Saturday, 8 November 2014

Enchantment of an unknown!

Posted by Kumar N on 11/08/2014 04:57:00 am with No comments

 ".... మెట్లు ఎక్కుతూంటే ఆ మెట్ల దగ్గిర ఒక ప్రేమికుడు పారవశ్యంతో ఫిడేలు వాయిస్తున్నాడు. అతడు యాచకుడు కాదు, దాత. జీవితానందం నుండి తాను పొందిన సమస్త ఉత్తేజాన్ని దోసిళ్లతో విరజిమ్ముతున్న ఆనందప్రదాత. మిత్రులారా, ఆనాటి ఆ ....... ఆ సంగీత వాద్యాలు, ఆ జనసందోహం ఇవన్నీ ఒకుమ్మడిగా నా ఆత్మపైని మీటిన ఆనందసంగీతాన్ని నేను మీకు ఎట్లా వివరించగలను? "  --  అనంటాడు చినవీరభధ్రుడు తను తిరిగిన దారుల్లో ఒకచోట. 

న్యూయార్క్ సిటీలోనో, లేక ఫిలడెల్ఫియా, చికాగో లాంటి మహానగరాలలో
నో జనసమ్మర్ధం గల ప్రాచుర్యం పొందిన కూడళ్లల్లో ఎప్పుడయినా ఎవరయినా కూర్చోనో, నించోనో వాయిద్యం వినిపించడాన్ని చూట్టం నాకు కొత్తేమీ కాదు. రెండు వారాల క్రితం వెళ్లిన బోస్టన్ లో ప్రుడెన్షియల్ సెంటర్ నుంచి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎంతో బిజీగా రద్దీగా ఉండే ఆ సమయంలో, చిరుచలి మెల్లగా ముదరబోతున్న ఆ సాయంత్రపు నియాన్ లైట్ల రాత్రిలో, నాలుగు రోడ్ల మధ్య వాక్ వే లో నిలపడి, వెచ్చటి సూట్ వేసుకొని ఏ కార్ఫోరేట్ ఆఫీస్ లోనో పని చేసే ఓ ప్రొఫెషనల్ వ్యక్తి, తాద్యాత్మత తో వేణువు వాయిస్తున్న దృశ్యం నుంచి కళ్లు తిప్పుకోలేక మళ్లీ మళ్లీ చూసుకుంటూ పోవాల్సి వచ్చింది. వెనకాల కాప్ ఉన్నాడు కాబట్టి , లేదంటే ఎలాగోలా కార్ ఎక్కడో ఓ దగ్గిర ఆపి వెళ్లేవాణ్ని, అదీ కాదంటే కనీసం ఒక ఫోటో అయినా తీసుకునేవాణ్ణి.

నిజానికి క్రిస్మస్ చలి కాలంలో టైమ్స్ స్క్వేర్ దగ్గిరా, మేసీస్ కి ఎదురుగా, వెచ్చగా బట్టలేస్కొని , చేతులు కట్టుకుని చుట్టూ చమక్ చమక్ మని బంగారు, వెండి రంగుల నక్షత్రాకార విద్యుత్ దీపాల మధ్య నో, రాల్తున్నట్లున్న వెండి మంచు అద్దిన దీపాల కిందనో నించొని ఆ సంగీతాన్ని వినటం ఒక అనుభవం.

అలాగే, ఫ్లారెన్స్ లో నడూస్తూంటే దూరంగా ఎక్కడో వినిపిస్తూన్న మ్యూజిక్.. అకార్డియన్ అనుకుంటా. ఎవరో Bach మ్యూజిక్ ని ప్లే చేస్తున్నారు కూర్చొని. నించొని చూసాం కాసేపు.

కాని ఉల్లాసంగా ఉండే ఆ అనుభవాలు వేరు, ఆ పైన రచయిత పేర్కొన్న అనుభవం వేరు.

పదవరోజు వచ్చేప్పటికి అలసిన కాళ్లు వెనిస్ వీధుల్లో బద్దకంగా ఒక దిశ లేకుండా నడుస్తూ ఒక చిన్న వీధిలోకి తిరగ్గానే, ఆ పైన తను పేర్కొన్న దాత ఎదురయ్యాడు మాకు.

సందర్శకులతో కాక, ఆ వీధి కనిపించని మృదు తరంగాలతో నిండి ఉంది. అలవాటుగా ముందుకెళ్లబోయే కాళ్లు నిలిచిపోయాయి,చుట్టూ చూసే కళ్లాగిపోయాయి.

ఫ్లైయింగ్ సాసర్ లా ఉందది. ఇదేంటో వింతగా ఉందే అనుకుంటూ చూస్తూ ఆగాం.

ఆ అయిదు నిమిషాల్లో ఆ సన్నటి వీధిలో గాల్లోకి లేచి, గోడల్ని తాకి, తిరిగొచ్చి మమ్మల్ని చేరిన ఆ మెత్తటి మ్యూజిక్ అలసిన మా శరీరాలకి మందులా పనిచేసి మమ్మల్నక్కడే కూర్చోబెట్టింది. అసలా మృదుమధురమయిన  మెలోడీ ధారల కింద మనసులు తలస్నానం చేసాయి అంటే అతిశయోక్తి కాదేమో.

 


ఒక పాట(?) అయ్యాక, నోటీస్ చేసాను. ఆ వీధిలోకి వచ్చిన వాళ్లెవ్వరూ పోవట్లేదని, అక్కడే ఆగిపోతున్నారని. పాటయిందని చప్పట్లయ్యాక తనొక సారి స్మైల్ చేసి తల వంచి చేతి వేళ్లని ఆ పళ్లెం మీద మళ్లీ ఆడిస్తూంటే, మా శరీరాల మీద మసాజ్ చేసినట్లనిపించింది.

అలా కొనసాగిన ఆతని కళ, తరువాతి అరగంటలో మాకు అవసరమయిన చికిత్సనీ, కావలసిన ఉత్తేజాన్నీ అందించింది.

అంతా అయ్యాక దగ్గరకెళ్లి అడిగాను. ఎప్పుడూ చూడలేదిది ఏమంటారు దీన్ని అని. చెప్పుకొచ్చాడు. రకరకాల దేశాల మ్యూజిక్ ప్లే చేసి చూపించాడు దాని మీద, ఇండియన్ నోట్స్ కూడా. చివరకి విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చాడు తన మ్యూజిక్ వెబ్ సైట్ తో. కానీ వెనిస్ లో వంద యూరోలు పెట్టుకొని కొనుక్కున్న వాటర్ బస్ వేపరొట్టె :) టికెట్లు పోగొట్టుకున్నప్పుడు, వాటితో పాటే ఇదీ పోయింది. ఆ టికెట్లని మళ్లీ ఏడ్చుకుంటూ కొనుక్కోక తప్పలేదు కానీ, ఇదెక్కడ తేగలం. సో అతని పేరేంటో కూడా మర్చిపోయాను.

ఎనీ వే.. తను చెప్పినవీ, నేను కనుక్కున్నవీ:

దీన్ని తను హార్మొనిక్ డిస్క్ అన్నాడు. ఇంకొంత మంది హాండ్ పాన్ అనీ, మరికొంతమండి హాంగ్ అని అంటారు. ఇది చాలా కొత్త ఇన్స్ట్రుమెంట్. 2000 లో కనుక్కోబడింది. దీంట్లో ఎన్నో వేరియేషన్స్ ని చాలా మంది ట్రై చేస్తున్నారు .  

స్విట్జర్లాండ్ లో ఇన్వెంట్ చేసారనుకుంటాను. డ్రమ్స్, కౌ బెల్స్, గాంగ్, మ్యూజికల్ సా ఇలాంటి వాటి నుండి వచ్చే సంగీతాన్ని ఇంప్రూవైజ్ చేసి   చాలా సంవత్సరాల కంటిన్యూయస్ ఇంప్రూవ్మెంట్ తరువాత ఈ షేప్ ఇన్స్ట్రుమెంట్ తయారయిందిట. ఇది బేసికల్ గా పర్కషన్ ఇన్స్ట్రుమెంటే డ్రమ్స్ లాగా, కానీ దీంట్లో మెలోడీ చాలా ఉంది. పియానో కూడా అంతే కదా పర్కషన్ పీసే కానీ ఎంత మెలోడీ మ్యూజిక్ సృష్టిస్తారు దాని మీద!!

ఫస్ట్ జనరేషన్ లో ముందు కేవలం డొల్లగా ఉండే రెండు స్టీల్ ప్లేట్లు అంటించినట్లుగా ఉండి మెలోడీ తక్కువా, డ్రమ్స్ మ్యూజిక్ ఎక్కువా వచ్చినట్లుగా ఉండేది. కాని దాని చుట్టూ చిన్న చిన్న సొట్టల్లా ఉన్నాయే :) అవి యాక్చువల్ గా చాలా ఇంపార్టెంట్.. నోట్స్ వాటినుంచే వస్తాయి. ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్తూంటే హై నోట్స్ నుంచి మొదలయి, క్రమక్రమంగా లోనోట్స్ వస్తూంటాయి. కాని ఇప్పటికీ ఫుల్ స్కేల్ నోట్స్ రావింకా. ఇంకా రీసర్చూ లాంటిదేదో నడుస్తోందిట ఈ ఇన్స్ట్రుమెంట్ మీద.  ప్రస్తుతానికి సంవత్సరానికి కేవలం ఒక వందో, లేక రెండు మూడొందలు మాత్రమే తయారవుతున్నట్లుగా తెలుస్తోంది.

నాకు తెలిసి ఇంత కొత్త ఇన్స్ట్రుమెంట్ ని, అంటే నేను పుట్టాక కనిపెట్టబడిన ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ ని వినటం ఇదే మొదటిసారి నాకు. అసలు అమెరికాకి వచ్చాక, ముఖ్యంగా పిల్లల మ్యూజిక్ కన్సర్ట్స్ కీ, ఆడీషన్స్ కీ వెళ్లటం మొదలయ్యాక కొత్తగా చూసిన ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నో. నాకన్నా పెద్దగా, వెడల్పుగా ఉండే వాటిని మోసుకెళ్లే వందల కొద్ది పిల్లల్ల్నీ, వాటినేసుకొని వారానికి ఎన్నో సార్లు ఊరంతా తిరుగుతూ , పిల్లలకి హెల్ప్ చేసే తల్లులూ, తండ్రులనీ, తాతలనీ చూసి ఎన్ని సార్లు ఆశ్చర్యపోయానో, అడ్మైరింగ్ గా చూసానో. కానీ అవన్నీ కూడా నాకు కొత్త, అవి కొత్తవి కాదు. 
కానీ ఇది కొత్తగా కనిపెట్టబడిన ఇన్స్ట్రుమెంట్.ఈ హాంగ్ ని పాపులర్ చేయాలని యూరప్ లో చాలా చోట్ల పాషనేట్ కళాకారులు రోడ్ల మీదా, చౌరస్తాల్లోనూ ప్రదర్శనలిస్తున్నార'ట'.
అయితే,  దీని గురించి తెలుసుకుంటూంటే నాకు ఇంకో కొత్త వ్యక్తి డేనియల్ తగిలాడు నెట్ లో. వీణ్నో సారి వినండి (వీడు అని అఫెక్షనేట్ గా అంటున్నా). అసలు వాణ్ని చూస్తూంటే ఆ ఫ్రెష్నెస్, ఆ నవ్వూ, ఆ తృష్ణ, ఆ లిటిల్ ఇన్నోసెన్స్, ఆ ఆకలి, ఆ కళ్లల్లో మెరుపూ, పాషన్....  పదకొండేళ్ల వయసులో మార్చింగ్ బాండ్ లో మిలటరీ ప్రిసిషన్ తో ప్లే చేయగలిగే నైపుణ్యం సంపాయించిన అనుభవమూ, ఆ వయసులోనే ఇంగ్లాండ్ రాణి ఎదురుగా పర్ఫార్మ్ చేసిన అవకాశమూ, మ్యూజిక్ నోట్స్ ని టెక్నికల్ గా మోస్ట్ యాక్యురేట్ గా పలికించగలిగిన గిఫ్ట్ ...  అసలివన్నీ బోరింగ్ స్టఫ్ అని ఓ ఐదారేళ్ల క్రితం వదిలేసి ఇదేదో కొత్తగా ఉందే అని దీన్ని నేర్చుకొని,  ఆఫ్రికన్ నేటివ్ మ్యూజిక్ దీని మీద ప్లే చేస్తే ఎలా ఉంటుందో అని నేర్చుకోవడానిక్ ఆఫ్రికాకి నాలుగయిదు సార్లు వెళ్లి...

Oslo లో ఇతను రోడ్ మీద ప్లే చేస్తూంటే ఎవరో వీడియో తీసి యుట్యూబ్ లో పెట్టారట. దాదాపు ఐదారు మిలియన్ వ్యూస్ వచ్చాక ఇతనికి తెలిసిందిట. ఇంత పాపులారిటీ వచ్చిందా అనుకొని ఇంటర్నెట్ లో ఉండే పవర్ ఏంటో అర్ధమయి, తను ఇంటర్నెట్ మీద పడ్డానని చెప్తాడు. కాని ఆ వీడియో పెట్టినతను నా పేరు పెట్టలేదనీ, చివరికతన్ని చేజ్ చేసి పట్టుకొని ఆ వీడియోలో తన పేరు పెట్టించానని చెపుతాడు. 
ఇంతకుముందు ఎప్పుడూ ప్లే చేయని ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేయాలన్న పాషన్ పద్దెనిమిది నెలల్లో ఇరవైమూడు దేశాలు తిప్పిందిట, ఇలాగే అక్కడా ఇక్కడా వచ్చిన డబ్బులతో. సాఫ్ట్ వేర్ ని ఓపెన్ సోర్స్ చేయాలన్న ఫిలాసఫీని నమ్మినవాళ్లలా తిను కూడా ఇతని హాంగ్ మ్యూజిక్ www.hanginbalance.com లో ఫ్రీగా పెట్టాడు. తనేమంటాడంటే నా వెబ్ సైట్ లో మ్యూజిక్ కూడా స్ట్రీట్ లో నేను ప్లే చేసే లాంటిదే.. నా దగ్గిరకి వచ్చి చూసిన వాళ్లు నచ్చితే ఇవ్వాలనిపిస్తే రెండు కాయిన్స్ విసుర్తారు, ఇట్స్ గ్రేట్.. ఇవ్వకపోయినా పర్లేదు ఇట్స్ గ్రేట్ టూ అనంటాడు అదే నవ్వుతో.

డేనియల్ బెంగళూర్ కి వచ్చినప్పుడు TED టాక్ లో:  



ఇంకా కావలిస్తే లండన్ మూల మీద, టన్నెల్స్ లో, నార్వే నడి వీధుల్లో, చైనా గ్రేట్ వాల్ మీదా ఉన్నాయి. ఇతనే కాదు మిగతా చాలా మందివి ఉన్నాయి.

ఇదంతా చూస్తున్నప్పుడు, మళ్లీ మళ్లీ ఇలా వింటున్నప్పుడో.. ఎప్పుడో ఒకసారి తగుల్తుంది. చాలా సార్లు మామూలుగానే బతికేస్తూంటా రేపటి లెక్కలేవో, వాటికాడించాల్సిన రెక్కలేవో, తేవాల్సిన ముక్కలేవో, భద్రంగా కట్టాల్సిన తడికలేవో చూసుకుంటూ, చాలీ చాలని దుప్పట్లని తడిమి తడిమి కప్పుకుంటూ . కాని I have to tell you I hated him after a while because he made me to hate myself for few moments. నా ఒంట్లో ఒక్క కణం కూడా, ఒక కొత్త క్షణాన్ని సృష్టించలేకపోయింది జీవితంలో, అసలే సెల్ కూడా అందుకు పనికిరాదని తెలిసాక వచ్చే నిస్పృహ ఉంది చూసారూ...!

పైగా ఇలా దేశాలు పట్టి, వీధుల్లో వాయిస్తూ.. డబ్బుల మీదెప్పుడూ ధ్యాస పెట్టలేదు నేను. నా టికెట్లకీ, హోటల్స్ కీ సరిపోయేంతగా వస్తాయి.. అని చెపుతూ...

"As a musician I realized long time ago, that you will never go hungry"  అంటాడు అదే నవ్వుతో.

Indeed. I don't go hungry too, but..............

0 comments:

Post a Comment