Sunday, 16 February 2014

లోపలి మనిషి లోపల

Posted by Kumar N on 2/16/2014 11:18:00 pm with 2 comments
  • సాహిత్యాన్నీ, చరిత్రనీ విరివిగా చదువుకున్న వ్యక్తి, స్వయాన ఒక రచయిత. 
  • దేశీయ, అంతర్జాతీయ భాషలు కలిపి దాదాపు డజను పైనే భాషల్లో నైపుణ్యం, 
  • భారతదేశ స్వాతంత్రానికి పూర్వమే నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నేపథ్యం, 
  • స్వాత్రంత్రానంతరం తనెన్నుకున్న వృత్తిలో అంచెలంచెలుగా పదోన్నతి పొందుతూ ఎమ్మెల్యే నుంచి, ఎమ్. పి, మంత్రీ, ముఖ్యమంత్రీ, కేంద్రమంత్రీ, చివరకి అత్యున్నత స్థానమైన ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి. 
  • ప్రపంచ దేశాల్ని చుట్టిన విదేశీవ్యవహారాల నిపుణుడు. 
  • ముఖ్యంగా, సుదీర్థ చరిత్రని చూసిన వ్యక్తే కాదు, చరిత్ర చరిత్రలా ఎలా మారుతుందో, తయారవుతుందో కూడా తెలిసిన వ్యక్తి. 
  • భారతదేశావతరణ పరిణామక్రమంలో ముఖ్యమైన ఘట్టంలో ముందువరసలో ఉన్న వ్యక్తుల్లో ఒకరు, 
  • భారతదేశమే కాక ప్రపంచం కూడా గర్వించదగ్గ వ్యక్తులు పుట్టిన ఆ స్వాతంత్రకాలంలో వారి సందేశాలకీ, విలువలకీ స్పందించి దేశనిర్మాణానికై పాటుపడ్డ ప్రథమశ్రేణుల్లోని సైనికుడూ, 
  • ఆ పిదప దేశ సుదీర్థ ప్రయాణంలో డ్రైవర్ సీటు పక్కనే కూర్చోని సలహాలిచ్చిన వ్యక్తి, తద్వార చరిత్రలో పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ముఖ్య భూమిక పోషించిన ఆస్థానంలో భాగస్వామీ, ఆంతరంగికుడూ, 
  • స్వాతంత్రపోరాటంలో జాతిని నడిపిన దార్శనికులు నిర్దేశించిన దిశయే దేశానికి సరైనదని నమ్మిన రాజకీయవేత్తా, అదే దిశలో తను నడచీ, దేశాన్నీ నడిపిన సారథుల్లో ఒకరూ, 
  • జీవితాంతం తను నమ్మి ప్రయాణిస్తోన్న మార్గం, దేశాన్ని డొంకల్లోంచి నడిపిస్తోందనీ, అగాధం వైపు తీసుకెళ్తోందనీ, కంటిచూపు పరిథిలో లోయ అంచు కనపడుతోందని గ్రహించిన మరుక్షణం, అనుకోకుండా డ్రైవర్ సీట్లో ఉన్న తను దేశ దిశని అమాంతంగా సురక్షిత మార్గం వైపు మరల్చిన వ్యక్తీ, 
  • ఆ భాగంలో ఎన్నో కుదుపులకీ, ఎగుడుదిగుడులకీ ఓర్చుకొని, తోడ్పాటునందించాల్సిన రాజకీయ యంత్రాంగం అడుగడుగునా తనని డ్రైవర్ సీట్లోంచి లాగే ప్రయత్నాలని కాచుకోని, ఎత్తుకు పైఎత్తు వేస్తూ, మొక్కవోని దీక్షతో ప్రమాదాన్ని నివారించి, దేశరథాన్ని ఒక హైవే మీదకి తీసుకురావటమే కాక, ప్రగతిపథాన దూకించిన వ్యక్తీ, అంతేకాక ఈ కొత్త ప్రగతి రథం లో కోట్ల మందికి కొత్తగా స్థానం కలిపించిన దేశనిర్మాతా..
అయిన పి వి నరసింహారావు గారు రిటైర్ అయ్యాక రాసిన పుస్తకం అనేసరికి ఆసక్తి, అంచనా పెరగడం సహజం.

ఇది ఫిక్షన్ పుస్తకమనీ, ఇందులోని ఆనంద్ పూర్తిగా తనే కాననీ, కేవలం నా జీవితంలో ఎదురయిన అనుభవాల్లోంచి మాత్రమే ఆనంద్ వెళ్లేలా ఈ పుస్తకాన్ని రచించాననీ పివి గారు చెప్పినప్పటికీ, రిటైర్ అయిన దేశాధ్యక్షుల పుస్తకాలు ఇంతకుముందు చదివిన అనుభవం మూలాన కాబోలు కొన్ని అంచనాలు ముందే నాలో స్థిరపడ్డాయి.

ఆ అంచనాల నేపథ్యంలో ఈ పుస్తకాన్నందుకొని చదవటం మొదలుపెట్టాక, తొలిపేజీల్లో బాగానే సాగినప్పటికీ, ఒక వంద పేజీల పైన పూర్తి చేసేసరికి చిరాకు పుట్టేసిన మాట వాస్తవం. అసలు ఈ పుస్తకం రచయిత ఎవరని కూడా అనుమానమొచ్చేసింది నాకు. 
  • నెహ్రూ కాలం నుంచి ఇండియా చరిత్రని, నెహ్రు తదితరులు చేప్పట్టిన బృహత్తర దేశనిర్మాణ ప్రణాళికని అమలుపరచిన రాజకీయవ్యవస్థలోని భాగస్వామిగా 
  • ఇండియా ఈజ్ ఇందిర - ఇందిరా ఈజ్ ఇండియా అని పేరుపొందిన కాలంలో ముఖ్యమైన మంత్రిత్వ శాఖల అధినేతగా 
  • కోల్డ్ వార్ ముందు పాటించిన అలీన విధానాలని నెత్తికెత్తుకున్న ప్రభుత్వాలకి చెందిన అధికారిగా 
  • కోల్డ్ వార్ ముగిసాక ఒక భారీ కుదుపుతో దేశాన్ని పెద్ద మూలమలుపు తిప్పిన వ్యక్తి వాంటేజ్ పాయింట్ లోంచి వస్తున్న పుస్తకంలో ఏవయితే ఉంటాయని అనుకున్నానో 
అవి కాకుండా చిన్న వయసులో జననాంగాల పట్ల ఉండే సహజ క్యూరియాసిటీని, ఎవరిగురించయితే రాసారో వారు బ్రతికుండి చదివినట్లయితే ఎంత ఎంబరాసింగ్ గా ఫీలవుతారో అన్న కనీస స్పృహ లేకుండా తను చిన్నతనంలో పెరిగిన ఇంట్లో చిన్నాన్న కూతురు జెనిటల్స్ చూపించిన సంఘటన గురించి రాయటమూ, అర్ధరాత్రి మెలకువొచ్చి చిన్నాన్న, చిన్నమ్మ లమధ్య కార్యక్రమాన్ని కాళ్ళు విడదీయడంతో సహా వివరించటమూ, మిత్రుడి సున్తీ కార్యక్రమంలో కోసేయటాన్ని గురించిన తత్వచింతనా, తన సమకాలీకులైన ఇతర రాష్ట్ర రాజకీయ నేతలని గురించి సుదీర్థంగా వివరిస్తూ 'ఆ పడుపుగత్తె జారిన స్థనసంపదను నిమురుతున్న క్షణంలో అతనికి జ్ణానోదయమైంది" ఇలాంటి వ్యాక్యాలు ఒక్కసారికన్నా ఎక్కువ సార్లు తగలడంతో నాకు కొంచెం చిర్రెత్తింది.

కమాన్ సర్, ప్లీజ్ మూవాన్ ఐ యామ్ లుకింగ్ ఫర్ సమ్ థింగ్ ఎల్స్ ఇన్ యువర్ బుక్ అని అనుకొన్నాక, మళ్లీ ఇంకోసారి కూడా కనిపించేసరికి నేనే మూవాన్ అవుదామని పుస్తకం నాలుగు రోజులు ముట్టలేదు మళ్లీ.

రచయిత అవి రాయటం తప్పని నేను అనుకోలేదు, ఆనంద్ కి సహజంగా వచ్చిన పరిశీలనా తత్వమూ, కుతూహలమూ, ప్రశ్నించి, శోచించి సమాధానాలు కనుక్కునే అతని పాత్ర నిర్మాణం కోసం అవి అవసరమేమో కాని, నేను ఆశించిన వైపు వేగంగా 'కథ' ని తీసుకెళ్లకుండా, అక్కడే ఇంత సేపు తచ్చాట్లాట్టం నాకు నచ్చలేదు.

ఈయనకేమయిందా? కొంతమంది అకంప్లిష్డ్ మగవాళ్ల లాగా, స్త్రీ గురించి వర్ణించడానికి ఏ కాస్త అవకాశమున్నా శృతిమించే కొంతమంది రచయితల్లాంటివాడా పివి అన్న అనుమానం రాకపోలేదు. మరో కారణమేంటంటే, ఆ రాష్ట్ర రాజకీయాల కాలం నాకు మరీ ముందయిపోవటం వల్లనేమో , రచయిత మార్చిన పేర్ల వల్ల ఆ వ్యక్తులెవరో నాకు తెలీకపోవటం, ఇంటర్నెట్ ని ఆశ్రయించి తెలుసుకున్నా కూడా నా కన్నా ముందు కాలంలోని రాజకీయ వ్యక్తుల గురించి సరిగ్గా అవగాహన లేకపొవటం వల్ల కూడా నాకు బోర్ మొదలయింది. నేను ఎక్స్ పెక్ట్ చేసింది స్వాతంత్రం ముందు గాంధీ గారితో ఏమైనా నేరుగా కాని, పరోక్షంగా కాని పని చేసారా, లేక ఉత్తర ప్రత్యుత్తరాలేమైనా నడచాయా, గాంధీ, నెహ్రు ల మీద తన ఆలోచనలూ, అభిప్రాయాలూ, వివిధదశల్లో దేశస్థాయి రాజకీయాలు, తను చూసిన క్లిష్టపరిస్థితులూ, ఇంధిరాగాంధీతో తనకున్న గాఢ మైత్రీ, అనుబంధమూ, ఆ నేపథ్యంలో ఇందిర మీద తన ఆలోచనలూ, సంక్షోభ సమయాల్లో, వివాదస్పద విషయాల్లో దేశనాయకత్వ వైఖరీ, ముఖ్యంగా వీటన్నిటినీ మించి తన విదేశాంగ శాఖ మంత్రిత్వ అనుభవాల్లో వివిధ ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ఎలా చూసాయీ, అమెరికా తో తన అనుభవాలేమైనా ఉన్నాయా లాంటి వాటి గురించి ఆశించి పుస్తకాన్నందుకున్నాను.

అయితే నాలుగు రోజుల తరువాత మళ్లీ పుస్తకాన్ని అందుకొని చాలా మంచి పని చేసాను. కొన్ని సార్లు నాకక్కరలేని ఆసక్తిలేని పాత్రల సంభాషణలు విసుగు తెప్పించిన మాట కూడా వాస్తవమయినప్పటికీ, పైన చెప్పిన వర్ణనలు ఆ తరువాత రాలేదిక. పైగా నేనాశించినవన్నీ కాకపోయినా కొన్నిటినీ చాలా లోతుగా వివరించారు.

ఈ 'నవల'(?!) ప్రారంభంలో ఆనంద్ బాల్యం గురించి రాస్తూ తెలంగాణాలో స్వాతంత్రానికి పూర్వమున్న వాతావరణాన్ని పరిచయం చేస్తారు పి.వి. ఆనంద్ స్ఫురధ్రూపి అవడం వల్ల, చదువు కోసం దూర గ్రామాలకి వెళ్ళటం, స్కూలులో ఇతర భాషల మీద పట్టు అతి త్వరగా సాధించటం, తనకి సహజంగా వచ్చిన సునిశిత పరిశీలనా, తత్వచింతనా వల్ల తను పెరుగుతున్నకొద్దీ చుట్టూ గమనిస్తూన్న సమాజం లోని విభిన్నమైన విషయాలు, పరస్పర విరుద్దంగా ఉండే కనపడే ఆచారాల గురించి ఆనంద్ లోతైన ఆలోచనలు పాఠకుడిగా మనకి తెలుస్తుంటాయి. అందులో భాగంగా నైజాం దాష్టీకం, తెలుగుని అణచివేసి, పర్షియన్ ని ప్రమోట్ చేసిన తీరూ, నైజాం పరిపాలనలోనే ప్రజా వ్యతిరేకంగా రాచరికం కొమ్ము కాస్తున్న హిందూ-ముస్లిం కూటమి వైఖరీ, దాని పట్ల ఆనంద్ ఆలోచనల గురించి మనకు అర్ధం అవుతుంది.

స్వాతంత్రానికి పూర్వం నైజాం ప్రభుత్వం, నిజాం ఏరియాకి అవతల బలంగా వీస్తున్న స్వాతంత్రపవనాలని గుర్తించి, అవి తమ ప్రాంతంలో యువకులని ప్రభావితం చేయకూడదని, రైళ్లని నైజాం ఏరియాలో ఆగకుండా నేరుగా దాటివెళ్లడానికి మాత్రమే అనుమతినిచ్చి, వార్తాపత్రికలు ఊళ్లల్లోకి రాకుండా ప్రయత్నించిన తీరూ, వివిధ పుస్తకాలనీ, చివరకి నెహ్రు రాసిన Letters from a Father to his Daughter, Glimpses of World History లాంటివి కూడా నిషిద్ద సాహిత్యం కింద చేర్చి, అవి చదివేవారిని ఎలా టార్గెట్ చేసిందీ చదివినప్పుడు ఆశ్చర్యం కలగక మానదు.

ఈ పుస్తకంలో ఇంకా:
  • నైజాం కి వ్యతిరేకంగా తిరుగుబాటుదార్లతో తను తిరిగిన విశేషాలూ, 
  • స్వాతంత్రానంతరం కేంద్రం హైదరాబాద్ ని స్వాధీనం చేసుకోవడం గురించి క్లుప్తంగా వివరణా, 
  • హైదరాబాద్, ఇండియాలో విలీనం అయిపోయాక తన భవిష్యత్తు గురించీ, రాజకీయాల్లో ఉండాలా లేక తనకి చేతకాని సంపద పరుగుపందెమనే సాధారణ జీవితం వైపు మళ్లాలా అన్న ఆలోచన గురించీ, 
  • స్వాతంత్రం వచ్చాక జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో తన ఓటమీ, ఆ పిదప అంత:శ్శోధనా, అదే ఎన్నికల్లో ప్రతీ ఓటరుకీ అయిదెకరాల భూమీ, ఆవూ ఇస్తామని కమ్యూనిస్ట్ పార్టీ(?) చేసిన వాగ్ధానమూ!! 
  • తన రాజకీయ సంబంధాలూ, రాజకీయాలలో తిరుగుతూ ఆనంద్ పిత్రార్జితాన్నీ సైతం తగలేయటం పట్ల ఆనంద్ భార్య వీణ అసంతృప్తీ, ఆ నేఫథ్యంలో భారతీయవివాహ వ్యవస్థలోని లొసుగుల మీద తన అంతరంగం, చివరికి అసంతృప్తితో తను రాజీపడిన వ్యాఖ్యలూ 
  • రెండవ సార్వత్రిక ఎన్నికల్లో అరుణ పరిచయమూ, ఆ ఎన్నికల్లో తన విజయమూ 
  • ఆ తరువాత తను రాష్ట్రంలో మంత్రిగా నియామకమయిన విధానమూ, ఆ అధికారం రూపు రేఖల గురించి తన విచారణా 
  • సమాజంలోని సంతులన దెబ్బ తీయడానికి గల కారణాలూ, అసమనాతల కారణాలేమైనా వాటిని తగ్గించటంలో ప్రభుత్వం నిర్వహించాల్సిన పాత్రా 
  • అసలు అసమానతలకి మూల కారణం ఎక్కడుండి వచ్చన్న తత్వచింతనా, ఇవన్నీ కలపి తను సోషలిజం వైపు మొగ్గడమే కాక, సోషలిజం మీద తనకి బలంగా పెరిగిన నమ్మకమూ 
  • క్లిష్ట సమస్య ఎదుర్కొన్నప్పుడల్లా తన అన్యార్ధం(అదర్-హాఫ్) ఏదో వచ్చి తన చెంతన చేరి న్యాయమైన నిర్ణయం తీసుకొమ్మని ప్రోత్సాహించిన తీరూ 
  • అరుణ మానసిక ధోరణులూ, తన కుటుంబ పరిస్థితీ, తన ఆవేశాలూ, ఉద్రేకాలూ, అరుణ తనింట్ళో వాళ్ల మీద చేసిన తిరుగుబాటూ, అరుణ సన్యాసిని జీవితమూ 
  • అరుణ ఆనంద్ కి దగ్గరి మనిషని తెలిసి తన దగ్గిర పెరిగిన రికమండేషన్ల వ్యవహారాలూ 
  • మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోయేముందూ, చేసాక అధికారం గురించి తన ఆలోచనలూ 
  • మహేంద్రనాధ్(నీలం సంజీవరెడ్డి?), చౌదరి(బ్రహ్మానందరెడ్డి?) ల మధ్య జరిగిన నిరంతర రాజకీయ కుట్రలూ, 
  • ముఖ్యమంత్రి చౌదరి తో సోషలిజం గురించిన సుదీర్ఘచర్చలూ, 
  • అందులో తనకి అత్యంత ప్రధానమైన భూసంస్కరణల గురించిన వాదనలూ, ఆహారఉత్పత్తే సరిగ్గా లేని భూమిని ఇప్పటికిప్పుడు పంచి దరిద్రాన్ని పంచడం తప్ప ఏముందనీ ఒకవైపూ, ఆహరఉత్పత్తి సమృద్దిని ముందు సాధించి తరువాత పంపిణీ వ్యవస్థని మెరుగుపరచి ఆ తరువాతే భూమిపంపిణీ చేయడం సరైనదేమో అని మరోవైపూ తను పడిన మల్లగుల్లాలూ 
  • మున్సిపాలిటీల ఆదాయం పెరగటానికి ఇంటద్దె ఆదాయం మీద కాకుండా, ఇంటి విలువ మీద పన్ను వేసేట్లుగా తను ప్రతిపాదించిన చట్టాల గురించిన వివరణలు 
  • మధ్యలో పొలిటికల్ మానిప్యులేటర్స్ అయిన శేఖర్ లాంటి పాత్రలూ, పదవులే అంతిమలక్ష్యంగా సాగే వారి రాజకీయ క్రీడలూ 
  • జవహర్ లాల్ నెహ్రూ వ్యక్తిత్వం, దార్శనికతా, ప్రణాళిక ల గురించీ, ఆయన మీద దేశప్రజలకి ఉన్న నమ్మకం గురించీ, ఆయన మీద ఆనంద్ కి ఉన్న అచంచల భక్తీ, విశ్వాసాల గురించి ఎన్నో వ్యాఖ్యానాలు 
  • దేశం ఎదుర్కొన్న చైనా యుద్దం గురించీ, ఆ యుద్దానికి దారితీసిన పరిస్థితుల గురించీ, ఆ కాలంలో ఆయన చేసిన గ్రామపర్యటనలో దేశం బయటనుంచి వచ్చిన ఈ ప్రమాదం, అదే సమయంలో దేశంలో పెరుగుతున్న అవినీతిని గుర్తిస్తూ నమ్మకం కోల్పోతున్న ప్రజలని ఎలా సంఘటితం చేసిందీ వివరించారు. ముఖ్యంగా చైనా దురాక్రమణ కథ ఎక్కడ ప్రారంభం అయ్యిందన్న విషయం గురించిన సుదీర్ఘవివరణ దాదాపు ఇరవై పేజీలు సాగింది 
  • చైనా దురాక్రమణ తరువాత నెహ్రుకి తగ్గిన పలుకుబడీ, కానీ ఆయనకి ప్రత్నామ్యాయంగా ఏ ఒక్కరూ ఎదగలేకపొవటం, కామరాజ్ పథకం గురించి కొన్ని విషయాలూ 
  • 1964 లో నెహ్రు మరణం, అది దేశప్రజల మీదా, దేశమనోఫలకం మీదా చూపిన ప్రభావం 
  • లాల్ బహుదూర్ శాస్త్రి పగ్గాలు తీసుకున్న వైనమూ 
  • అలీనవాదం గుండా భారత్ చేసిన ప్రయాణమూ, దాని గురించిన తన వ్యాఖ్యానాలూ 
  • లాల్ బహుదూర్ శాస్త్రి గారి మరణమూ 
  • రాష్ట్రం లో హిందూ-ముస్లిం ల మధ్య ఉన్న వాతావరణమూ, లౌకికవాదం గురించి నెహ్రూ పడిన తపనా, కాని ఆయన నమ్మిన ఈ విలువ పట్ల ఎవరికీ లేని నమ్మకమూ, ముస్లిం మైనారిటీల పట్ల హిందువుల అపనమ్మకాలూ, పాకిస్తాన్ తో సైనిక ఘర్షణలూ, పాకిస్తాన్-భారత్ మధ్య విభజనరేఖలో లేని స్పష్టతా గురించి స్పృశించారుఇంట్రస్టింగ్ గా ఇండో-చైనా వార్ గురించీ, పాకిస్తాన్ తో యుద్దం ముందు గురించీ తన వ్యాఖ్యానాలు రాసేప్పుడు పివి గారు, సంధర్బానుసారంగా హిస్టరీ రాసిన ఇతర రచయితల పుస్తకాలలో భాగాలని ప్రచురించారు.
ఆ తరువాత ఏర్పడిన పరిస్థితులలో ఆనంద్ , ఇందిరాగాంధీ వైపు మొగ్గు చూపి, ధృఢంగా నిలపడటం, తదుపరి పరిణామాల్లో ఇందిరాగాంధీ అధికారాన్ని తన చేతుల్లో పెట్టుకోవటం కోసం చేసిన చర్యలూ, ముఠాల కుమ్ములాటలూ, అవసరమైనప్పుడు ఇందిరాగాంధీ కమ్యూనిస్టు పార్టీల దగ్గర్నుంచి తీసుకున్న సపోర్టూ, నక్సల్ బరీ ఉద్యమం అవతరణా, ఆ నాయకులతో తన ఆసక్తికరమయిన సంవివాదం, రాష్ట్రంలో భూస్వాముల దగ్గర్నుంచి వస్తూన్న వ్యతిరేకతా, రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణం, ఇందిరాగాంధీ వెనక ఏర్పడిన అమాంబాపతు మందీ మార్భలమూ, బ్యాంకుల జాతీయకరణా, బ్యాంకు రుణాల మంజూరీ, దాంట్లో దళారుల జోక్యమూ, ఈ లోపల భూమి ఇస్తామని చేసిన తమ పార్టీ చేసిన వాగ్ధానాలు ఎంత కాలం గడచినప్పటికీ అమలుజరక్కపోవటం పట్ల తన అసహనం, భూసంస్కరణల అమలుపరచాలన్న మొక్కవోని తన పట్టుదలా, ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టిలో చీలికా, గరీబ్ హటావో నినాదాలూ, ఇందిరాగాంధీ ఘనవిజయం, బంగ్లాదేశ్ అవతరణా, ఇందిరాగాంధీ తిరుగులేని శక్తివంతమైన నాయకురాలిగా ఎదిగిన తీరూ ల మీదుగా పుస్తకం సాగుతుంది.

చౌదరి ని ముఖ్యమంత్రిగా తప్ప్పించి ఆనంద్ ముఖ్యమంత్రిగా నియామకం, స్వయాన తనే ముఖ్యమంత్రి అయ్యాక భూసంస్కరణలని వేగంగా తన హయాంలోనే అమలుపరచాలన్న తన ధృఢమైన ఆశయం, ఆ దిశగా తన ఆదేశాలూ, సంస్కరణల అమలుకి కనీసం ఆరేళ్లు పడుతుందన్న అధికారుల నివేదికలూ, తద్వారా తను మొదట కృంగిపోయిన తీరూ, ఆ విషమ పరిస్థితిని తనెలాంటి ఉపాయలతో ఎదుర్కొని పరిష్కరించుకున్న తీరూ, ఈ మధ్యలో బినామీ పేర్లతో లెక్కలేనన్ని రిజిస్ట్రేషన్ల సమస్యా, ఆ సమస్య పరిష్కారానికి తను అమలు పరచిన పథకమూ, ఇత్యాది విషయాల గురించి పి వి గారు చాలా విపులంగా వివరించారు.

కానీ ధృఢ చిత్తంతో భూసంస్కరణల విషయంలో తను దూసుకువెళ్తున్న తీరు, భూస్వాముల ఆగ్రహానికి గురై, ఎన్నో ఆందోళనలూ, వీధిపోరాటాలు చెలరేగి , చివరకి అవి ఢిల్లీ దాకా చేరి, తనకు వ్యతిరేకంగా పనిచేసి చివరకి ఇందిరాగాంధీ ఆనంద్ ని ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించే ఘట్టం దాకా సాగుతుంది పుస్తకం.

ఆ సమయంలో ఆనంద్ మరో పార్టీ ని పెడతారని నమ్మిన కాంగ్రెస్ వర్గాలు, సాక్షాత్తూ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సమక్షంలోనే దాని గురించిన చర్చా, కాని పార్టీని, ఇందిరని తనెప్పుడూ విడచిపెట్టనని తను చేసిన బాసలూ, చివరకి ఇందిర వెంటే ఉన్నందుకు తనకు లభించిన కేంద్రమంత్రి పదవుల గురించి, చివరకి రాజీవ్ గాంధీ మరణంతో ఏర్పడిన ప్రత్యేకమయిన పరిస్థితులలో ఆనంద్ ప్రధానమంత్రి అయ్యాడన్న క్లుప్తమైన పారాగ్రాఫ్ తో పుస్తకం ముగుస్తుంది. 

అయితే ఈ పోస్టులో మొదట చెప్పినట్లుగా నేను ఆశించిన కాలానికి రాకుండానే ఈ పుస్తకం ముగియటం డిసప్పాయింటింగ్.

***

రాజకీయనాయకులు, ప్రధానమంత్రులు పుస్తకాలు రాయటం మన దేశంలో కాస్త తక్కువయినా, మిగతాదేశాలలో అది అరుదేమీ కాదు. కానీ రిటైరైన ఒక ప్రధానమంత్రి తన జీవితాన్నీ, అనుభవాలనీ "ఫిక్షన్" గా రాయడం చాలా అరుదనే చెప్పాలి. ఇలా ఎందుకు రాసారా పి.వి గారు అన్న ప్రశ్నకి సమాధానం వెతుకుతూ పోయినప్పుడు ఈ పుస్తకం గురించిన చాలా ఆసక్తికరమయిన వివరాలు చాలా తెలిసాయి.

పి.వి గారు ఈ పుస్తకం తొలి భాగాలని, తన ముఖ్యమంత్రి పదవి పూర్తికాలం నిండకుండానే ముగియడంతో, ఢిల్లీకి పిలవబడిన తొలినాళ్లలో ఖాళీ సమయంలో రాసారని, ఆ తరువాత ఎమర్జెన్సీ కాలం ముగిసాక ఇందిరాగాంధీ పదవి కోల్పోవటంతో తనకి మరింత ఖాళీ టైం దొరికినప్పుడు రాసారని తెలిసింది.

పివి అక్నాలెడ్జ్ చేసిన ఫిక్షన్ వర్క్ అయిన ఈ పుస్తకం తో జాతీయస్థాయిలో ఆయన రచయితగా తెలిసినప్పటికీ, తెలుగు వారికి ఆయన రచయితగా, ముఖ్యంగా వేయిపడగల అనువాదం గురించి చిరపరిచితమే. ఆయన మారుపేరుతో అప్పుడప్పుడూ పొలిటికల్ కామెంటరీ రాసేవారనీ, సాక్షాత్తూ ఎమర్జెన్సీ కాలంలోనే ఎమర్జెన్సీ ని విమర్శిస్తూ తన చిరకాల మిత్రుడు నిఖిల్ చక్రవర్తి ఎడిటర్ గా ఉన్న మెయిన్ స్ట్రీమ్ పత్రికలో Insider పేరుతో రచనలు చేసేవారనీ, 1990 లలో ఆయన ఇందిర హయాంలో కాబినెట్ మార్పుల గురించి Insider పేరుతో రాసిన skit 'The Reshuffle" రాసారని తెలిసింది. 

ఈ పుస్తకాన్ని మొదటగా Other-half అన్న పేరుతో రాసారట. ఆ Other-half అన్న ఊహాజనితవ్యక్తి ని ఈ Insider అన్న పుస్తకంలో కూడా కొన్నిసార్లు చూడవచ్చు. తను ఏ నిర్ణయం తీసుకోవాలా అన్న డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు తన ఎదురుగా ప్రత్యక్షమయ్యి తనకి మార్గదర్శకత్వం చూపే ideal-persona ని ఆనంద్ other-half (అన్యార్ధం) అని చెపుతూంటాడు ఆనంద్ ఈ పుస్తకంలో. 

అయితే ఒరిజినల్ గా రాయబడిన Other-half అన్న పుస్తకంలో ఆనంద్ పాత్ర నిరంజన్ గా , అరుణ పాత్ర సుమిత్ర గా, వారిద్దరి మధ్య steamy affair scenes, passionate uncontrolled kisses లాంటి వర్ణనలు ఎక్కువగా ఉన్నాయిట. పి.వి తన ఖాళీ టైం లో రాత్రిళ్లు లాప్ టాప్ మీద కూర్చొని స్వయంగా టైప్ చేసిన మాన్యుస్క్రిప్ట్ ని తన మిత్రుడు నిఖిల్ చక్రవర్తికి , మిగతా సన్నిహిత మిత్రులకి, అభిప్రాయాల కోసం, విమర్శల కోసం చూపించటం జరిగిందిట. నిజానికి తను ప్రధానమంత్రి కాక పూర్వం , విదేశాంగ శాఖా మంత్రిగా 1990 లో తన అమెరికా పర్యటనలో ఎడిటోరియల్ కన్సల్టెన్సీ అభిప్రాయాలను కూడా తీసుకున్నారట. ఈ నవల ప్లాట్ ఒక కమర్షియల్, సెమీ ఆటోబయోగ్రఫికల్ పుస్తకంగా ప్రచురణ అవగలదా, నిలబడగలదా అని . 

ఈ లోపు పి.విగారు ప్రధానమంత్రి అవడం, తన ప్రాధాన్యతలు మారిపోవటం, ఈ మధ్యలో నిఖిల్ చక్రవర్తి తన దగ్గరున్న మాన్యుస్క్రిప్ట్ ని, సాగరికా ఘోష్ కి చూపించటం. అప్పుడే ఔట్ లుక్ మాగజైన్ విడుదలకి ఓపెనింగ్ సెన్సేషనల్ పీస్ గా, ఈ మాన్యుస్క్రిప్ట్ లోని హాట్-హాట్, జ్యూసీ భాగాలని వాడుకోవచ్చని సాగరికా ఘోష్ తలచి, ఆ భాగాల వర్ణణలతోఆవిడ తన ఆర్టికల్ ని మొదలుపెట్టి, ఆ పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేసిందనీ తెలిసింది. 

దీన్ని పి.వి. తన మిత్రుడు నిఖిల్ పుస్తకాన్ని లీక్ చేసినట్లుగా భావించారట. A friend can be a journalist , but a journalist cannever be a friend అని ఉటంకించారట ఆ సందర్భంలో. కానీ ఈ ఘట్టం వారిద్దరిమధ్య అగాథాన్ని సృష్టించినట్లు లేదు. ఏమైతేనేం, చివరకి పుస్తకం తొందర్లోనే పబ్లిష్ చేయాలనీ, అందుకని తొందరగా ముగించాలని నిర్ణయం జరిగినట్లుంది. చివరికి తను ప్రధానమంత్రిగా దిగిపోయాక 1998 లో సాగరికా ఘోష్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ భాగాలని ఎందుకు తొలగించారు అని ఆమె అడిగినపుడు పి.వి బదులిస్తూ, "ముందుగా ఔట్ లుక్ మాగజైన్ కి నేను థాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు రాసిన ఆ ఆర్టీకల్ లో ఏ భాగాలని హైలైట్ చేసావో చూసినప్పుడు నాకు ఏవి తీసేయాలో తెలిసింది. డిస్క్రిప్టివ్ గా ఉన్న ఆ సీన్స్ వల్ల, పాఠకుడి కాన్సంట్రేషన్ వాటి మీదే ఉంటుందనీ, నేను చెప్పదలచుకున్న విషయాల మీదకి వెళ్లదని అర్ధమయింది అని చెప్పారు. ఒక మహాకావ్యంలో ఎన్నో అధ్యాయాలుంటాయి, వివిధ రసాలుంటాయి. నిజానికి ఒరిజినల్ గా పుస్తకం జీవితపు వివిధ దశల, పార్శ్వాల నుండి పాఠకుణ్ణి తీసుకెళ్తుంది. సుదీర్ఘ ప్రయాణంలో అనుభవమైన ఎన్నో అనుభూతులుంటాయి, వీటినే మనం రసాలంటాం. కాని నువ్వు కేవలం ఒక రసాన్నే హైలైట్ చేసావు. నా పుస్తకమ్ కేవలం దానికి సంబంధించిందే కాదు, మాస్ రైటర్ గా పేరు తెచ్చుకోవాలనీ పుస్తకం రాయలేదని" చెప్పారు. 

అది తెలిసాక ఔరా!! అనుకున్నాను. పబ్లిష్ అయిన వాటిలో ఉన్న అతికొద్ది డిటేయిల్స్ కే పైన చెప్పినట్లుగా మొదట్లో డిసప్పాయింట్ అయిన నేను, ఇహ ప్రధానమంత్రి గారు, ఆయన అఫయిర్ గురించి నోరూరించే డీటెయిల్స్ తో వర్ణిస్తూంటే, నిజంగానె పుస్తకాన్ని విసిరేసేవాణ్నేమో. 

అంటే ప్రధానమంత్రులు స్వచ్చమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలన్న అంచనాలేం నాకు లేవు, కాని చరిత్ర మీద ఆసక్తితో దేశ ప్రధానమంత్రి రాసిన పుస్తకం పిక్ చేసుకున్నప్పుడు, అకస్మాత్తుగా చందు సోంబాబు కనపడితే ఎలా ఉంటుంది మరి!

సరే, ఆ విషయాన్ని వదిలేస్తే, ఈ పుస్తకం చదువుతున్నప్పుడూ, చదివాక కూడా ఇందులో ఆనంద్ పాత్ర ఒక ఐడియల్, ప్రిన్సిపుల్డ్ కారక్టర్ గా ఉండిపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. చుట్టూ దుర్గంధంతో నిండిపోయి, అందులో భాగమై, అదే ఊపిరై తప్ప ఉండలేని వాతావరణంలో ఆనంద్ మాత్రం స్వచ్చంగా, మల్లెపూవు లా ఉండిపోగలగటం రచయిత నిజాయితీని శంకింపచేసింది. అధికారం గురించీ, అధిష్టానం ఆశీర్వాదాల గురించీ, అధికారమే అంతిమ లక్ష్యం గా బురదలో జరుగుతున్న ఒక క్రీడగా వర్ణించినప్పుడు, ఆనంద్ ని ఆ క్రీడంటే ఆసక్తి లేని వ్యక్తిగా, పాత్రగా నిర్మించటంలో రచయితగా పి.వి గారి ఉద్దేశమేంటో తెలీదు కాని, వాస్తవం దానికి దూరంగా ఉందని పి.వి గారి రాజకీయపథాన్ని గమనించినవారెవరికైనా తెలుస్తుంది. ఇందువల్ల ఇదొక ఫాంటసీ, ఐడియలైజ్డ్  పాత్ర అన్న ఆర్గ్యుమెంట్ కి అవకాశం కలిగిస్తుంది.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకింకా ఊహ కూడా తెలీదు కాబట్టి, నాకు ముఖ్యమంత్రి పేరు లీలగా కోట్ల, స్పష్టంగా అయితే రామారావు కాలంనుంచీ మాత్రమే తెలుసు కాబట్టి, పి.వి గారు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన మీద జనాభిప్రాయం ఎలా ఉండేదో నాకు తెలీదు. కాని నాకు కాస్తో కూస్తో ప్రసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కేంద్రం, రాష్ట్రం అన్న విషయాలు తెలిసేప్పటికి ఆయన ఢిల్లీలో తప్ప, ఎప్పుడో కాని రాష్ట్రానికి వచ్చేవాడు కాడు కాబట్టి, నేను పెరుగుతుండగా పి.వి గారి గురించి ఎవరైనా కూడా .. " ఆ మన ఊరికి, మన జిల్లాకి ఏం చేసాడు, ఏమీ చేయలేదు " అన్న అభిప్రాయాన్నే నేనెక్కువ విన్నాను. 

ఆయన ఎంతగా అన్-పాపులరో చెప్పడానికి అతి పెద్ద , బలమైన ఉదాహరణ ఇది. 1984 లో ఇందిరాగాంధీ హత్యకి గురవటంతో వచ్చిన సానుభూతి పవనాలతో, కాంగ్రెస్ భారత్ చరిత్రలో కనీవిని ఎరుగని, నెహ్రూకి సైతం రాని మెజారిటీతో 416 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంత బలమైన వేవ్ లో, అప్పటికి అంత ఉనికి లేని, అనామకంగా ఉన్న బిజెపి పార్టీకి దేశం మొత్తం మీద రెండే రెండు ఎమ్. పి సీట్లలో విజయం లభించింది. ఆ రెండింటిలో ఊరూపేరూ పెద్దగా తెలీని బిజెపి అభ్యర్థి జంగారెడ్డి ఒకరు. ఇప్పటికీ ఆయన పేరు తెలిని వారు చాలామంది. ఇంతకీ జంగారెడ్డి ఆ ఎన్నికల్లో గెలిచిందెవరి మీదో తెలుసా? పి.వి.నరసింహారావు గారి మీద!!

ఈ ప్రమాదాన్ని పి.వి. ముందే ఊహించారు, అందుకే అదే ఎన్నికల్లో సేఫ్-సీట్ అయిన రామ్టెక్ నుంచి కూడా పోటీ చేసారు. అక్కడ గెలిచి కేంద్రమంత్రి పదవిని కాపాడుకున్నారు.


ఎనీవే, కేవలం ఇందిరాగాంధీకి ఆప్తుడిగా, నమ్మినబంటుగా, ఆంతరంగికుడిగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోని జీవితాంతం రాజకీయాలలో, పదవులలో ఉన్న పి.వి. గారు.. సెమీ బయోగ్రఫి లాంటి పుస్తకంలో ఆనంద్ ని పదవులంటే ఆసక్తి లేని, పదవుల వెంట పడని, కేవలం తన తెలివితేటలకి రివార్డ్ గా మాత్రమే ఆ పదవులు వచ్చినట్లుగా చిత్రీకరించి, తన ఐడియల్-హి గా "ఉంచేయటం" ఆశ్చర్యాన్ని కలిగించి, తన వర్షన్ మీద నిజాయితీతో ఒక అభిప్రాయానికి రాలేని పరిస్థితిని కల్పించింది.

కానీ అరుణ తో తన పరిచయాన్ని పబ్లిష్ అయిన వర్షన్ లో ఆల్మోస్ట్-ప్లెటోనిక్, అందీ-అందనట్లు గా ఉంచేసినప్పటికీ, ఆయన ధైర్యాన్నీ, నిజాయితీని ఎన్నో విధాలుగా కొనియాడక తప్పదు. ముఖ్యంగా సాంప్రదాయ భారతదేశం లో ఒక ప్రధానమంత్రి అంత ధైర్యంగా రాసుకోవటం ఊహకందని విషయం! అయితే అదే సమయంలో నీలం సంజీవరెడ్డి షేడ్స్ తో రూపొందిన మహేంద్రనాథ్ ని ఒక సీరియల్ ఫోర్నికేటర్ గా, సెక్స్ అర్జ్ ని ఒక ఇచ్ కన్నా సాధారణమైన నీడ్ గా కన్సిడర్ గా చేసే పర్సన్ గా, బ్రహ్మానందరెడ్డి పాత్రగా రూపొందిన చౌదరిని ప్రాస్టిట్యూట్స్ తో గడిపే వ్యక్తిగా, గాంబ్లింగ్ చేసే ఒక రూథ్ లెస్ వ్యక్తిగా తీర్చిదిద్దటం గమనించాల్సిన విషయం. ఇంకో మాటలో చెప్పాలంటే ఆనంద్ పాత్ర ఆదర్శాలతో ఉట్టిపడుతున్న పాత్ర, మిగతావన్నీ మురికి పాత్రలుగా చిత్రీకరించిన వాతావరణం, నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. 

((అయితే ఈ పుస్తకమూ, ఇంకా వేరే కొన్ని రిలేటెడ్ ఇంటర్వ్యూస్, ఆర్టికల్స్ చదివిన తరువాత నాకు ఏర్పడిన అభిప్రాయమేంటంటే, పి.వి. గారిలో తనీ పుస్తకంలో రాసుకున్నట్లుగానే ఇద్దరు మనుషులు తనతో ప్రయాణం చేసారు. ఒకరు తనెన్నుకున్న వృత్తిలో రాణించటానికీ, ముందు వరసలో ఉండటానికి తన బలాలకీ-బలహీనతలకీ తగినట్లుగా ఏఏ పనులూ, ఎత్తుగడలూ, వ్యూహాలూ, నక్కజిత్తులూ అవలంభించాలో అవన్నీ చివరివరకీ చేసుకుంటూ వచ్చారు. ఇంకొకరు( The other-half ) ఇంటలెక్చువల్ గా చరిత్రనీ, దేశగమనాన్నీ, దేశ పరిస్థితులనీ, సమస్యలనీ, ఫిలాసఫీని, నాడినీ, వాటికి సమస్యలని, పరిష్కారాలనీ నిరంతరంగా అధ్యయనం చేస్తూ నమోదు చేసుకుంటూ వచ్చారు. ఈ మనిషి అధికారాన్ని అంతిమటార్గెట్ గా, కుర్చీని తన ఆస్థినీ, బలగాన్నీ పెంచుకునే వ్యక్తిగా కాక, పదవిలోకి వచ్చాక నిర్వర్తించవలసిన భాధ్యతలని, సమస్యల పరిష్కారాలనీ కూలంకశంగా ఆల్మోస్ట్ అకడమషియన్ లా, బ్యూరోక్రట్ లా స్టడీ చేస్తూ వచ్చారు. ఈ ఆల్టర్నేటివ్ స్టడీ ఆయన రాష్ట్రంలో, దేశంలో అత్యున్నతపదవిలోకి వచ్చిన రెండు సార్లు కూడా, ఏ రాజీవ్ గాంధీ లానో ఆన్-ద-జాబ్-ట్రెయినింగ్ అవసరం లేకుండా చేసింది. తను చూసిన పేదరికాన్ని అధ్యయనం చేసి సోషలిజాన్ని నమ్మి, నెహ్రూ విజన్ నీ, ఇంటలెక్ట్ నీ విశ్వసించిన కాలంలో భూసంస్కరణల ఒక మచ్-నీడేడ్ సొల్యూషన్ గా ఎంతో బలంగా నమ్మి, తనకి ముఖ్యమంత్రి పదవి రాగానే మిగతా వారిలా తాత్సారం చేయకుండా, వాటిని అంతే బలంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించడం ఆ స్టడీ ఫలితమే. అదే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేప్పటికి గడచిన సుదీర్ఘకాలంలో దేశసమస్యలకి లైసెన్స్ రాజ్ ని నిర్మూలించకతప్పదనీ, ఫ్రీ మార్కెట్ ఎకానమీకి తలుపులు తీయక తప్పదనీ, సోవియట్ యూనియన్ లేకపొవటంతొ సమూలంగా మారిపోయిన ఇంటర్నేషనల్ లాండ్ స్కేప్ లో భారత్ తనకంటూ కొత్తగా ఒక పాత్రని స్వంతగా రూపొందించుకొక తప్పదనీ చాలా తొందరగా అర్ధం చేసుకోవటమే కాక, ఆ వైపు అత్యంత వేగంగా, ధృఢంగా, ఒంటరిగా అడుగులు వేస్తూ, వేపించారని కూడా తెలుస్తోంది. తన స్వంత ఆస్థి కోసం కాకపోయినా, ప్రభుత్వాన్ని నిలుపుకోవటానికి చేయవలసి వచ్చిన బురదపనులలో భాగంగా వచ్చిన అవినీతి ఆరోపణలు, ఇచ్చిన కోర్టు తీర్పులూ, స్వయానా ఆయనకి ఉన్న ఇడియో-సింక్రసీస్ అయిన కొన్ని స్టుపిడ్ నమ్మకాలు చంద్రస్వామిలాంటి నికృష్టులని ఇన్నర్ టీమ్ లో భాగం చేసి నడిపిన రాజకీయాలు, ఆయన మీద మాయని మచ్చని వేసాయి. ఈ నా uneducated, uninformed opinions ని ఇంతటితో ఆపడం మంచిదనుకుంటాను :) )

అయితే ఆనంద్ ముఖ్యమంత్రి అవడమూ, తదుపరి తను ఆ పీఠం నుంచి దిగిపోవటంతో ముగిసిన ఈ పుస్తకానికి రెండవ వాల్యూమ్ ని పి.వి గారు ప్లాన్ చేసారు. 

కానీ, ఇంతలో అయోధ్య ఘట్టం పి.వి గారి లెగసీ మీద శాశ్వతంగా నల్లమచ్చ వేస్తూన్న/వేసిన పరిణామంలో తన వైపు స్టోరీ ని వినిపించడం కోసమై, అయోధ్య పుస్తకం మీద కాన్సంట్రేట్ చేసారట, అందుకని రెండవ వ్యాల్యూమ్ వెనకపడిందిట.

ఈ లోపల పి.విగారు చనిపోకపోయి ఉంటే, రెండవ వ్యాల్యూమ్ లో పి.వి. గారే స్వయంగా చెప్పినట్లుగా కవర్ చేయాలనుకున్న ఇందిరాగాంధీ ఎంతో పాపులర్ అయిన బంగ్లాదేశ్ అవతరణ అనంతర పరిస్థితిలో కూడా తను ఎమర్జెన్సీ విధించేంతగా ఎందుకు ఆలోచించిందో, ఎలాంటి పరిస్థితులు ఆమెని ప్రభావితం చేసి ఉండవచ్చో లాంటి విషయాలూ, అలాగే బహుశా తన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోని పరిస్థితులూ, తన నిర్ణయాల గురించి రాసి ఉండేవారేమో, అవన్నీ మనం చదువుకునే అవకాశం ఉండి ఉండేదేమో.

మరచిపోయాను.. ఈ పుస్తకం ఇంగ్లీష్ లో నేను చదవలేదు, తెలుగులో చదివాను. కాబట్టి అనువాదం ఎలా ఉందో ఆబ్జక్టివ్ గా చెప్పలేకపోయినప్పటికీ, కల్లూరి భాస్కరం గారి అనువాదం బాగుందని చెప్పగలను.

2 comments:

  1. ఆశ్చర్యం కుమార్ గారు. మొన్న బుక్ ఎగ్జిబిషన్ లో కొనుక్కొచ్చుకున్న ఈ బుక్ ఎన్నో ఎక్ష్పెక్టేషన్స్ తో చదవటం మొదలు పెట్టి విసుగుతో మధ్యలో ఆపేసి కొంతకాలం అయింది:) కాని, ఇప్పటి మీ రివ్యూ చదివాక ఓపికతో ఆ బుక్ పూర్తిగా చదువుదామనే అనిపిస్తోంది. నాలాంటి వాళ్ళకు పనికి వచ్చే ఎంతో చక్కటి రివ్యూ ఇది.

    ReplyDelete
  2. చాలా బాగా రాసారు కుమార్ జీ ! పుస్తకం చదివాను కాబట్టి, దాని గురించి కన్నా నాకు ఆ పుస్తకం వెనక కబుర్లు ఇంకా చాలా నచ్చాయి !

    ReplyDelete