Monday, 15 April 2013

ముందు పోస్టులో చెప్పినట్లుగా Niall Ferguson - Civilization, The West and the Rest పుస్తకంలో దాదాపు అర్ధసహస్రాబ్ధం క్రితం పశ్చిమ యూరప్ సమాజంలో మొదలయిన ఎదుగుదలనీ, వివిధ రంగాల్లో పాశ్చాత్యసమాజపు వేసిన గణనీయమైన ముందడుగులనీ, షుమారు ఐదొందల సంవత్సరాల అప్రతిహత, అవిశ్రాంత ప్రగతి, తద్వారా పశ్చిమార్ధపు దేశాలు భూగోళం మీద సాధించిన ఆధిపత్యానికి గల కారణాలనీ వెతుకుతారు. పదిహేనవ శతాబ్ధం వరకీ నాగరికతలో, సాంకేతిక జ్ణానంలో, తత్వవిచారణలో, వివిధ పౌరవ్యవస్థల్లో ఎంతో ముందున్న తూర్పు, మధ్యప్రాచ్యపు దేశాలు క్రమంగా వెనకబడటానికి గల కారణాలని కూడా అన్వేషిస్తారు.చివరగా పాశ్చాత్యప్రపంచపు పలుకుబడి ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టడాన్ని గుర్తిస్తూనే, తూర్పుప్రపంచపు అద్భుతంగా సాధించిన అభివృద్ధినీ, ప్రపంచం ముందు రాబోతున్న సవాళ్లని తనదైన రీతిలో ముందుంచుతారు.

ఈ పుస్తకంలో ఆరు చాప్టర్లు, నాలుగువందల పేజీలు ఉన్నాయి. ఎన్నో వివరాలూ, విశ్లేషణలూ, అభిప్రాయాలూ, రెఫరెన్సులూ, సుదీర్ఘవివరణలూ ఉన్నాయి.

ఒక్కొక్క చాప్టర్ లో కల ముఖ్యమైన పాయింట్లనీ, విషయాలనీ.. అటూఇటూ కాని సంకర తెంగ్లీష్ భాషలో ఇక్కడ పొందుపరుద్దామని ఓ ప్రయత్నం.

క్రితం పోస్టులోనే చెప్పినట్లుగా, ఈ ప్రయత్నం కాపీయింగ్ హక్కుల ఉల్లంఘన అన్న అనుమానమూ, నమ్మకమూ లేకపోలేదు. కాని అదే సమయంలో పుస్తకపరిచయాలు/సమీక్షలు బ్లాగు రచయిత కోణం లోంచి మాత్రమే చదివి, ఆ పుస్తకాలు చదవలేని/చదవని ఎందరో మిత్రుల కోసమూ, నా కోసమూ కూడా పుస్తకం లో ఉన్నదున్నట్లుగా రాస్తే పోలా అన్న ఆలోచనే.. నాతో ఈ కొన్ని వ్యాక్యాలు రాయిస్తోంది. పైగా నా గొంతూ, నా బయాస్ లు తీసేసి రాసినట్లుగా కూడా ఉంటుంది, అందువల్ల చదువరులు స్వంతగా అభిప్రాయలనేర్పరుచుకుంటారు అన్న ఒక ఆలోచన కూడా ఉంది.

పైన చెప్పినట్లుగా ఎన్ని కారణాలు చెప్పుకున్నా,ఈ డ్రాఫ్ట్ రాసేసి రెండు వారాలు దాటిపోయినా కూడా, మనసులో ఉండే క్షోభ మాత్రం పోలేదు. ఇలా చేయటం తప్పు అన్న భావం నా కాళ్లను గట్టిగా కట్టేసింది. well I should say 'చేతుల్ని".

చివరకి రాసినదాన్ని చెత్తబుట్ట దాఖలు చేయడం ఇష్టం లేక, పబ్లిష్ అనే బటన్ ని కొట్టలేక సందిగ్ధంలో పడి చివరకి ఉండబట్టలేక ఈ పుస్తక రచయితకి, నేను చేయబోయే ఈ దుశ్చర్య గురించి ముందే సమాచారాన్ని, ఈ బ్లాగు లింకు తో సహా, ముందస్తు కృతజ్ణతలనీ, క్షమాపణలనీ అందచేయడం జరిగింది.

కాపీయింగ్ రైట్స్ హక్కుల్ని అతిక్రమించనంతవరకీ, పుస్తక రచయితకి క్రెడిట్ దక్కినంత వరకీ, తన పుస్తక అమ్మకాలకి విఘాతం ఏర్పడనంత వరకీ, రచయితకీ, పుస్తకానికీ మరింత ప్రచారం లభించేంతవరకీ, తన పుస్తక సమాచారాన్ని వేరే భాషలో మరింతమంది ప్రజలు తెలుసుకుంటారన్న విషయం ఏ పుస్తకరచయితకి అయినా సంతోషకరమయిన వార్త కాకపోయినా, టాలరేట్ చేసేంత ఆమోదయోగ్యమేమో అని నమ్ముతున్నాను. అందుకే ముందుకు సాగుతున్నాను.

కాని చివరగా ఈ మాట చెప్పకతప్పదు. రచయితకి రెండు సార్లు ఈమెయిల్ ఇచ్చి, అందులో స్పష్టంగా.. ఈ బ్లాగులో తన పుస్తకం గురించీ, అందులోని పేరాగ్రాఫ్ లూ/పేజీలని నేరుగా తెలుగు(?) లో టైప్ చేయడం గురించి, దాని వెనుక ఉద్దేశాల గురించీ చెప్పి, ఏ మాత్రం అభ్యంతరమున్నా తెలియచేయమని సవినయంగా మనవి చేయడం జరిగింది. అయితే రిప్లై రాలేదు, దాన్ని రచయిత ఆమోదంగా పరిగణించడం భావ్యం కాదు. తప్పు కూడాను.

కాని రెండు వారాల వెయిటింగ్ తర్వాత నెగటివ్ రిప్లై కూడా రాలేదన్న వంచనతో ముందుకెళ్ళడానికి నిశ్చయించుకోవడం జరిగింది. కావున ఏ రోజయినా అభ్యంతరమనేది వస్తే, ఈ పోస్టులు వెంటనే డిలీట్ చేయడం జరుగుతుంది.

ఇహ ఈ సోది ఆపి, పుస్తకం లోకి.

గమనికః ఈ కింద రాసిందంతా రచయిత టోన్, నాది కాదని మనవి.
_____________________________________________________________________
1411 ప్రాంతంలో ఓ సారి ప్రపంచయాత్ర చేసొస్తే కనక మనకీ కింది విషయాలు కనిపించేవి:

One of the greatest eras of orderly government and social stability in human history గా పేరొంది, చైనా ని 276 సంవత్సరాలు పరిపాలించిన మింగ్ సామ్రాజ్యం, బీజింగ్ లో Forbidden City ని కట్టడం మొదలయ్యింది.


అదేచైనాలో, 1700 కిలోమీటర్ల పొడుగుతో, ప్రపంచంలో అతి పెద్ద మానవనిర్మిత కెనాల్ అయిన Grand Canal ని, సమూలంగా మార్చేసి మెరుగు పరచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.



Ottoman చక్రవర్తులు Constantinople మీదకి దండెత్తటానికి సన్నాహాలు మొదలెట్టారు. (చిట్ట చివరకి 1453 లో ఆక్రమించేయడంతో ప్రపంచ చరిత్రలో అతి శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన Ottoman Empire అవతరిస్తుంది )
 

Byzantine Empire (Eastern Roman Empire) చివరి దశలో ఉంది. 



చరిత్రకారుల అంచనాల ప్రకారం అప్పటి ప్రపంచంలో దాదాపు అయిదు శాతం (ఒక కోటిన్నర జనాభా) ని తన దండయాత్రలకి బలితీసుకోని, ఒకానొక టైమ్ లో ఏషియానీ, ఆఫ్రికానీ, యూరప్ లో కొద్ది భాగాన్నీ గడగడలాడించి, ఈజిప్ట్ నీ, సిరియా నీ, ఢిల్లీ ని, విస్తరిస్తున్న Ottoman Empire నీ ఓడించి, సాక్షాత్తూ Ming Dynasty మీదకే దండెత్తిన ముస్లిం రాజు Timur 1405 లో చనిపోవటంతో, మధ్య ఏషియా నుంచి దాడులకి వచ్చే ముష్కర సేనల ప్రమాదం మింగ్ సామ్రాజ్యానికీ, ఒట్టోమాన్ ఎంపైర్ కీ తప్పిపోయింది.


ఏ రకంగా చూసినా రానున్న భవిష్యత్తు అంతా, చైనా Yongle Emperor కీ, Ottoman Sultan Murad II కీ వెలిగిపోతూ కనిపించేది.

                                                                   

అదే కాలం లో పశ్చిమ యూరప్ సమాజం ఎలా ఉందో చూద్దాం:


1347 నుంచీ 1351 వరకీ వ్యాప్తి చెందిన Black Death పశ్చిమయూరప్ సమాజం జనాభాని సగానికి తగ్గించేసింది. (యూరప్ జనాభా తిరిగి పూర్వపు స్థాయికి రావడానికి దాదాపు నూటయాభై సంవత్సరాలు పట్టింది ). ప్లేగ్ వ్యాధి సమసిన తర్వాత కూడా అది వదిలి వెళ్ళిన అపరిశుభ్ర నగరాలతో, అనారోగ్యపరిస్థితులతో యూరప్ తల్లడిల్లింది.

ఇంగ్లాండ్ Richard II రాజు ని చంపేసి, సింహాసనాన్ని ఎక్కిన Henry IV తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఎన్నో తిరుగుబాట్లనీ, హత్యాప్రయత్నాలనీ తప్పించుకోని రాజ్యమేలి, కుష్టు వ్యాధితో బాధపడుతూ అంతిమదశలో ఉన్నాడు.


వంద సంవత్సరాల ఆంగ్లో - ఫ్రెంచ్ వార్ కి జరుగుతున్న కాలమది. ఫ్రాన్స్ దేశం Duke of Burgundy అనుచరలకీ, Duke of Orleans అనుచరలకీ మధ్య నలుగుతున్న ప్రాక్స్తీ యుద్దం లో నలిగిపోతొంది. ఈ యుద్ధంతో పోల్చితే ఇతర యూరప్ ప్రాంతాలయిన Aragon, Castile, Navarre, Portugal and Scotland లో పరిస్థితులు కొంచెం మెరుగ్గా ఉండేవి.

ఏ మధ్యప్రాచ్యంలోనో, తూర్పుదేశంలోనొ కాదు, ఏకంగా యూరప్ లో పశ్చిమాన ఉండే Spain లోని Granada ని ఒక ముస్లిం రాజు ఇంకా పరిపాలిస్తున్నాడు. 



స్కాటిష్ రాజు James I ఇంగ్లాండ్ పైరేట్ల దాడిలో చిక్కుకొని, ఇంగ్లాండ్ లో బంధింపబడి ఉన్నాడు. ఆ వార్త విన్న అతని తండ్రి King Robert III గుండెపోటుతో మరణించాడు.

18 సంవత్సరాల దీర్ఘ బంధింపు తర్వాత 1424 లో కానీ James I విడుదల కాలేదు.


యూరప్ మొత్తం మీద సిరిసంపదలున్న ప్రదేశాలుగా చెప్పుకోతగ్గవి ఉత్తర ఇటలీ నగరసంస్థానాలయిన Florence, Genoa, Pisa, Siena and Venice లు మాత్రమే.





ఇక అదే పదిహేనవ శతాబ్ధంలో ఉత్తర అమెరికా పరిస్థితి చూస్తే:
Aztecs, Mayas and Incas ఎత్తైన టెంపుల్స్, రహదారుల్తో నిండి ఉన్న మధ్య, దక్షిణ అమెరికాలతో పోలిస్తే, అమెరికా ఓ ఆటవిక సమాజం. రెడ్ ఇండియన్ల తెగలతో నిండిపోయిన ప్రదేశం. అసలొక పూర్తి దేశం కూడా కాదు.
   

ఇలా ఒక్కొక్క ప్రదేశం అనే కాకుండా అయినా, మొత్తంగా చూస్తే కూడా 1500 లో ఫ్యూచర్ వెస్టర్న్ ఇంపీరియల్ పవర్స్ కంట్రోల్ లో కేవలం పదిశాతం ప్రపంచభూభాగం మాత్రమే ఉండేది. అది 1913 కల్లా పదకొండు వెస్టర్న్ ఎంపైర్స్ కలసి ప్రపంచంలో దాదాపు ఐదింట మూడు భాగాల్ని కంట్రోల్ చేయటం మొదలుపెట్టాయి.

సరే, ఇలా ఖండాలన్నీ తిరిగి, ప్రపంచ యాత్ర ముగించుకునేసరికి ఒక్క విషయం స్పష్టంగా కనపడేది. 

పదిహేనవ శతాబ్ధపు మధ్యలో, తూర్పు దేశాల్లోని జీవనప్రమాణాలూ, ఆ సమాజాల్లోని సుస్థిరతా, పాశ్చాత్యదేశాల్తో పోలిస్తే చాలా మెరుగని అర్ధమయ్యేది. 

ఆ కాలంలో ఎవరైనా వచ్చి , భవిష్యత్తులో పశ్చిమ సమాజాలు, ప్రపంచాధిపత్యాన్ని సాధిస్తాయని అంటే అతను/ఆమె అవాస్తవ ప్రపంచంలో బతుకుతున్న మనిషిలాగా కన్పించేవారు. 

కానీ, అదే జరిగింది.
పదిహేనవ శతాబ్ధం లో ఒక పేద్ద సివిలైజేషన్ కి అంకురార్పణ మొదలయింది. ఈ పశ్చిమ నాగరికత ఇంతింతై వటుడింతై పెరిగి ఓరియంటల్ మహా సామ్రాజ్యాలనీ, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలేషియా ని జయించి రాజ్యాల్ని పరిపాలించడమే కాకుండా, ధరించే బట్టల విధానం, విద్యనభ్యసించే విధానం, రోగనిర్ధారణా, చికిత్సా, సంరక్షణా విధానం దగ్గర్నుంచి మొదలుకొని న్యాయవవస్థా, పౌరసమాజపు వివిధ వ్యవస్థల పరిపాలనా విధానాల వరకీ సైతం, వారి పాశ్చ్యాత్య నాగరికత జీవన విధానాన్ని ప్రపంచమంతటా వ్యాపింపచేసింది. 


మరి ఏ కారణాల వల్ల పశ్చిమ సమాజం అభివృద్ది ఊర్ధ్వదిశగా సాగింది? 

1. కేవలం అదృష్టం కలసిరావటం వల్లా?

2. భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కలసి రావటం వల్లా?

3. లేక కరెబియన్ ఐలాండ్స్ లో అనుకోకుండా కాలుపెట్టి అధిక కెలోరీలుండే షుగర్ ని సులభంగా పండించుకోవటం వల్లా?

4. లేక తమ వాతావరణంలో కాటన్ కీ, కోల్ కి అనువుగా లేని భూములు కొత్తగా అడుగుపెట్టిన దేశాల్లో దొరకటం వల్లా?

5. లేక sod's law వల్ల కోల్ డిపాజిట్స్ ని మైన్ చేయడం చైనాకి కష్టతరంగా మారటం వల్లా?

6. లేక తమ గెలుపే తమకి ఒక వల లాగా తయారయిందా చైనాకి? మిగులు ఉత్పత్తి సాధ్యం కాక, అపారమయిన జనాభాకి సరిపోయినంత మాత్రమే కెలోరీస్ సమకూర్చుకోగలిగారా?

7. లేక బ్లాక్ డెత్ మిగిల్చిన అపరిశుభ్ర వీధులూ, వ్యాధితో నిండిపోయిన ఊళ్ళూ, సమాజంలో దిగువ వర్గాలని ఊడ్చేసి, కేవలం ఆరోగ్య, ధనిక వర్గాలు మిగలటం వల్ల, తరువాతి తరాలకి పాస్ అయిన వారి జీన్స్ వల్లా?

Samuel Johnson, Prince of Abissnia లో Rassela అడిగిన ప్రశ్నలో ఈ కారణాలన్నిటినీ తోసిపుచ్చుతాడు. అసలెందువల్ల యూరోపియన్స్ ఆసియానీ, ఆఫ్రికానీ అంత సులభంగా వ్యాపారార్ధం సందర్శించగలిగి, జయించగలుగుతున్నారు? వాళ్ళ తీర ప్రాంతాల్లో దిగి, వారి పోర్టుల్లో కాలనీలు నిర్మించగలుగుతున్నారు? అని అడుగుతాడు. 

దానికి Imlac అనే ఫిలసాఫర్ ఈ కింది విధంగా సమాధానాన్ని వెతుక్కుంటాడు.

"ఒక్క ముక్కలో చెప్పాలంటే యూరోపియన్స్ ఎక్కువ శక్తివంతులు, ఎందుకనగా వారెక్కువ తెలివైనవారు(wiser), జ్ణానమెప్పుడూ శక్తివంతమైనది, అజ్ణానం మీద ఆధిక్యాన్ని కలిగి ఉంటుంది. దానికి ఉదాహరణ మనిషి జంతువుల మీద ఆధిక్యాన్ని ప్రదర్శిస్తాడో చూసి తెలుసుకోవచ్చు. కాని యూరోపియన్స్ నాలెడ్జ్ మనకన్నా ఎక్కువ ఎందుకుందీ అంటే, నేను చెప్పలేను, బహుశా దైవ ఇచ్చ అలాఉందేమో అన్న సమాధానం తప్ప" 

కానీ ఇది నిజమేనా? యూరోపియన్స్ నిజంగా ఎక్కువ నాలెడ్జబులా? బహుశా ఏ 1759 లో ఆ మాటంటే సబబనుకోవచ్చు ఎందుకంటే 1650 తర్వాత వచ్చిన సైంటిఫిక్ ఇన్నోవేషన్ అత్యధికశాతం వెస్టర్న్ ప్రపంచానికి సంబంధించిందే. కాని 1500 లో? 

నిజానికి పదిహేనవ శతాబ్ధపు చివరి కాలానికి, చైనీస్ టెక్నాలజీ, ఇండియన్ మాథమేటిక్స్, అరబ్ ఆస్ట్రానమీ మిగతా దేశాలకన్నా చాలా ముందంజలో ఉన్నాయి. 

మరి ఏది? ఏ కారణం వల్ల ఇంత పెద్ద మార్పు సంభవించింది?

దీనికి చాలా మంది చాలా కారణాలు చెపుతారు/చెప్పారు. ఉదాహరణకి

1. కల్చరల్ డిఫరెన్సెసే కారణమని Max Weber అన్నాడు. 
2. The wealth and poverty of the nations అనే పుస్తకంలో David Landes ఏమంటాడంటే: స్వతంత్ర ధోరణి కలిగిన మేధోపరమైన విచారణా, సైంటిఫిక్ సిద్దాంతాల్నీ ప్రయోగాలతో నిరూపించుకోవడం, హేతువు మూలంగా చేసుకోని జరిగిన శాస్త్రపరిశోధన ఇత్యాదివి వెస్టర్న్ యూరప్ మిగతా ప్రపంచం కన్నా ముందంజ వేసి తద్వారా ఆధిపత్యాన్ని సాధించాయని ప్రతిపాదిస్తాడు. 

కానీ, తను కూడా చివరకి..వీటన్నిటినీ మించి ఏదో కారణం ఉండే ఉండాలి, బహుశా ఇవన్నీ ఒక ఎత్తయితే, పశ్చిమ సమాజాల్లోని పౌర వ్యవస్థలు (institutions) మరొక ఎత్తు, వాటివల్లనే పాశ్చాత్యదేశాలు పైవాటిలోని మంచి ఫలితాలని సమాజంలోని ప్రజలందరికీ అందజేయగలిగాయని అంటాడు. 

దీనికి ఒక మంచి ఉదాహరణ ఇరవై శతాబ్ధం లో, మానవ సమాజం తనమీద తనే అనుకోకుండా జరిపిన ప్రయోగం లాంటి చరిత్రలో కనపడుతుంది. 

1. పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీ 
2. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా
3. చైనా లోపలి చైనీస్ ప్రజలూ, చైనా బయట ఉన్న చైనీస్ ప్రజలూ

ఒకే జాతి ప్రజల్ని, దాదాపు ఒకే సంస్కృతి ఉన్న ప్రజల్ని రెండు పరస్పర విరుద్ద వ్యవస్థల్లో పెడితే ఎలాంటి ఫలితాలొస్తాయో, ప్రజల ప్రవర్తన ఎలా మారుతుందో చెప్పటానికి పైవి గొప్ప ఉదాహరణలు.

Guns, Germs and Steel లాంటి గొప్ప పుస్తకం రాసిన Jared Diamond 1999 లో రాసిన How to get Rich అనే వ్యాసంలో కూడా అదే చెప్తాడు. తూర్పు యూరేషియా మైదాన ప్రాంతంలోని ఓరియంటల్ ఎంపైర్స్ మూస ఆలోచనవిధానంలో మునిగిపోయి ఇన్నోవేషన్ ని నిర్లక్ష్యం చేయడం వల్లా, అదే సమయంలో నదులతో విడిపోయి ఉన్న వెస్టర్న్ యురేషియా లో వివిధ రాజరికాలు, నగరాలూ, దేశాల మధ్య ఉన్న పోటీతత్వం, కమ్యూనికేషన్ వల్లా పశ్చిమ దేశాలు, తూర్పు దేశాలకంటే గణనీయమైన ప్రగతి సాధించాయని అంటాడు. 

కానీ, ఇవేవీ కూడా పూర్తి కారణాల్ని సమగ్రంగా వివరించలేదేమో అన్న అనుమానం ఈ పుస్తక రచయిత వ్యక్తపరచి, తన పరిశోధనలో ఈ కింది ఆరు కారణాలు West ని, మిగతా ప్రపంచం కన్నా ముందంజ వేయించి, నాయకత్వ స్థానంలో నిలబెట్టాయని వాదిస్తాడు. 

1. Competition
పొలిటికల్ మరియు ఎకనామికల్ వ్యవస్థలు వికేంద్రీకరించబడుతూ ఉండడం వల్ల, "రాజ్యం" కన్నా "దేశం" అనే భావం పెరిగి, అది వాటి మధ్య కాంపిటీషన్ కి దారి తీసి, కాపిటలిజం అనే వ్యవస్థకి మార్గం సుగమం చేసింది

2. Science
శాస్త్రీయ శోధనా, పరిశోధన ల్లోంచి వచ్చిన ఫలితాలని అర్ధం చేసుకోవడమే కాకుండా వాటిని ఉపయోగానికి పెట్టటం వల్ల, అనేక ఇతర రంగాల్తో పాటూ మిలిటరీ రంగంలో వెస్టర్న్ వరల్డ్ కి ఆదిపత్యం లభించింది.

3. Property Rights
హింసపద్దతుల ద్వారా కాకుండా, హింస లేకుండా ఆస్థి హక్కుల తగాదాలని పరిష్కరించే చట్ట వ్యవస్థని నిర్మించి, దాన్ని సక్రమంగా అమలు పర్చడం వల్ల, ప్రభుత్వాలు ఎక్కువ కాలం సుస్థిరంగా ఉండి, అవి దీర్ఘకాలిక దేశ ప్రయోజనాల మీద పని చేయటానికి వీలు కలిగింది. 

4. Medicine
సైన్స్ లోనే ఒక భాగమయిన ఆధునిక రోగ నిర్ధారణా, చికిత్సా విధానం ప్రజలు ఆరోగ్యంగా బతకడమే కాకుండా, మనిషి సగటు ఆయుపరిమితిని పొడిగించింది. మెడిసిన్ తక్షణ ఫలాల ఉపయోగం పశ్చిమ యూరప్ సమాజం లోనే కాదు, అదే కాలంలో వారి కాలనీల్లోని వ్యాధుల్ని కూడా నిర్మూలించడానికి ఉపయోగపడింది.

5. The consumer society
మెటీరియల్ కన్సంప్షన్ అనే సంస్కృతి పెరిగి, కట్టుకునే బట్టల దగ్గర్నుంచి, వివిధ కన్స్యూమర్ గూడ్స్ వినియోగం పెరగడం వల్ల ఇండస్ట్రియల్ ఉత్పత్తులకి డిమాండ్ నిలకడగా ఉండీ, ఇండస్ట్రియల్ రివల్యూషన్ నిలబడగలిగింది. 

6. The work ethic
పై కారణాలన్నీ, ముఖ్యంగా వికేంద్రీకృత పోటీ సమాజాలు ఎంత చైతన్యవంతంగా ఉండే అవకాశం ఉందో, అదే సమయంలో కేంద్రస్థానంలో ఒక శక్తివంతమైన ప్రభుత్వమో, అలాంటి ఉక్కు వ్యవస్థో లేకపోతే అవి తొందరగా కూలిపోయే అవకాశాలు కూడా ఎక్కువే. శిఖరాగ్రాన కేంద్రీకృత మరియు అపరిమితాధికారాలు సన్నగిల్లుతూ ప్రజాస్వామ్యం వైపు భారీ అడుగులు వేస్తున్న ఈ సమాజాలు విచ్చిన్నమవకుండా ఉండాలంటే, ప్రజల్లోంచి అంతర్గతంగా వచ్చిన చైతన్యమూ, క్రమశిక్షణా వ్యక్తి శ్రేయస్సు వైపే కాకుండా, సమాజ శ్రేయస్సు వైపు కూడా వెళ్ళగలిగేలా పని సంస్కృతి, ప్రజల్లో ప్రబలంగా ఉండాలి . ఆ సంస్కృతి పెంపొందించడానికి, ఇతర కారణాలతో పాటూ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ లోంచి వచ్చిన ఒక మోరల్ ఫ్రేమ్ వర్క్ కూడా తోడ్పాటునందించింది.

చివరగా, కేవలం పైకారణాల వల్లే పశ్చిమ సమాజాల ఆధిక్యం సిద్దించి, చిట్టచివరకి మిగతా దేశాల కాలనైజేషన్ కి దారితీసింది అని చెప్పడం పూర్తిగా సత్యదూరమే అవుతుంది. ఈ కారణాలకి తోడు పాశ్చాత్య సమాజాల ప్రత్యర్ధుల్లో కూడా అంతర్గతంగా వచ్చిన సంక్షోభాలు సైతం ఆ సమాజాల ఎదుగుదలకి ప్రతిబంధకంగా పరిణమించాయి. 

ఉదాహరణలు గమనిద్దాం: 

1. 1640 లో చైనాలో ప్రబలిన ఆర్ధిక, ద్రవ్య సంక్షోభాలూ, వాతావరణ మార్పూ, వ్యాధులూ మింగ్ డైనాస్టీ మీద విప్లవానికి దారితీసాయి. 
2. అలాగే Ottoman empire పడిపోవడానికి బాహ్యకారణాల కన్నా, అంతర్గత కారణాలే ఎక్కువ. 
3. అమెరికా ఖండాల్లో కూడా ఇదే ఉదాహరణని గమనించవచ్చు. ఉత్తర అమెరికా ల్లోని పొలిటికల్ వ్యవస్థలు పటిష్టంగా ఎదిగాయి, కాని అదే సమయంలో దక్షిణ అమెరికా ల్లోని రాజనీతివ్యవస్థలు తేలిపోయాయి. 

Simon Bolivar ప్రయత్నాలు దక్షిణ అమెరికా దేశాలనిటినీ ఒక్కచోట చేర్చి, United States of Latin America గా రూపొందించలేకపోవడానికీ, పైన పేర్కొన్న ఆరు కారణాలకీ ఏ సంబంధమూ లేదు. 

వెస్ట్ కీ, మిగతా ప్రపంచానికీ ఈ కాలంలో ప్రస్ఫుటమైన తేడా కోసం అన్వేషిస్తే , కీలకమయిన తేడా "సమాజంలో ఏర్పరుచుకున్న వ్యవస్థల" కి సంబంధించిందని అర్ధమవుతుంది. 

చరిత్రని ఇలా వెనక్కి తిరిగి చూసినప్పుడు Western Civilization ఒక తిరుగులేని శక్తి గానూ, ఎప్పటికీ నీరుకారని ఒక పటిష్టమయిన వ్యవస్థ గానూ కనిపించవచ్చేమో, కానీ అంతకన్నా పొరపాటు లేదనే విషయం చిట్టచివరగా ఈ విషయాన్ని గుర్తించడం ద్వారా గమనించవచ్చు. 

Western Civilization ఇంతకు ముందో సారి పైకెగసి, నశించి కిందకి రాలిపోయింది. 

రోమన్ ఎంపైర్ శిథిలాలు యూరప్ అంతా చెల్లాచెదురయి పడడాన్ని చరిత్రలో గమనించవచ్చు. నిజానికి Western Civilization 1.0 version గా చెప్పుకోతగ్గ నాగరికత , Nile, Euphrates , Tigris నదుల పరీవాహక ప్రాంతాల్లో మొదలవడమే కాదు, Athens Democracy , Roman Empire అనే రెండు శిఖరాల్ని అందుకోగలిగింది. ఈ రోజున్న నాగరికతలో మౌళికమైన ప్రజాస్వామ్యం, పౌర న్యాయ వవస్థా, రేఖాగణితం, అంకగణితం, ఆర్కిటెక్చర్, క్రీడలూ, ఆంగ్ల భాషలోని అనేక పదాలూ అన్నీ కూడా ఆ " పురాతన వెస్ట్ " నుంచి వచ్చినవే. అలనాడే రోమన్ సామ్రాజ్యంలో ఉత్పత్తిదారులూ, వ్యవసాయ ఉత్పత్తులూ, నాణాల మార్పిడి చలామణీలో ఉండేవి. చట్టం, మెడిసిన్ రాజ్యంలో ప్రజలకి అందుబాటులో ఉండేది. అంత గొప్ప రోమన్ ఎంపైర్ కూడా అంతర్గతంగా ఉద్భవించిన కారణాల వల్లా, బార్బేరియన్ దండయాత్రల వల్లా, క్షీణించిపోయింది. 

మరిప్పుడు Western Civilization 2.0 కూడా అదే మార్గం వైపు వెళ్తోందా? పూర్వం నుంచీ కూడా ప్రపంచ జనాభాలో వెస్టర్న్ వరల్డ్ జనాభా శాతం తక్కువే. కాని అది ఇప్పుడు మరింత పలచబడింది. ఒకప్పుడు ప్రపంచాన్ని డామినేట్ చేసిన అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇంకో ఇరవై, ముప్పై సంవత్సరాల్లో చైనా, బ్రెజిల్, రష్యా, ఇండియాలు అమెరికా, యూరప్ లని దాటేసి ముందుకెళ్లబోతున్నాయి. 2007 లో అమెరికాని ముంచెత్తిన ఆర్ధికసంక్షోభం, కన్స్యూమర్ సొసైటీ ల్లో ఉండే మౌళికమైన బలహీనతల్ని బయటపెట్టింది. అసలు వెస్టర్న్ సివిలైజేషన్ కు తనమీద తనకున్న నమ్మకమే సడలిపోయినట్లుగా కనపడుతోంది. 

కాని, అది నిజమేనా? ప్రపంచవిపణి వీధుల్లో, వివిధ కూటముల వేదికలమీదా, ఇతరదేశాల్లొ వెస్టర్న్ సివిలైజేషన్ ప్రభావం క్రమక్రమంగా క్షీణించడం తప్పదా ? లేక ఇది ఒక కేవలం సంధి యుగం మాత్రమేనా? మిగతా ప్రపంచం ఎదుగుదల మొదలయి, వెస్ట్ జీవనప్రమాణాల్ని తమ తమ సమాజాల్లో అత్యధిక ప్రజలకి అందించే దశ అంతానికొచ్చినప్పుడు, ప్లేయింగ్ ఫీల్డ్ సమాంతరమయ్యాక, ఆ ఎదుగుదలలో భాగంగా ఉండే కరప్షనూ, పొల్యూషనూ, అసమానతలూ మిగతా ప్రపంచాన్ని పట్టి పీడించి వాటి ఎదుగుదల శాతాన్ని పడదోస్తాయా? అలా అయితే వెస్టర్న్ వరల్డ్ ముందులా వెలిగిపోకున్నా , మిగతా ప్రపంచం కన్నాముందే నిలబడుతుందా ? లేక క్రమక్రమంగా వెనకపడిపోతుందా?

ఇలాంటి పరిస్థితుల్లొ దాదాపు మూడొందల సంవత్సరాల పైబడిన పశ్చిమ ప్రపంచపు నిరంతర ఎదుగుదలకి కారణాల్ని లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతయినా ఉంది.

5 comments:

  1. విశేశాలు చాలా బాగున్నాయి. అసలు ఒకప్పుడు భారత ఉపఖండం దాదాపుగా 1200 యేల్లు ప్రపంచములోనే అత్యధిక జి.డీ.పీ కలిగిన దేశంగా ఉండేదని చెపుతారు. దాన్ని మనం గోల్డెన్ పీరియడ్ గా చెప్పుకుంటాం. చైనా కూడా మన తరువాతే. అలాంటి పరిస్థితులనుండి పశ్చిమ దేశాలు ఇప్పుడున్న స్థితికి రావడానికి కారణమైన వటిని తెలుసుకోవడం ఆసక్తి కలిగించే అంశమే.

    ReplyDelete
  2. నిత్యం స్కాములతో కొట్టుకు చచ్చే మన రాజకీయ వ్యవస్థకి ఇలాంటి అధ్యయనాలు పట్టవేంటో.

    ReplyDelete
  3. చాల చాలా బావుంది కుమార్ జీ , మీరు పరిచయం చేసిన విధానము . మొత్తం అయ్యాక బోలెడు ప్రశ్నలు ఉన్నాయి :-)

    అసలు అన్నిటికన్నా ముందు నా స్వంత theoryఒకటుంటుంది ఎలా పుట్టి ఎలా నాశనం అవుతాయా అని , of course మీరు చదివారు కూడా అనుకోండి :-) మీకు మాత్రం చాలా థాంక్స్ ఇంత ఓపికగా ఈ వివరాలు అందిస్తున్నందుకు !

    ReplyDelete
  4. ఆశక్తి కరంగా ఉంది .

    రచయిత భారత దేశం లో ఏం జరుగుతోందో రాయలేదు 14 - 15 శతాబ్దాలలో

    చెప్పుకోతగ్గవి ఏం జరగట్లేదనా. .

    ReplyDelete
  5. ఈ పుస్తకం చదవాలనిపిస్తోంది.

    ReplyDelete