Sunday 28 September 2014

Siesta of Sienna & San Gimingnano

Posted by Kumar N on 9/28/2014 01:00:00 pm with 1 comment
Metropolis లలో ఉండే సొగసు ఒకరకమయితే, Medieval Town లలో ఉండే అందం వేరే అన్న విషయం తెలిసిందే. 

Sienna వీధుల్లో నడూస్తూంటే, ముఖ్యంగా San Gimignano లో మా నాయనమ్మా, నాయనమ్మ ఊరూ, వేసవికాలం మధ్యాహ్నపు వీధుల్లో గాలి కూడా చెట్టు నీడనెతుక్కొని ఒంగి పడుకున్న మత్తు కాలం, ఇంటి ముందు పందిరి కింద అరుగుల మీద నడుం వాల్చిన సుఖం, వీటన్నిటినీ కలపి పసుపుకుంకుమాసుగంధం కలిపిన గుడ్డలో చుట్టి సంతుకలో పెడితే కాలక్రమేణా అడుగునకెక్కడో మూలకి జారిపోయిన ఆ చిన్నసంచీ ఒక్కసారిగా బయటపడి సువాసనంతా వ్యాపించినట్లుగా నా ఆత్మని నింపేసాయి.

ఈ ఊర్లు ఎంత మాగన్నుగా కునుకు తీస్తూంటాయో, మధ్యాహ్నం పూట!!.

ఇంట్లో అందరూ నిద్రపోతున్నా, ఎప్పటికీ ఆటలాపని పిల్లలు ఇంట్లోకీ బయటకీ తిరుగుతున్నట్లుగా, చూట్టానికి వచ్చిన వాళ్లు మాత్రం ఏవేవో వెతుక్కూంటూంటారు.

వస్తూ పోతూ వంటింట్లో ఏదో కుండలో చేయిపెడితే, దొరక్కుండా దాచిపెట్టిన బెల్లంపట్టీ దొరికి వళ్లే కాక కళ్లు కూడా ఎగిరిపడినట్లుగా, మాకు ఎదురుచూడని మూలన ఒక జెలాటో దొరికింది. ఉర్సు ఉత్సవానికి  మాంచి గులాబీ రంగు పీచు మిఠాయి దొరుకుతుందని ఆశతో వెళ్లినట్లుగా, ఇటలీ వెళ్లి అంతా జెలాటోల కోసం తిరిగిన మాకు రోమ్, ఫ్లారెన్స్, వెనిస్ నగరాలలో దొరకని కమ్మటి జెలాటో కుండలు దొరికాయి.

ఇటలీ అధికారులు సైతం, అమెరికా మొట్టమొదటి కుటుంబాన్ని ఇదే దుకాణం కి తీసుకొచ్చి తినిపించారట.

మీరెప్పుడన్నా మాఅంచి జెలాటో కావాలని వెతుక్కూంటూంటే San Gimignano లో ఈ కింద కనపడిన ప్లేస్ కి వెళ్ళండి, మీకు నచ్చే జెలాటో దొరుకుతుందని నా పూచీ.