Monday, 4 February 2013

దేవకన్యల పిల్లో ఫైట్

Posted by Kumar N on 2/04/2013 02:17:00 pm with 1 comment
మయిందంటే ఇందాక డిన్నర్ చేస్తున్నానా, వెళ్ళేప్పుడు నల్లటి, చిక్కటి రాత్రి అమాయకంగానే ఉండింది.

వచ్చేప్పుడు బయట డోర్ ఓపేన్ చేసానా,

ఉఫ్..

Breathtaking.. ఇన్నేళ్లలో ఎన్నోసార్లు చూసిందే, కాని It's all projection of the mind అంటారు కదా. అందం ఎదురుగా ఉందో, మన మనసులో ఉందో, లేక ఆ రెండింట్ళోను ఏకకాలంలో ఉన్నప్పుడే అందం ప్రత్యక్షమవుతుందో ఎవరికి తెలుసు కాని,

గతవారం పర్చుకున్న తెల్లటి మంచు చీర ఇంకా మార్చనేలేదు. భూదేవి ముస్తాబు పూర్తవ్వలేదకున్నారో ఏమో పైవాళ్ళు, వడివడిగా మల్లెపూలలా జారుతున్నాయి తెల్లటి మంచు బిందువులు కొన్ని , తేటతెల్లటి దూదిపింజలు మరికొన్ని.

కళ్ళెత్తి చూస్తే కనకాభిషేకాలు అన్నట్లుగా, కాళ్ళాపి చూస్తే నిండా మంచుతలంబ్రాలు.

కదలాలనిపించలేదస్సలు.

అక్కడే ఆగిపోయా, కార్ వైపు కాకుండా వెనక్కి నడవడం మొదలుపెట్టాను. దూరంగా ఉన్న చీకట్లోకి చూపులు విసిరేస్తూ..

ఉండీ, ఉండీ ఓ తెల్లటి ఫ్లేక్ పెదవి పై పడి , తగిలీ తగలంగానే కరిగిపోయి పెదాలమీద తడి ముద్ర మిగల్చి వళ్ళంతా గిలిగింతలు పెట్టిన అనుభూతి, అమ్మాయి లేత పెదాలు నోట్లో కరిగిపోయి గుండెలు నిండిపోయిన అనుభవం.

నడచుకుంటూ రోడ్డు చివర దాకా వెళ్ళి, ఎదురుగా ఉన్న బ్రైట్ యెల్లో నియాన్ లైట్ కేసి తదేకంగా చూస్తే, చుట్టూ ఉన్న చీకటిలో, స్థంబం కింద అటూఇటూ త్రిభుజాకారంలో పర్చుకున్న పల్చటి, పసుప్పచ్చటి వెలుతురులో, వేగం పెంచుకొని ఆ వెలుతురు తెరనానుకొని జారుతున్న మంచువస్త్రం.

పెళ్ళినాటి రాత్రి హాఫ్ - వైట్ శారీలా!

అక్కడే ఆగిపోయి అలా చూస్తూ ఉండిపోయా.

నాగరిక ప్రపంచంలో బతుకుతున్నాను కదా. మనుషులు వెళ్లలేని చోట్లకి కార్లు వెళ్ళటం ఇక్కడి సంప్రదాయం. దాన్ని పాటిస్తూ ఎక్కణ్నుంచో వచ్చి నాకేసి ఓ చూపేసిపోతూ నన్ను దాటిపోయిన రెండు కార్లు.

తప్పదని వెనక్కెళ్ళి కార్లో కూర్చోని కావాలని దారితప్పి, కురుస్తున్న మంచులో మెత్తటి నల్లటి తారురోడ్డు మీద, అంతకన్న మెత్తగా జారిపోయే చెవర్లెట్ కార్లో యద్దనపూడి రాజశేఖరంలా కొద్దిసేపు తిరిగి హోటల్కొచ్చా.

ఎంట్రన్స్ దగ్గిరగా ఉంటుందని వెనక వైపు పార్క్ చేసి, దిగితే మళ్ళీ అస్సలు కదలాలనిపించలేదు. అటేపు కదా, ఎవరూ రారిప్పట్లో అని తెలుసు.

అలాగే మళ్ళీ చూస్తూ, నడీచీ నడవనట్లుగా నడుస్తూ, ఎందుకో తల పైకెత్తా..

బాప్ రే....

వర్ణనాతీతం.

కన్నుచించుకున్నా కనపడని లోకాల్లోంచి, నా కోసమే, నా మీదకే దూకుతున్న ఓ మంచుపాతం.

దేవకన్యల పిల్లో ఫైట్ ఏమో, దూదంతా చెల్లా చెదురయి, చిన్న చిన్న బిందువులయి, పల్చటి ఫ్లేక్స్ అయ్యి, నా మొహమ్మీదకి వాళ్ళు విసురుతున్న భావన.

వడివడిగా మొహమ్మీదకి జారుతున్న మెత్తటి మంచుని అలాగే దీక్షగా, తదేకంగా తల పైకెత్తి చూస్తూంటే, అది నా వైపొస్తోందా, లేక నేనే పైకి ఎగిరిపోతున్నానా.. అన్న మాయ భావన.

తన్మయత్వం అంటే అనుభవంలోకొచ్చిన అనుభూతి నన్నలాగే ముందుకు నడిపించింది.

ఇంకా జుర్రుకోవాలనుకుందేమో నా మనసు..ఈ సారి నాలిక బాగా బయటకి చాపి, చిన్న చిన్న బిందువులు కాకుండా, కొంచెం పెద్ద ఫ్లేక్స్ కోసం, వాటినెతుక్కుంటూ సాగింది నా ప్రయాణం.

చీకట్లో, నల్లటి ప్రపంచంలో, చుట్టూ ఎవరూ లేరూ, రారూ అని తెలిసి, తలా, చూపూ ఆకాశం లోంచి తిప్పకుండా, స్వచ్చమైన స్పటికం లాంటి మంచురుచి వేటలో సాగుతుంటే వచ్చిన అనుమానమేంటంటే..

అన్ని వేల ఫ్లేక్స్ పైనుంచి జారుతున్నా, నా మొహం మీద దాకా వచ్చి, నాలిక తగిలేలోపున పక్కకెళ్లిపోవటం.. వాటి చపలచిత్తమా లేక 'దేవలోకంలోంచి వస్తూన్న స్వచ్చమైన మంచుబిందువును నేను, మనిషిని తాకి మలినమవలేను' అనుకోని దారిమార్చుకోవటమా అన్న విషయం తేలలేదు.

ఏమయితేనేం., కొన్నిటిని ఆర్తిగా నాలుకమీద అలాగే ఉండనిచ్చి, మరికొన్నిటిని గొంతుదాకా జుర్రుకొని..

ఆకాశానికేసి సగం దాకా ఎగిరి, చుట్టూ మంచు ప్రఫంచంలో నేను నడుస్తూంటే, ధడేల్ మని మోకాళ్ళ దగ్గర శబ్ధం.

ఎవరిదో వైట్ కార్, వెనకనుంచి వెళ్ళి ధభాల్ మని గుద్దుకున్నాను.

తల కిందకి వంగింది, కళ్ళు కిందకి దిగాయి.

కట్ చేస్తే..

కాళ్ళు తిరిగి రూమ్ కేసి నడచాయి.

అనుభవం లోంచి అనుభూతి వెళ్ళిపోయి జ్ణాపకంగా మిగిలిపోకముందే ఇక్కడ కుమ్మరిద్దామని... .


( Feb 2013 )