Thursday, 4 July 2013

పయనమయే మేఘమా ...

Posted by Kumar N on 7/04/2013 02:20:00 pm with 1 comment
తీరిగ్గా ఉన్నాను కదా అని ఇంకా తెరవని సూట్కేస్ లో అడుగున ఉన్న కెమెరా బయటకు లాగి బాక్ బాక్ అని కొడుతూ పోతూంటే తెలిసింది.

బ్రెత్ టేకింగ్ ...ఐ మీన్ సీరియస్లీ బ్రెత్ టేకింగ్..

మన కాళ్ల కింద భూమిని లాగేసి అదాటున ఎదురుగా ఉండే లోయల్లోకి విసిరేసే బ్రెత్ టేకింగ్ సీనరీస్ మున్నార్ లో అతి సాధారణం. అలాంటి సైటింగ్స్ నీ, లాండ్ స్కేప్ నీ ఒక టూ డైమన్షనల్ బౌండరీ మధ్య స్టిల్ ఇమేజ్ కింద, అదీ ఓ పాయింట్ అండ్ షూట్ డొక్కు కెమెరాలో బంధించాలనుకోవడం, ఈ విశ్వ కార్యాచరణని ఏ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ లోనో, యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ లోనో ఇరికించాలనుకోనేంత మూర్ఖత్వమని( అపాలజీస్ టు ఫిజిసిస్ట్స్ ) అర్ధమయింది.

మున్నార్ లో మూడు రాత్రులు ఓ కాటేజ్ లో ఉండటం జరిగింది, బెడ్ పక్కనే చేతికందేంత దూరంలో పైనుంచీ కింద దాకా రెండు రెక్కలున్నకిటికీ . ఒకటి మాత్రం చెప్పగలను. ఏ ప్లేస్ ని విజిట్ చేసినప్పుడైనా ..ఐ విల్ కమ్ బాక్ టు దిస్ ప్లేస్ అగయిన్ అనుకున్న ప్రదేశమేదన్నా ఉందంటే..అది మున్నార్.

It's a heavenly place, where you walk on clouds and surf on wind. And it's not a metaphor that I said.

ఏ కిటికీ కూడా నాలో కిటీకీలను అంత సేపు తెరచి ఉంచలేదు, ఏ బాల్కనీ కూడా నన్నంత సేపు తనతో ఉంచుకోలేదు.

ప్రకృతి అంటే ఓ స్థిరదృశ్యమనీ, ఋతువులు మారినప్పుడే రంగులు మారతాయనీ, పయనమయే మేఘమంటే ఏ బొమ్మదేవర నాగకుమారి సీరియల్ టైటిలని భ్రమపడ్డమో లేక కార్ దాకా నడిచే ఏదో సమయంలోనో తలెత్తి చూసే రెండు క్షణాల ఆసక్తికరమయిన సమయం అని తెలిసిన జీవితం నాది.

నా మీదున్న దుప్పటి తీసేసినంత వేగంగా, చిక్కటిచీకటి తెర లాగేస్తే బాగుండని పలచటి వెలుగు కోసం ఎదురుచూసేలా చేసిన ఉదయాలవి. మెలకువ రాగానే మామూలుగా సెల్ ఫోన్ కోసం సాగే నా చేతులు, కిటికీ రెక్కల కోసం పరిగెట్టిన ఉదయాలు.

ఆ సమయంలో నల్లటి అనంతంలోకి నెమ్మదిగా నడుచుకుంటూ పోయి వేచి చూసేది నాలోని ఓ పంచప్రాణమేదో.

చీకటక్కడే ఉండేది కానీ కాసేపటికి వెలుతురు మాత్రం వచ్చి తనతో కలిసేది. కలిసున్న ఆ కాస్తసమయంలో ఆ రోజు జరగాల్సిన తంతులు నిర్ణయించేవేమో అవి, లోకం మాత్రం ఓ వింతవర్ణంతో అలంకరించబడేది. ఆ తరవాత చీకటి వెళ్ళిపోయేది కానీ, కళ్యాణానికి ముందు ఏ దివ్యపురోహితుడో అడ్డుపెట్టిన తెరలా ఓ చిక్కటి దట్టపు ధవళవర్ణపు తెర ఒకటి ఇంకా మిగిలే ఉండేది.

"గగనమంతా నిండి పొగలాగు క్రమ్మి, బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను " . అప్రయత్నంగా శ్రీశ్రీ నా ముందు కదలాడేవాడు.

మేఘమేదో ఆకాశమేదో ఆ రెంటి ఆదీ అంతాలేవో తెలీని చిత్రం.

అదో అద్భుతం.

ఆ తెరకవతల ఏమవుతుందో తెలిసేది కాదు, పెళ్ళింటి బయట నిలబడి వేచి చూసినట్లుగా ఉండేది నా పరిస్థితి. ఉన్నట్లుండి హడావిడి మొదలయ్యేది. ఆ, ఇక "చప్పుళ్ళు వాయించండయ్యా " అనేవారనుకుంటా పై నుంచి ఎవరో. అప్పటికే అందరి మీదా అత్తరు చిలకరిస్తున్న గాలి కాస్తా బాజాలందుకోని సంగీతమెత్తుకునేది. పిలుపు కోసమే కాచుక్కూచున్న చెట్లు కాస్తా సంగీతానికి తగ్గట్లుగా హోయలు పోయేవి.

ఇంతలోనే బాణీ మారేది.. గాలి హోరుగాలయ్యేది. సంగీతంతో పాటూ నృత్యం మొదలెట్టేది. పక్కన చూస్తూ కూర్చున్నవేటినైనా తనతో పాటే లాక్కెళ్ళి మరీ చిందులేపించేది. చెట్లు తమలోంచి తాము బయటకొచ్చేంతగా మర్చిపోయి మరీ డాన్స్ చేసేవి.

మేఘాలన్నీ కళ్ళెదుటే ఉండేవి కాని, ఈ సంతోషంలో పాలుపంచుకోడానికి ఇంకే లోకాల్లోంచి వచ్చేదో కానీ, జోరుమంటూ దూకేది వర్షం. అతికొద్ది సేపట్లోనే మళ్ళీవస్తానంటూ వెళ్ళిపోయేది.

ఎక్కణ్నుంచో ఓ పక్షి తేలుకుంటూ వచ్చి, ప్రభాతవేళల్లో ఐక్యమవ్వాలన్న నా కోరికని తను తీర్చుకొని వెళ్ళేది.

ఈలోపు ఇంకో కార్యక్రమమేదో మొదలయ్యేదనుకుంటా.

మళ్ళీ తెరదించబడేది.

వేదిక విడిదికొండమిదకి మారేదేమో, అక్కడ హడావిడి మొదలయ్యేది. మేఘాలు ఆడపిల్లలయ్యి తయారయ్యడం మొదలెట్టేవి. వాళ్ళ తడారని కురుల్లోంచి జారుతున్న చినుకుల్ని గాలి మోసుకొచ్చి నామీద చిలకరించేది.

ఈ కోలాహలమిలాగే సాగుతూ ఉండేది.

పల్లకీలేవో కదుల్తూ పోయేవి. కొత్త అతిథులెవరో పైనుంచి రథాల్లో దిగేవారు.

ఆశీర్వాదాన్నందించి ఆమోదించాల్సిన గౌరవనీయమైన కుటుంబపెద్ద ఎవరో వచ్చే సూచనందేమో..

తెర మెల్లిమెల్లిగా తప్పుకునేది. కళ్యాణవేదిక కొద్ది కొద్దిగా కనపడేది. దూరంగా వేదవృక్షాలేవో వేదికకి కుడి పక్కనే గంభీరంగా మంత్రోచ్చరణాలు చేస్తూ కనపడేవి. వేదిక ముందు భారీముత్తయుదువుల్లాంటి చెట్లు చాలా సేపట్నుంచీ కూర్చొని ఉన్నట్లుగా తెలిసేది.

అప్పుడు కనపడేవాడు దివ్యనాథుడు..కొద్ది క్షణాలు.

లోక కళ్యాణ సమయం కదా.. లోకమంతా స్వచ్చంగా తేటతల్లమయ్యి పునీతమయి కనపడేది.

తెరచిఉన్న కిటికీల్లోంచి కొత్తప్రాణమేదో వచ్చి నా గుండె నిండేది.

నిత్యకళ్యాణం పచ్చతోరణం అనేది విన్నాను..ఇక్కడ ప్రతిరోజూ అది చాలా సార్లు చూసాను.

నా కళ్లకే కాదు, నా పిల్లల తరానికీ, ఇంకా ముందు తరాలకీ కూడా ఈ స్వచ్చత ఇలాగే మిగిలిపోవాలనీ, మానవసౌకర్యాన్నంటిపెట్టుకుని ఉండే కాలుష్యం టూరిజం రద్దీతో జతయ్యి ఈ నిరంతర కళ్యాణాలన్నీ ఆగిపోకూడదన్న ప్రార్ధనతో మున్నార్ ని వదిలి వచ్చేసాను.

ఊహు....రాలేదు... నాతో పూర్తిగా నావన్నీ రాలేదు.

ఈ పిక్చర్స్ లో కనపడుతూందే..నిటారుగా నిలబడి అక్షింతలు చల్లే చెట్టు, తలొంచి ఆశీర్వదించే చెట్టు, తపస్సు చేస్తున్న చెట్టు...ఆ చిటారుకొమ్మన నా ప్రాణమొకటి వదిలేసి వచ్చాను.. వచ్చేయుగాల తపస్సు కోసం.

ఐ యామ్ సీరియస్.

మీరెప్పుడన్నా వెళ్తే ఎలా ఉందో ఒకసారి చూసుకోరూ.. ప్లీజ్.


(July 2013)