,ఎలిఫెంట్ ట్రాప్ లతో పాఠకుల్ని పైకిరాలేని గోతుల్లోకి దించడాన్నీ, క్వీన్స్ గాంబిట్స్ తో ఉక్కిరిబిక్కిరి చేయడాన్నీ చేయగలగాలంటే మన దగ్గిర అక్షరాలో, మాటలో అనేబేసిక్ టూల్స్ ఉన్నాయి కాబట్టి ఏవో అవస్థలు పడొచ్చు.

మరి అవి లేని రోజున, లేక అవి వద్దనుకున్నప్పుడో, అదీ కాక అసలువేరేలా చెప్పాలనుకున్నప్పుడు కథలు ఎలా చెప్పారు ?ఈ రోజున ఉన్న ఆడియో, వీడియో, ఆల్ఫబెట్స్, వాయిస్ రికార్డర్స్, సింథసైజర్స్ లాంటి పనిముట్లు లేని రోజున కథలెలా చెప్పారు?

అది సరే, ఇంతకీ అసలు కథ ఎందుకు చెప్పాలి అనిపిస్తుంది మనుషులకి?

ఐ డోంట్ నో..

ఈ భూమ్మీద మనిషితో పాటే కథ పుట్టింది అనుకుంటాన్నేను.. హ్యుమన్స్ ఎలిమెంటల్ లెవల్ లో స్టోరీ-టెల్లర్స్ అనిపిస్తుంది నాకు.

వి లవ్ స్టోరీస్. వి ఇమాజిన్ దెమ్, వి క్రియేట్ దెమ్, వి లివ్ దెమ్, వి సీ దెమ్, వి లైక్ టు టెల్ స్టోరీస్. అసలు వి ఆర్ బార్న్ టు టెల్ స్టోరీస్ ఏమో కూడా!! అందుకే ఆ అర్జ్ వస్తుందేమో.

ఐ డైగ్రెస్.

కథ చెప్పటం ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ ఎన్నో రూపాల్లో, రకాల్లో ఈ రోజున మన ముందుంది

సరే అక్షరాలలో, మాటలలో చెప్పే ఆర్ట్ గురించి కాక, కుంచెతోనో, ఉలితోనో చెప్పే ఆర్ట్ర్ట్ చరిత్రని మనమోసారిక్లుప్తంగా చూద్దాం. అన్నిటినీ కాకపోయినా, కనీసం కొన్నిటినయినా. ఇది అకడమిక్ ఆర్టికల్ కాదు కాబట్టి, ఆర్ట్ హిస్టరీ లోంచి కేవలం అక్కడక్కడా ముఖ్యమైనవి మాత్రమే తీసుకొచ్చి ఎక్స్ ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం జరిగిందని మనవి (A polite way of saying "I did Copy & Paste")


***

అందులోకి వెళ్లేముందు అసలు నేనీ సోది చెప్పటం ఎందుకు మొదలెట్టానో చెప్పాలి కదా :) ఆ మధ్య రోమ్ లో నాలుగు రోజులున్నప్పుడు నాకు ఒక మనిషి తగిలాడు. ఆయన నాకో మూడు, నాలుగు కథలు చెప్పాడు. మన పురాణాల్లాగే గ్రీకు, రోమన్ల, క్రిస్టియన్ల కథలవి.. నాకంతకుముందు తెలిసీ తెలీని కథలు . కానీ నేనప్పుడు కథ వినలా, ఆ తరువాతెప్పుడో ఎక్కింది కథ. ఆయన కూడా కథ కోసం కథ చెప్పలా. అందరికీ తెలిసిన కథే కదా మళ్లీ చెప్పడం ఎందుకు ప్రత్యేకంగా! ప్రత్యేకంగా చెప్పగలిగితే తప్ప? ఎలాగూ పూర్తిగా చెప్పే అవకాశం లేదాయనకి, ఒకే ఒక్క దృశ్యంతో చెప్పాలి.

ఇంతకీ ఏమయిందంటే...

ఇల్లొదిలాకా 18-19 గంటల పాటూ ఏ కునుకూ తీయక రోమ్ లో దిగి, స్నానపానాదులు ముగించుకొని కాథలిక్ చర్చ్ అత్యున్నతపీఠాధిపతిని దర్శించుకొన్నాక , ఇంట్లోంచి బయల్దేరే వారం రోజుల ముందే ఫోన్ చేసి రిజర్వ్ చేసుకొని పెట్టుకున్న టైం స్లాట్ కి ఒక భవంతికి వెళ్లి, ప్రయాణబడలికావస్థలోఉన్న వళ్ళూ, కళ్ళతో యధాలాపంగా నడుస్తూ తలని మూడొందలరవై డిగ్రీలలోనే తిప్పటమే కాక, మధ్యమధ్యలో నడవటం ఆపేసి తల నిట్టనిలువునా పైకెత్తి శరీరాన్ని కూడా మూడొందలరవై డిగ్రీలు తిప్పి సీలింగ్స్ నిండా నిండిన క్లాసిసిజం నాటి పెయింటింగ్స్ ని చూస్తూ పోతూ ఓ కొత్త హాల్ లోకి అడుగు పెట్టగానే, వేల సంవత్సరాల క్రితం నాటి కథని నాలుగువందల సంవత్సరాల క్రితం ఫ్రీజ్ చేసిన ఒక దృశ్యం మమ్మల్ని ఫ్రీజ్ చేసింది. 

నిట్టనిలువుటాశ్చర్యాన్ని కలిగించి, నా కంటి పాపల్ని పెద్దవి చేసి, కండరాలేవిటినో తమ పని చేయటం మానిపించేసి నోరు తెరిపించి, , నడక మరిపించిన ఆ శిల్పకళ గురించి రెండు మాటలు చెప్పుకుందామని వస్తే, ఆ ముక్కలకి ముందున్న ఇంకో రెండు ముక్కలు చెప్పకుండా ఉండడం సబబు కాదనిపించింది. సరే అని అక్కణ్ణుంచి మొదలెడదాం అనుకుంటే, ఇంకాస్త ముందుకెళ్లక తప్పలేదు. అలా కాస్త కాస్త ముందుకు జరుగుతున్నప్పుడు అసలు ఆ దారి మొదటి నుంచి తీసుకు రావాలి కదా, లేదంటే ఇదో మైలురాయనీ, మలుపనీ, మజిలీ అని ఎలా తెలుస్తుంది అనిపించింది. కాని అంత పొడుగైన దారిని చూపించాలంటే ఎంత వేగంగా వెళ్లినా నేల మీద ప్రయాణం అయితే ఎప్పటికీ పూర్తవదు కాబట్టి, ఒక హెలికాప్టర్ లో పైకి లేచి , అంత పైనుంచి చూస్తే కాని మొత్తం దారి అంతా ఒకేసారి కనిపించదని అనిపించి, ముందు ఈ సుదీర్ఘమయిన సుత్తి.
***

తను బతుకుతున్న ప్రపంచానికి ఆర్ట్ రూపాన్నివ్వటం నాగరిక మానవుడి చరిత్ర ప్రారంభానికి ముందే గూహల్లో ఉన్న నరజాతే మొదలెట్టింది. ఆ కేవ్ పెయింటింగ్స్ లోనే సెల్ఫీలు గీయటమో, కనపడ్డ తోటి ప్రాణిరాశుల రూపాలని ముద్రించటమో, లేక ఊహారూపాలైనచిత్రాల్నో దైవాల్నో గీయటమో, జంతువుల దంతాల మీద చెక్కటమో చేసారు. ఇప్పటివరకీ లభించిన ఆర్కియాలజీ జ్ణానం ప్రకారం 15,000 - 18,000 సంవత్సరాల క్రితం గీయబడిన Lascaux, Chauvet గూహల్లో(France) అప్పటి తెగలు జంతువులని ఎక్కువగానూ, సహజత్వానికి దగ్గర గానూ, మనుషులని తక్కువగానే కాక వారిని ఒక సంకేతచిత్రంగా మాత్రమే పెయింట్ చేసారని గమనించవచ్చు. ప్రధానంగా సంచారతెగలుగా జీవించే కాలంలోని ఈ మనుషులు గుహల్లో ఆగినప్పుడు వివిధ ప్రదేశాల్లోని ఆర్ట్ శైలీ, వాటిల్లో చిత్రించిన దృశ్యాలూ సారూప్యతతో ఉండడం కూడా గమనించవచ్చు. 
Venus-de-Laussel లో పదిహేడున్నర అడుగుల ఎత్తున లైమ్ స్టోన్ వాల్ కి చెక్కిన స్త్రీ రూపానికర్ధం తెలియకపోయినా మనుషులకి సెల్ఫీలంటే మోజు ఈ రోజుది కాదని మాత్రం తెలుస్తుంది



***

రాతి యుగపు మధ్యదశని దాటి మనుషులు ఒక దగ్గిర సెటిల్ అవడం మొదలెట్టి సమూహాలుగా బతకటం ప్రారంభమయిన సోఫిస్టికేటెడ్ కాలంలోకి వస్తే , అంటే షుమారుగా 2600 BC లో(4,500 ఏళ్ల క్రితం) కట్టబడిన స్టోన్ హెంజ్ కనపడుతుంది(In England) .సగటున 13 అడుగుల ఎత్తుతో, 7 అడుగుల వెడల్పుతో, మూడున్నర అడుగుల మందంతో ఉన్న రాళ్ళనీ, గరిష్టంగా 25 అడుగుల ఎత్తూ, 8 అడుగుల వెడల్పూ, 5 అడుగుల మందం ఉన్న భీకరమయిన రాళ్లని ఎక్కణ్నుంచో రవాణా చేసి నిలువుగా పెట్టాక, వాటి పైన మళ్లీ అడ్డంగా అదే సైజ్ శిలలని పెట్టి వృత్తాకారంలో నిలబెట్టిన కట్టడంలో ఏం చెప్పడానికి ప్రయత్నించారో, దేనికోసం నిర్మించారో నిర్ధిష్టంగా తెలియక ఎన్నో థియరీస్ కి ఆస్కారం ఇచ్చినా, అదొక ఆర్ట్ ఫామ్ అనయితే స్పష్టమవుతుంది.


















***

నాగరికత మొదలయిన ప్రాంతంగా చెప్పబడుతున్న Fertile of Crescent (see Guns, Germs and Steel book) ప్రాంతంలో Catayl Huyuk , Modern Iraq లాంటి ప్రాంతాల్ల్లో మనుషులు వ్యవసాయ సమాజాల్లో, స్థిరంగా ఒక చోట నివాసముండే జీవనశైలిని అలవాటు చేసుకొని, ఒక హైరార్కీ ని క్రియేట్ చేసుకొని సంఘంగా బతకటం ప్రారంభించారు. సోషల్ ఆర్డర్ అనేది సమాజంలోకి ఇంకిన దశలో ఈజిప్షియన్స్ ‘వ్రాత’ ని కనుక్కొన్నారు. Hieroglyphs లిపి అనుకున్నప్పటికీ అది ఒక ఆర్ట్ ఫామ్. రాజు నేరుగా దేవుడితో మాట్లాడతాడని నమ్మి, మంత్రులతో, విస్తారమైన సిబ్బందితో ప్రజలని పాలించిన కాలంలో ఎన్నో రకాల చిత్రాలు ఆనాటి చాలా కథల్ని చెప్పాయి. రాజుల సింహాల వేటల కథలూ, అవి రాజుల శూరత్వాన్ని చాటించిన వైనమూ, ఒకే పలకకి ఇరువైపులా యుద్దమూ, శాంతిని చెక్కిన వైనమూ ఇత్యాదివి, ఆనాటి వారి ఆలోచనా లోతుల్ని తెలియచేస్తాయి. అలాగే ఒక ఇమేజ్ ని చిత్రీకరించటం కన్నా, డిటెయిల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎలాబరేటేడ్ గా చిత్రిస్తూ కథ చెప్పే స్టోరీ-టెల్లర్స్ రావటం ఈ కాలంలోనే మొదలయింది. సుమేరియన్లు, అకేడీయన్లు, అసీరియన్లు, బాబిలోనియన్ల కాలంలో చిత్రించిన ఎన్నో ఆర్ట్ ఫామ్స్ లభించటం వల్ల, ఈ మెసపోటేమియన్ టైమ్స్ లో మనుషులు ఎలా బతికారన్నదాని గురించి మనకి ఎంతో నాలెడ్జ్ దొరికింది 




























మెసపొటేమియన్ ఆర్ట్ అంతా రాజూలూ, వారి శూరత్వం, వీరత్వం, అధికారం గురించిన కథల్ని ఎక్కువగా చెపితే, ఆ తరువాత వచ్చి ఎన్నో వందల సంవత్సరాలు నిలచిన ఈజిప్షియన్ సంస్కృతి లోని ఆర్ట్, మృత్యువూ, ఆ తరువాతి ఆఫ్టర్ - లైఫ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపింది. ఈ కాలంలో కూడా థియోక్రసీయే ఎక్కువ డామినేట్ చేసింది. గాడ్-కింగ్ గా పిలవబడే ఫారోస్ కి చనిపోయిన తరువాత ఉండే లైఫ్ చాలా ముఖ్యం కాబట్టి, మృత్యువాత పడ్డాక నిర్జీవమయిన శరీరాన్ని భద్రపరచటం చాలా ముఖ్యమైంది. వారు నిర్మించిన పిరమిడ్లు, వాటిలోపల మైళ్ల కొద్దీ పొడుగున్న టన్నెల్స్ గుండా ఫారో ఆఫ్టర్-లైఫ్ లోకి ప్రయాణిస్తాడని వాళ్లు నమ్మేవాళ్లు. వ్రాత ( Hieroglyphs ) నేర్చిన సమాజం కాబట్టి, ఈజిప్షియన్ నాగరికత గురించి మనకు చాలానే తెలిసింది. ఈ కాలంలోని చిత్రకళలో రాజు, రాజాధికారం కన్నా, ఫారో డెత్ అండ్ ఆఫ్టర్ లైఫ్ గురించిన ఫోకస్ ఎక్కువగా కనపడుతుంది. 


ఈ పక్కనున్న చిత్రం లో ఫారో చనిపోయాక మమ్మీలా తయారుచేసాక చేసే రిట్యువల్స్ గమనించవచ్చు. 1. ప్రీస్ట్ చనిపోయిన మనిషి నోరూ, కళ్లూ, చెవులూ మూసి తెరవడం 2. ఇద్దరు స్త్రీలు ఏడవటం 3. మమ్మీ 4. టాంబ్ మీద పెట్టబోయే పలక దాని మీద రాసిన లిపి 5. టాంబ్




















ఎన్నో వందల ఏళ్లు సాగిన ఈజిప్షియన్ నాగరికతలోని ఆర్ట్ లో , కాలం పెద్దగా మార్పు తేలేదు.. ఆర్ట్ నిపుణులకి కనపడే చిన్న చిన్న మార్పులు తప్ప పెయింటింగ్, శిల్పకళ ఒకేరీతిన ఉంటూ వచ్చింది. శిల్పాల సైజులు మినియేచర్ సైజ్ నుంచి, లార్జర్ దాన్ లైఫ్ సైజ్ వరకీ మారినా, శైలి మాత్రం పెద్దగా మారలేదు. అధికారగణం అంతా కూర్చొనో, నించొనో, ఎప్పుడైనా ఒక కాలు ముందుకి జరిపి ఉండటమో, లేక అరుదుగా ఒక మనిషి ఇంకో మనిషిని టచ్ చేయటమో వరకీ మాత్రమే శైలి పరిమితమయింది. మొహంలో ఏ రకమయిన ఎక్స్ ప్రెషన్సూ లేని శైలి. మానవశరీరాన్ని కూడా Hieroglyphs ఆకారాల్లాగే చిత్రించారని మనం గమనించవచ్చు. ముఖ్యమయిన సమాచారాన్ని చూపించటం కోసం ఒక స్కీమాటిక్ డ్రాయింగ్స్ గీసారనీ, నాచురాలిటీకి ప్రాముఖ్యత నివ్వలేదని సుస్పష్టంగా తెలుస్తుంది. ఆర్ట్ ప్రైమరీ ఫోకస్ అంతా టూంబ్స్ మీదే కేంద్రీకరించి, ఎంతో లేబర్ ఫోర్స్ తో ఈ పెయింటింగ్స్ ని వేపించారనీ తెలుస్తుంది. ఈజిప్శియన్ నాగరికత చివరికాలంలో కింగ్ Akhenatan కాలంలో కాస్త మార్పులు తెచ్చుకొని రాణుల Busts, Portraits లలో కాస్తో, కూస్తో నాచురాలిటీ వైపు మొగ్గు చూపినా ప్రధానంగా ఇది ఒక క్రాఫ్ట్ లా మాత్రమే ప్రాక్టీస్ చేయబడిన విద్య. ఫారో, అతని


ఆఫ్టర్-లైఫ్ జర్నీ అందులోని మనుషులూ, ఇమేజరీ ఇలాగే ఉండాలి అని స్ట్రిక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయబడిన రూల్స్ కి పరిమితమయిన స్కిల్స్ తో కూడిన విద్య. మాస్ స్కేల్ లో రిపీట్ చేయబడిన ఈ ఆర్ట్ లో, ఇండివిడ్యుయల్ క్రియేటివిటీ, ఇన్నోవేషన్ కి ఉన్న స్థానం దాదాపు శూన్యం, అందుకే అన్ని వందల ఏళ్లల్లో ఆర్ట్ ఫామ్ లో పెద్ద మార్పు రాలేదు. ఎక్సలెంట్ ఆర్టిఫాక్ట్స్ ఎన్ని ఉన్నా ఇండివిడ్యుయల్ ఆర్టిస్ట్ అనే వాడింకా రాలేదీ కాలం నాటికి.




***

అయితే ఆ తరువాత వచ్చిన గ్రీక్ కాలంలో వచ్చిన క్లాసికల్ పీరియడ్ లో ఆ పరిస్థితి మారింది. ఆర్టిస్ ఇన్వెంటివ్ గా, ఇన్నోవేటివ్ గా తయారయ్యాడు. ఇండివిడ్యుయల్, హ్యుమనిజం కి తొలి బీజాలు పడ్డాయి. గ్రీక్ విజువల్ ఆర్ట్ ని గమనిస్తే, ఈజిప్శియన్ ఆర్ట్ లో చూపించబడిన సమాజానికి, గ్రీక్ సమాజానికి వ్యత్యాసాలు కనపడతాయి. ధీరోధాత్తమైన రాజులు, తమ బలపరాక్రమాలతో, రాజ్యాల్ని మొత్తం అణచిపెట్టి పాలించే రాజుల స్థానంలో, కొన్ని సిటీ-స్టేట్స్ ల కలపోతగా ఉండి, హైలీ-క్వాలిఫైడ్ ఇండివిడ్యుయల్స్ అధికారులతో పాలింపబడిన సమాజమూ, డెమొక్రసీ తొలి ఛాయలు కనిపిస్తాయి. 

ఏనిషియంట్ గ్రీక్ ఆర్ట్ లో మాస్ ప్రొడక్షన్, మాస్-ట్రెయినింగ్-ఆఫ్-స్కిల్స్ చాయలు కనిపించినప్పటికీ ఆర్ట్ కి ఉన్న పరిధి, గాడ్-కింగ్, థియోక్రసీని దాటి హైయర్ పర్పస్ వైపు , కమర్షియల్ ఆర్ట్ వైపూ, ప్యూర్లీ ప్లెషర్ పర్పస్ ఆర్ట్ వైపు ప్రయాణించడాన్ని గమనించవచ్చు. 

గ్రీకుల కాలంలో, ఆర్కిటెక్చర్, sculpture , ఈజిప్ట్ కాలంలోని మెగా స్కేల్ (ex: pyramids) లోంచి , హ్యూమన్ మాన్యుమెంటల్(ex: parthanon) లెవల్ లోకి వచ్చింది. అలనాటి ఏథెన్స్ లో వ్యక్తివాదం వైపు పయనించిన పవనాలు ఆర్ట్ ని ప్రభావితం చేసి ఆర్ట్ రూపురేఖలని మార్చేసాయి. తరాల నించి దిగుమతి చేయబడి, కశ్చితమైన రూల్స్ తో నియంత్రించబడి సహజత్వానికి దూరంగా ఉన్న ఆర్ట్ కి కాలం చెల్లింది. వెస్టర్న్ కల్చర్ లో గ్రీక్ ఆర్ట్ విశిష్టమయిన స్థానాన్ని ఆక్రమించడం మొదలెట్టింది. నేచర్ ని అబ్జర్వ్ చేసి ఆర్ట్ లో పర్ఫెక్షన్ ని సాధించాలని, ఇంపిరికల్ కాలిక్యులేషన్స్, లెక్కల ప్రభావంతో నిర్మించిన శిల్పకళలో పర్ ఫెక్ట్ అథ్లెటిక్, హ్యుమన్ బాడీ కనిపించటం ప్రారంభమయింది. ఈజిప్షియన్ రిజిడిటీ లోంచి గ్రీకులు శిల్పకళని క్లాసిసిజం వైపు మరల్చి. అలనాటీ ఏధెన్స్ లో న్యూడ్ గా క్రీడలు ఆడే ఆచారాన్నీ, ఆటల్లోని హ్యుమన్ బాడీ మూవెమెంట్ నీ సహజత్వానికి దగ్గిరగా శిల్పాల్లో చూపించటం ప్రారంభించారు. పర్ఫెక్ట్ మేల్ న్యూడ్ బాడీ, సేక్రెడ్ గుర్తింపుని తెచ్చుకుంది. ఆర్టిస్టిక్ ఫ్రీడం ని ఉపయోగించుకోవటం, ఐడియల్ పర్ ఫెక్షన్ ప్రగతికి చిహ్నంగా భావించటం మొదలయింది. ఇండివిడ్యుయల్ ఆర్టిస్ట్ కి గుర్తింపు లభించడం మొదలయి, ఆర్ట్ కింద ఆర్టిస్ట్ పేరు సైన్ చేసే పరాకాష్ట దశకి చేరుకుంది. గ్రీక్ ఆర్ట్ నాచురిలజిమ్ నుంచి రియలిజం వైపు ప్రయాణం మొదలు పెట్టింది.

పైన చెప్పిన Fertilel Crescent లో నాగరికత మొదలవచ్చు గాక, మనకి తెలిసిన వెస్టర్న్ నాగరికత , డెమొక్రసీ మూలాలు , ఫిలాసఫీ, ఆర్ట్ , ఇంటలెక్చువల్ రూట్స్ ఇవన్నీ కూడా గ్రీక్ లోని ఏథెన్స్ లోనే మొదలయ్యాయి అన్నది మనకి తెలిసిన విషయమే. అవే కాదు, వాటికి తోడు అలనాటి గ్రీకులు తమ ఆర్ట్ లో బ్యూటీ కి ఎంతో ప్రాముఖ్యత నిచ్చ్చారు. గ్రీక్ నాగరికత కి ముందున్న ఆర్ట్ బ్యూటీని, వివిధ ఆబ్జక్ట్స్ లో వెదికితే, గ్రీకులు ఆ బ్యూటీ అంతా పర్ ఫెక్ట్ హ్యూమన్ బాడీ అనే ఒక ఆకారంలో వెదికారు. గ్రీక్ ఫిలాసఫీ కాలం నాటి ప్రజల ఆకాంక్షల మేరకి ఆర్టిస్టులు ప్రకృతి నీ, ఆ ప్రకృతిలో భాగమయిన హ్యుమన్ బాడీకి ఉన్న అనాటమికల్, స్పిరిట్యువల్ డైమెన్షన్స్ ని తిరిగి సృష్టించారు. గ్రీకులు పర్ ఫెక్షన్ కోసం పడిన తాపత్రయం ఆర్ట్ లోంచి, ఆర్కిటెక్చర్ లోకి మళ్లింది,. పర్ఫెక్షన్ అనేది కేవలం ఆర్టిస్ట్ నైపుణ్యం వైపే కాక, ఐడియల్ రూల్స్ అండ్ రేషియోస్ మీదకి మళ్లింది, హ్యూమన్ బాడీ శిల్పమయినా, ఏధెన్స్ లో 70,000 ఇండివిడ్యుయల్ మార్బుల్ పార్ట్స్ తో నిర్మించబడిన పార్థనాన్ లాంటి పెద్ద మాన్యుమెంట్ అయినా ఆబ్జక్ట్ కొలతలూ, నిష్పత్తులలో పర్ఫెక్షన్ ని పాటించి బ్యూటీ ని సాధించటం మొదలయింది.






కాలచక్రం లో పురాతన గ్రీక్ సంస్కృతి నశించి పోయినా , గ్రీకుల తర్వాత వచ్చిన రోమన్లు గ్రీక్ ఆర్ట్ ని మాత్రం సజీవంగా నిలిపారు. రాజ్యాలు అన్యరాజుల పాదాక్రాంతమయినపుడు, విజేతలు పరాజితుల కళల్నీ, సంస్కృతుల్నీ నాశనం చేయటం చరిత్రలో సాధారణంగా కనపడే విషయం. కానీ ప్రపంచ చరిత్ర లోనే అత్యంత పరాక్రమమయినదిగా పేరుగాంచిన రోమన్ సామ్రాజ్యం గ్రీక్ ఆర్ట్ ని కాపాడింది, తనకి కావలసిన లక్ష్యాల కోసం గ్రీక్ ఆర్ట్ ని నేర్చుకొని, అడాప్ట్ చేసుకుంది. ఆర్ట్ కి ఒక పర్పస్ ఉంటుందని నమ్మిన పురాతన గ్రీక్ కాలం నుండి రోమన్లు కాపీ చేసి అడాప్ట్ చేసుకున్న గ్రీక్ ఆర్ట్ , మరింత ఈస్థటిక్ బ్యూటీ వైపు పయనించింది, ఆర్ట్ మెయిన్ పర్పస్ , ఆర్ట్ ని చూసే ప్రేక్షకుడి అడ్మైరేషన్ కోసమే, అతని ఆనందాశ్చర్యం కోసమే అన్న నిర్వచనాన్ని సంతరించుకుంది . క్లాసిక్, నాచురల్ గ్రీక్ ఆర్ట్ , రోమన్ కాలం లోని రియలిజం వైపు మళ్లి ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అన్న కాలంలోకి వచ్చింది. ఈ రోజుకీ, గ్రీక్ క్లాసిక్ ఆర్ట్ నీ, రోమన్ రియలిజం ఆర్ట్ ని పోల్చి చూడటం సర్వసాధారణం. 

ఏథెన్స్ లో గ్రీకులు ఎథీనా కోసం పార్థనాన్ ని నిర్మిస్తే, రోమన్లు రోమ్ లో డోమ్ తో పాంథియాన్ ని నిర్మించారు. అత్యధిక సంఖ్యలో రోమన్ పౌరుల ఎంటర్టెయిన్మెంట్ కోసం కలోఝియం ని నిర్మించారు. రోమన్ పరిపాలకులు ప్రాగ్మాటిస్ట్స్, ప్రాక్టికల్ మనుషులు. ఆర్ట్ లో బ్యూటీ అండ్ పర్ఫెక్షన్ లో కూడా అవే రియలిజం పర్పస్ లు కనిపిస్తాయి . న్యూడ్ బాడీ బ్యూటీ కన్నా, అదే ఇండివిడ్యువలిస్టిక్ హ్యూమన్ క్వాలిటీస్ మెయింటెయిన్ చేస్తూ వారి రాచరిక వార్డ్ రోబ్స్, గ్రాండ్ గా రోమన్ శిల్పకళలో దర్శనమిస్తాయి. 

గ్రీక్ ఆర్ట్ ప్రధానంగా వ్యక్తి కేంద్రీకృతమయినది, హ్యుమనిజం మీద నిలబడినది, బ్యూటీ , పర్ ఫెక్షన్ కోసం ఆరాటపడిన ఆర్ట్ అది. కానీ రోమన్ ఆర్ట్ ఒక సామ్రాజ్యానికి సంబంధించింది, గ్రీక్ ఆర్ట్ లోని మూలాలనీ, బ్యూటినీ పరిరక్షిస్తూనే, కాపీ చేస్తూనే ఆ ఆర్ట్ ని ఎంపైర్ ప్రాపగాండాకి, పవర్ కోసం వాడినది. 

రోమన్ ఆర్ట్ చిహ్నాలు ఒకప్పటి పశ్చిమ ప్రపంచమంతా విస్తరించి కనపడతాయి. రాజ్యరక్షణ కోసం  ఇంగ్లాండ్ దాకా విస్తరించిన హెడ్రియన్ వాల్ నిర్మాణం, పౌరులకి నిరంతర నీళ్ల సరఫరా కోసం అక్వడక్ట్ ల నిర్మాణం, నగరాల మధ్య కనెక్షన్స్ కోసం రోడ్ల నిర్మాణం, రిలీజియన్ కోసం టెంపుల్స్ నిర్మాణం, ఎంటర్టెయిన్మెంట్ కోసం కలోఝియం ల నిర్మాణం, శుభ్రత కోసం స్నానాల గదుల నిర్మాణాలూ, పౌరుల మధ్య వాణిజ్య సరఫరా కోసం రోమన్ ఫోరమ్స్ నిర్మాణాలూ, విజయ ప్రాపగాండా కోసం ఆర్చ్ ల నిర్మాణాల్లో రోమన్ ఆర్ట్ విశేషత ని గమనించ వచ్చు. రోమన్ కాలం లో ఆర్చ్ కి వచ్చిన ప్రాధాన్యత తరువాత తరాలకీ, నాగరికతలకీ, సమాజాలకీ కూడా విస్తరించింది. దానికి పెద్ద నిదర్శనమే ఆర్చ్ ఆఫ్ కాన్స్టంటైన్. ఆ ఆర్చ్ మీద నిలపడి పాతయుగాల క్లాసిసిజం వైపు, మరోవైపు తిరిగి తదుపరి యుగాల క్రిస్టియానిటీ వైపు చూడవచ్చు. ఎంపరర్ కాన్ స్టంటైన్ క్రిస్టియానిటీ పుచ్చుకుని ఫస్ట్ క్రిస్టియన్ ఎంపరర్ అయ్యాక, గ్రీక్ క్లాసికల్ శిల్పాల్లోని న్యూడిటీ, ఆ శిల్పాల్లోని హ్యుమన్ బాడీ ఫ్లెష్ , స్పిరిట్యువల్ పీపుల్ అయిన క్రిస్టియన్లకి రుచించలేదు. క్రమంగా రోమన్ - క్రిస్టియన్ కాలంలోని ఆర్ట్, హ్యుమన్ బాడీకి నిండుగా బట్టలు కప్పటం ప్రారంభమయింది. ప్రపంచాంతమవుతుందనీ, క్రీస్తు రెండవసారి వస్తాడన్న క్రిస్టియన్ల నమ్మకాలేమో కానీ, ఈలోపు కాలచక్రంలో బార్బేనియన్ల దాడితో, అంతర్గత లోపాలతో రోమన్ సామ్రాజ్యం అంతమవడం మొదలయింది. 

సామ్రాజ్యపతనం, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ని పైకి తీసుకొచ్చింది. క్రిస్టియన్ మతం ఉనికి ప్రమాదంలోకి నెట్టబడి, అది ఆర్ట్ రూపంలో ఐకనోగ్రఫీ కి తెరతీసి , ఆర్ట్ అంతా క్రిస్టియన్ రిలీజియస్ ఆర్ట్ వైపుకి మళ్లింది. 

(గ్రీక్ పెయింటింగ్ మనకి ఎక్కువగా లభించలేదు, కాలచక్రంలో జరిగిన అనేక ప్రమాదాల్లో గ్రీక్ పెయింటింగ్ అంతరించింది. కానీ పాంపేలో బయటపడిన రోమన్ విల్లాలలో గోడల మీది రిచ్ పెయింటింగ్స్, రోమన్ లైఫ్ ని కాప్చర్ రెచేసిన ఆర్ట్ లోంచి గ్రీక్ పెయింటింగ్ ని ఊహించుకోవచ్చు)














రోమన్ ఎంపైర్ 476 లో పూర్తిగా పడిపోయినప్పటికీ, 330 లోనే కాన్స్టంటైన్ తన రాజధానిని రోమ్ నుంచి , కాన్స్టాంటానోపుల్(ఇస్తాన్బుల్) కి మార్చాడు. రోమన్ సామ్రాజ్య పతనం తరువాత నార్త్ వెస్టర్న్ యూరప్ అంతా వచ్చిన డార్క్ ఏజేస్ ఆర్ట్ కి కూడా గడ్డు కాలాన్ని తీసుకొని వచ్చిందనే చెప్పొచ్చు. రోమన్స్ ని ఓడించిన బార్బేరియన్ల సాంప్రదాయ ఆర్ట్ అంత సునిశితమైనది కాదు. ఈ కాలంలో మిగిలిపోయిన కొద్దిమంది క్రిస్టియన్లు మత ప్రచారం కోసం ఆర్ట్ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ ఆర్ట్ అంతా క్రిస్టియన్ రిలీజియస్ ఐకాన్స్ , సింబల్స్ తో నిండిపోయింది. బార్బారిక్ ఆర్ట్ నీ, పాత క్లాసిజం ని రెండింటినీ మిక్స్ చేసిన చిత్రాలు ఈ పీరియడ్లో కనిపిస్తాయి. 

ఆ తరువాత వచ్చిన మిడిల్ ఏజేస్ లో మళ్లీ ఇండివిడ్యువల్ ఆర్టిస్ట్ మాయమయ్యాడు. ఎంపరర్ సర్వీస్ లో క్రిస్టియన్ గాడ్స్ కోసం మాత్రమే ఆర్టిస్ట్ తన శ్రమని వెచ్చించాల్సి వచ్చింది. ఈ పీరియడ్ లో మోనాస్టరీస్ పేదవాళ్లకి షెల్టర్ ఇవ్వటమే కాక మెన్, వుమెన్ ఆర్టిస్ట్ లని, ఆర్ట్ వర్క్ షాప్ లలో ట్రెయిన్ చేసాయి. చిన్న వయసులోనే అబ్బాయిలని పెయింటింగ్, sculpting, building వర్క్ షాప్ లకి పంపి ఆర్ట్ ని నేర్పే వారు. చాలా కాలం ట్రెయినింగ్ తర్వాత ఇండిపెండెంట్ ఆర్ట్ మాస్టర్ అయ్యేవాళ్లు. వీళ్లని ఆర్టిస్ట్ లని అనటం కన్నా ఆర్టిసన్స్ అనటం సబబు. ఆర్టిసన్స్ తమ స్వంత క్రియేటివ్ ఆర్ట్ కన్నా తనకన్నాముందున్న మాస్టర్ ఆర్ట్ ని యధావిధిగా కాపీ చేయగలగటం అనేది చాలా ముఖ్యం. తరాలుగా వచ్చిన పోజెస్, పొజిషన్స్, గెశ్చర్స్ ని మళ్లీ మళ్లీ పెయింట్ చేసేవారు. ఇండివిడ్యువల్ ఆర్టిస్టిక్ టాలెంట్ , డిజైర్ లని గుర్తించక, ఆర్ట్ ని ఒక క్రాఫ్ట్ లా ట్రీట్ చేసిన కాలమిది. ఒక భాషని మారిస్తే సమాజంలోని ప్రజలు ఎంత అయోమయానికి గురవుతారో అలాగే, ఎ. ఆర్ట్ ప్రధానంగా క్రిస్టియన్ గాస్పెల్ స్టోరీ-టెల్లింగ్ కీ, టీచింగ్ కీ ఉపయోగించబడే సమయంలో, ఎన్నో తరాలుగా వస్తున్న ఆర్ట్, ఇమేజరీని మారిస్తే చూసే ప్రేక్షకులు అయోమయపడతారని రిస్క్ తీసుకోని కాలం . ఆర్టిస్ట్ కన్నా, ఆర్ట్(?)ని సెలబ్రేట్ చేసిన కాలం. ఈ కాలంలో ఆర్టిస్ట్ లు లోయర్ క్లాసెస్ లోంచి వచ్చినవాళ్లు. ఆర్టిసన్ లని క్రాఫ్ట్ నేర్చిన లేబర్స్ లా హైర్ చేసేవాళ్లు.









***

అయితే 15వ శతాబ్దం కి వచ్చేప్పటికల్లా ఆర్ట్ ప్రపంచం సమూలంగా మారిపోయింది. 

అయితే ఆ మార్పు కన్నా ముందు మిడీవల్ పీరియడ్ లో యూరప్ నిండా వెలసిన కాథడ్రెల్స్ నిర్మాణాలు ఆర్టిసన్స్ కి కొన్ని శతాబ్ధాల పాటు ఉపాధి కలిపించాయి. ఒకరికన్నా మరొకరు ఎత్తైన కథెడ్రల్స్ నిర్మించాలన్న పోటీలో స్కిల్డ్ ఆర్టిసన్స్ కి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ఈ నిర్మాణాలూ, వాటికోసం కావలసిన ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, ఆర్టిసన్స్, వారి కోసం వాటి చుట్టూ వెలసిన చిన్న చిన్న టౌన్స్ ల వల్ల బిజినెస్ పెరిగింది. మరో మాటలో చెప్పాలంటే రిలీజియన్ వల్ల ఎకానమీ స్టిమ్యులస్ దొరికింది. నార్తర్న్ యూరప్ లో చలి ఎక్కువ కాబట్టి, చర్చ్ ల లోపలకి ఎక్కువఎండ రావడానికి వీలుగా ఎత్తైన పాయింటెడ్ ఆర్చ్ ల గాథిక్ ఆర్కిటెక్చర్ తో నిర్మించబడ్డ ఈ కథెడ్రల్స్ విండోస్ మీదా, ప్ర్హంట్ ఎలివేషన్ (ఫసాడ్) మీదా, చర్చ్ నిర్ణయించిన రిలీజియస్, బైబిల్ స్టోరీస్ పెయింటింగ్స్, స్కల్పర్స్ ఉండేవి నిరక్షరాస్యమైన సంఘం రిలీజియన్ గురించి తెలుసుకునేందుకు వీలుగా. ఆర్ట్ ద్వారా ప్రజలకి మతం గురించీ, మోరల్స్ గురించీ చెప్పాల్సిన బాధ్యత ఆర్టిసన్స్, ఆర్టిస్ట్స్ మీద ఉండేది, మొత్తానికి కథెడ్రల్ ఒక బైబిల్ లా పనిచేసింది అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్ట్ వల్లా, సావనీర్స్ వల్ల, ప్రీస్ట్స్ ధరించే దుస్తుల వల్లా వివిధ రకాల క్రాఫ్ట్స్ కి ఎప్పుడూ పని దొరికేది. ఈ రోజుకీ యూరప్ నిండా నిండి ఉన్న చర్చ్ ల్లో, కథెడ్రల్స్ లో మారుమూలల్లో దాగి, ఇరికి ఉన్న ఎన్నో బొమ్మల్లో ఈ క్రాఫ్ట్ పనితనం గమనించవచ్చు.

















***

ఇప్పటి వరకీ వచ్చిన ఆర్ట్ ఒకెత్తు, ఇక్కణ్ణుంచీ వచ్చిన ఆర్ట్ ఒకెత్తు, అసలు ఆర్ట్ అనే కాదు, ఇక్కణ్ణుంచసలు ప్రపంచమే మారిపోయింది. రెనసాన్స్ మొదలయింది, రెఫర్మేషన్ మొదలయింది. దాదాపు రెండు వందల సంవత్సరాల కాలం పాటు ఆర్ట్ లో, సైన్స్ లో, ఆలోచనలో మార్పులతో, చర్చ్ గుత్తాధిపత్యాన్ని ధిక్కరించి త్యజించడంతో ఈ పీరియడ్ యూరప్ నీ, తద్వారా మానవజాతి చరిత్రనే మార్చేసింది. వ్యక్తివాదం(Individualism), మానవవాదం(Humanism) లకి తెరలేచింది. వ్యక్తి, క్రియేటివిటీ, కొత్త ఆలోచనలు ముఖ్యమయ్యాయి, చర్చ్ చెప్పిన అబద్దాలకీ, బాడ్ ప్రాక్టీసెస్ కి కాలం చెల్లింది. సైన్స్ మానవజాతిని అంతకుముందు చూడని తీరాలకి తీసుకెళ్లింది.

అది చాలా పెద్ద సబ్జక్ట్ కాబట్టి ఇక్కడితో ఆపి, మళ్లీ ఆర్ట్ వైపు వెళ్దాం.

సహస్రాబ్దాలుగా టూ డైమన్షనల్ లో , బ్లాండ్ గా, ప్లెయిన్ గా రేఖా చిత్రాలుగా, రియలిస్టిక్ గా లేకుండా ఉన్న ఆర్ట్, ఒక్కసారిగా థర్డ్ డైమన్షన్ లోకి పోయి, మొట్టమొదటిసారిగా “డెప్త్” అనే న్యూ డైమెన్షన్ ని అందుకొని ఒక పెద్ద అంగ వేసింది. ఈ రెండు పిక్చర్స్ లో ఉన్న మడానా మంచి ఉదాహరణ. ఆర్ట్ రియల్ గా కనిపించటం ప్రారంభమయింది. అలనాడు గ్రీక్-రోమన్ కాలంలోని క్లాసిసిజం మళ్లీ ఊపిరి పోసుకుంది. ( రెనసాన్స్ ని మూడు దశలుగా విభజించి చూసుకోవచ్చు. ఎర్లీ రెనసాన్స్ 1200 - 1400, రెనసాన్స్ 1400-1500 , హై రెనసాన్స్ 1500-1600).  రెనసాన్స్ దశలో టస్కనీ లోని Sienna, Padua ఆర్టిస్టిక్ ఇన్నోవేషన్ కి కేంద్రాలయ్యాయి. Ambrogio Lorenzetti సియన్నాలో వేసిన good government, bad government murals లో వాడిన లాండ్ స్కేప్, 3-డైమన్షన్స్ టెక్నిక్స్ తో సివిక్ లైఫ్ ని perceive చేసిన టెక్నిక్స్ చాలా పాపులర్ అయ్యాయి. 14వ సెంచురీలో చాలా టర్బులెంట్ టైమ్స్ లోంచి వెళ్లిన సియన్నా మరియు ఇతర శక్తివంతమైన సిటీ-స్టేట్స్ ప్రభుత్వాలకి ఈ మ్యూరల్స్ ఒక హెచ్చరికలా పనిచేసాయి. 

ఏ పేరు రాకుండా , లేకుండా వెళ్లిపోయిన ఆర్టిసన్స్ స్థానంలో , ఆర్టిస్ట్ మళ్ళీ ఊపిరిపోసుకున్నాడు. ఆర్ట్ మీద ఆర్టిస్ట్ పేరు కనిపించటం ప్రారంభమయింది. 1550 లో Giorgio Vasari , Lives of the most eminent painters sculptors and architects పుస్తకం ప్రచురించాడు. అందులో Giotto లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ లే కాకుండా , క్రాఫ్ట్ కాకుండా, ఇండివిడ్యువల్ ఆర్టిస్టిక్ టాలెంట్ ప్రాముఖ్యత గురించి వివరించాడు. Paduo లోని Arena Chapel లో Giotto వేసిన అత్యద్భుతమైన ఫ్రెస్కో పెయింటింగ్స్ , వాటిల్లో వాడిన స్పేస్ , డెప్త్ పర్సెప్షన్ , డ్రామా సెట్టింగ్స్, ఎంపథటిక్ ఎమోషన్ ఇమేజరీ, ఎర్లీ రెనసాన్స్ పీరియడ్ విశిష్టతనీ, రాబోయే కాలంలో ఆర్ట్ లో పెనుమార్పులనీ తెలియచేస్తాయి. 

కానీ ఆ తరువాత యూరప్ నిండా ప్రబలిన బ్లాక్ డెత్, యూరప్ ని సమూలంగా నాశనం చేసింది. కుటుంబాలు సమస్తం రాలిపోయి ఊళ్ల నిండా కళేబరాలు పరచుకొన్న ఈ కాలంలోంచి “They ate lunch with their friends and dinner with their ancestors in paradise” అన్న నానుడి పుట్టుకొచ్చేంతగా ప్రభావం చూపిన బ్లాక్ డెత్ ప్రభావం లోంచి తేరుకోవడానికి యూరప్ కి శతాబ్ధం పైగా పట్టింది. ఈరోజు మనం వెనక్కి తిరిగి రెనసాన్స్ పీరియడ్ అని చెప్పుకునే కాలంలో ప్రజలకి రెనసాన్స్ పీరియడ్ లోంచి వెళ్తున్నామని తెలియదు. రెనసాన్స్ ఒక ఈవెంట్ కాదు, టివిలో చూడటానికో, న్యూస్ పేపర్ లో చదవటానికో, అదేమీ 9/11 నాటీ ఏరోప్లేన్స్ దాడులని చూట్టం, లేక 1989 నాటి సోవియట్ పతనాన్ని గురించి చదవటం, లేక తియాన్మాన్ స్క్వేర్ లో ప్రజల ప్రతిఘటనని చూట్టం లేక బెర్లిన్ వాల్ పడటం, చంద్రుడి పై కాలు పెట్టటం లాంటిది కాదు. రెండువందల సంవత్సరాల పైగా జరిగిన మార్పు. నిజానికి ఆ మార్పు అరిస్టోక్రటిక్ ఫ్యామిలీస్ కి తెలిసినంతగా, వారిమీద ప్రభావం చూపినంతగా అప్పట్లో సామాన్యజనానికి తెలీలేదు. ఈ రోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు యూరప్ గ్రీక్ / రోమన్ కాలం నాడు వెలిగి, ఆ తరువాత మిడీవల్ ఏజెస్ లో డార్క్ అయిపోయి, రెనసాన్స్ పీరియడ్ లో మళ్లీ తిరిగి జీవం పోసుకుని , ఆ మార్పుల ప్రభావంతో తదుపరి కాలంలో మరెన్నో లీప్స్ తీసుకొని ప్రపంచానికే మార్గం చూపిందనీ, మానవజాతి జీవనాన్నీ, సంఘవ్యవస్థలనీ, నియమాలనీ, వ్యక్తి - సమాజం - ప్రభుత్వం మధ్య సంబంధాలనే మార్చేసిందనీ మనకి అర్ధమయి ఆ పీరియడ్ ని రెనసాన్స్ అని పిల్చుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో సగటు జీవి జీవనం లో పెద్దగా మార్పులేదు. ఎవరూ మనమో విప్లవాత్మకమైన కాలం లోంచి వెళ్తున్నామని పనులాపుకొని ఆశ్చర్యపోలేదు. 

ఐ డైగ్రెస్ అగయిన్.

మిగతా వాటితో పాటే బ్లాక్ డెత్ ఆర్టిస్టిక్ డెవలప్మెంట్ ని కూడా దాదాపు వందేళ్ల పాటు ఆపేసింది. కాని పదిహేనవ శతాబ్దపు ఆరంభంలో ఇటలీ లోని సిటీ-స్టేట్స్ , ముఖ్యంగా ఫ్లోరెన్స్ ఎందరో ప్రఖ్యాతమయిన రెనసాన్స్ ఆర్టిస్టులని ప్రపంచానికందించింది. ఫ్లోరెన్స్ రూలర్ Medicci ఆర్ట్ నీ, ఆర్టిస్ట్ లనీ, సైన్స్ నీ సపోర్ట్ చేసి, ప్రమోట్ చేసాడు. 

ఈ కాలంలోంచి వచ్చిన బ్రిలియంట్ స్కల్ప్టర్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్ Brunellicci ఫ్లారెన్స్ లోని బాప్టిస్ట్రీ డిజైన్ చేసాడు. మొట్టమొదటిసారిగా కథెడ్రల్ మీద అతిపెద్ద డోమ్ లు నిర్మించడమెలా అన్న సమస్యని Brunellicci సాల్వ్ చేయటమే కాక, Linear Perspective అన్న టెక్నిక్ తో ఆర్ట్ ప్రపంచంలో రియలిజాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చాడు. కెమెరాలు లేని ప్రపంచంలో, ప్రేక్షకుడు నిలపడ్డ పాయింట్ నుంచి చూస్తే ఎదురుగా ఉన్న ఆబ్జక్ట్స్ దూరం పోయిన కొద్దీ ఎలా చిన్నగా అయిపోయినట్ళుగా కనపడతాయో, అలాగే సైడ్స్ కి ఉన్న వాల్స్ దూరం పోయిన కొద్దీ మెర్జ్ అయినట్లుగా కనపడతాయో, అన్నది ఆర్ట్, డ్రాయింగ్స్ లలోకి తీసుకు రావటమే కాక, వానిషింగ్ పాయింట్స్ , ఆర్థోగానల్స్, అనదర్ పాయింట్ ల మాథమాటికల్ ప్రిన్సిపుల్స్ ని వివరించి ఆర్ట్ లోకి తీసుకురావటంతో, ఆర్ట్ లో మొదటిసారిగా స్పేషియల్ రియాలిటీ, స్పేషియల్ యాక్యురసీ అనేది సాధించగలిగి, ఆర్టిస్ట్ ప్రేక్షకుణ్ణి పెయింటింగ్ లోని సెట్టింగ్ మధ్యలోకి తీసుకెళ్ళగలిగాడు.

ఇంట్యూటివ్ గా డెప్త్స్ ని పర్సీవ్ చేసి పెయింటింగ్ వేయటం వేరు, దాంట్లోకి రియల్ వర్ల్డ్ మాధమటిక్స్ జామెట్రీ ఇంక్లూడ్ చేసి , ఇల్యూజన్ ఎఫెక్ట్ తీసుకురావటం వేరు. రెనసాన్స్ ఆర్టిస్టులు రెండవదానిపట్ల అబ్సెస్సివ్ అయ్యారు. 

ఇంకో మాటలో చెప్పాలంటే Brunellecci ఆర్ట్ లోకి సైన్స్ ని పట్టుకొచ్చాడు, తద్వారా ఆర్టిసన్ అంటే ఒక స్క్లిల్డ్ లేబర్ అన్న ఇంప్రెషన్ ని తీసేయగలిగాడు. చిన్న చిన్న స్కల్ప్చర్సే కాకుండా, మాన్యుమెంటల్ డోమ్స్ డిజైన్ చేసి, నిర్మించిన Brunellecci తో రెనసాన్స్ మాన్ అనే ఒక కొత్త వ్యక్తి, ఎడ్యుకేటేడ్ ఆర్టిస్ట్, మల్టిపుల్ ఫీల్డ్స్ లో స్కిల్స్ అండ్ expertise సాధించిన మనిషి పుట్టుకొచ్చాడు. ఆర్టిస్ట్ స్టేటస్ పెరిగింది. ఆర్ట్ లోకి థింకింగ్ నీ, పర్సెప్షన్ నీ, సైన్స్ నీ తీసుకురావటంతో, ఆర్టిస్ట్ ఒక ఇంటలెక్చువల్ గా గుర్తింపు పొందటం ప్రారంభమయింది. Brunellecci , Alberto, Uccello లు ఆర్ట్ నీ, ఆర్కిటెక్చర్ నీ కొత్త పుంతలు తొక్కించారు. ముఖ్యంగా Alberto ఆర్కిటెక్చర్, పెయింటింగ్, స్కల్ప్చర్, మాథమెటిక్స్, పర్స్పెక్టివ్ ల మీద పుస్తకాలు రాసి ఆర్ట్ లో కొత్తగా తీసుకొచ్చిన టెక్నిక్స్ అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. 

ప్రభుత్వాలూ, చర్చ్ లే కాకుండా, రిచ్ అరిస్టోక్రటిక్ తరగతి కూడా తమ ప్రైవేట్ పాలస్ లలో , ఇంటిరీయర్స్ డెకరేట్ చేయడం కోసం ఆర్టీస్ట్ లని నియమించుకోవటం మొదలుపెట్టారు. పైన చెప్పినట్లుగా మెడిచ్చీ లాంటి హైయ్యర్ క్లాస్ ఫామిలీస్ , Botticelli, Uccello ల లాంటి గ్రేట్ఆర్టిస్ట్ ల కెరీర్స్ కి సపోర్ట్ గా నిలచారు. 

ఈ రెనసాన్స్ ఆర్టిస్ట్ లు, ఆర్కిటేక్ట్స్ , ఆర్ట్ కి సొసైటీలో ఉన్న ఆర్టిస్ట్ స్టేటస్ ని ఎలివేట్ చేసారు. ఆర్ట్ కన్నా ఆర్టిస్ట్ ముఖ్యమయ్యాడు. మిడీవల్ ఏజేస్ లో , కేవలం హైర్ చేసుకునే లేబర్ అనే నిర్వచనంలోకి ఒదిగి ఉండిపోగలిగిన ఆర్టిస్ట్ , రెనసాన్స్ పీరియడ్ లో తను చేపట్టిన ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయటం, ఎక్జిక్యూట్ చేయటమే కాక , ఎండ్ రిజల్ట్ కి ఇంచార్జ్ అయ్యాడు. దాంతో ఆర్టిస్ట్ కాన్ఫిడెన్స్ పెరిగింది, తన మాటకున్న బలం కూడా పెరిగింది. అయితే క్రమక్రమంగా రిచ్ పేట్రన్ సపోర్ట్ తో, తన ఇంటెలెక్చువల్ ఎబిలిటీతో, ఆర్టిస్టిక్ టాలెంట్ తో బలపడిన ఆర్టిస్ట్ కీ, ఆర్టిస్ట్ లో స్వతహాగా ఉండే ఆర్టిస్టిక్ ఫ్రీడం కి ఘర్షణ పెరిగింది. 

ఈ తరువాత వచ్చిన దశే హై-రెనసాన్స్. రెనసాన్స్ కి కేంద్రం ఫ్లారెన్స్ అయితే, హై-రెనసాన్స్ కేంద్రం రోమ్ కి మారిందని చెప్పుకోవచ్చు. హై-రెనసాన్స్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ సంపాదించిన డావిన్సీ, మైకాలాంజిలో, రఫాయెల్ లు క్లాసికల్ ఆర్ట్ ని మళ్లీ రివైవ్ చేసారని చెప్పొచ్చు. అయితే ఏ రెనసాన్స్ పీరియడ్లో రిలీజియస్ ఐకనోగ్రఫీ పెయింటింగ్స్ నుంచి దూరమయి ఇండివిడ్యువల్ , హ్యుమనిజం వైపు ఆర్ట్ ప్రయాణించిందో,  హై-రెనసాన్స్ పీరియడ్ లో రోమన్ కాథలిక్ చర్చ్ ప్రాజెక్ట్ లకి హైర్ చేసిన ఆర్టిస్ట్ కి కొత్త బాధ్యతలు వచ్చిపడటంతో అదే ఆర్ట్ మరో కొత్త మల్పు తిరిగింది. క్లాసిసిజం ని, క్రిస్టియన్ ఐకనోగ్రఫీతో మిక్స్ చేయాల్సి వచ్చింది. లేదంటే రిలీజియస్ స్టోరీస్ కి ఆర్టిస్టిక్ ఫ్రీడం ని ఉపయోగించి కొత్త రూపుని ఇవ్వాల్సి వచ్చింది. హై-రెనసాన్స్ పీరియడ్ ని రిలీజియస్ లిటరేచర్ అండ్ క్లాసికల్ స్టైల్ ఆర్ట్ రివైవల్ పీరియడ్ గా చెప్పుకోవచ్చు. 

అయితే హై-రెనసాన్స్ పీరియడ్లో కూడా గమనించాల్సిన విషయమేంటంటే, ప్రాజెక్ట్ లకి డబ్బులు పే చేయాల్సిన క్లయింట్ రోల్, వారడిగిన కాన్సెప్ట్ లకి తగ్గట్లుగా డిజైన్ చేయాల్సిన ఆర్టిస్ట్ రోల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెయింట్ చేయాల్సిన రిలీజియస్ ఆర్ మైథాలాజికల్ కాన్సెప్ట్స్ లు ఇవేవీ కూడా మారలేదు, కానీ మైకలాంజిలోతో ఈ పరిస్థితి మారిందని చెప్పొచ్చు. 

వాటికన్ సిస్టీన్ చాపెల్ పెయింటింగ్ ప్రాజెక్ట్ లభించిన మైకలాంజిలో పోప్ అడిగినట్లుగా కాక తను ఊహించిన విధంగా పెయింట్ చేస్తానని పోప్ తో ఘర్షణ పడి, వాదించి, గెలచి ఆర్టిస్టిక్ ఫ్రీడం అనే ఒక కొత్త పంథాకి దారి తీసాడని చెప్పొచ్చు. 

మైకలాంజిలోకి లభించిన ఫ్రీడం కనీవిని ఎరుగనిది. ఆ ఫ్రీడం ఫలితమే ఈ రోజు లక్షలాది మంది విజిట్ చేసే సిస్టీన్ చాపెల్ సీలింగ్ మీది స్టోరీ ఆఫ్ క్రియేషన్ పెయింటింగ్స్, వాటి తరువాత దాదాపు పాతికేళ్లకి సైడ్ వాల్ మీద వేసిన జడ్జ్మెంట్ డే పెయింటింగ్.













  




















































 












Sources Used:
1. My Observations during my Italy Trip
2. Various websites including but not limited to Wikipedia
3. However, vast majority of the above is gathered and translated into Telugu from Otis College of Art & Design, Los Angeles (http://www.otis.edu/). Million Thanks to the public material provided by Dr Jeanne Willette (http://jeannewillette.com/ and http://www.arthistoryunstuffed.com/

(అసలీ కథ మొదలుపెట్టిందెందుకు? ఓ పెద్దాయన నన్ను మంత్రముగ్దుణ్ణయ్యేలా మూడు నాలుగు కథలు చెప్పాడని కదా, ఆయన గురించి చెపుదామని మొదలెట్టి, మొదటికంటా వెళ్లి అక్కణ్నుంచి వచ్చింది. కాని ఇప్పటికే ఓపిక అంతరించింది, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన దగ్గిరకొచ్చేప్పటికి నేనూ, వినేవాళ్లూ మిగలరు కాబట్టి, నేను కూడా ఆయన(బర్నీని) గురించి ఓ బుల్లికథ చెప్పి వదిలేద్దామని అదిక్కడ పోస్ట్ చేసా ప్రాణరహిత జన్మలో పాలరాయి)