Saturday, 4 May 2013

సంతోషమరణ క్షణాలు

Posted by Kumar N on 5/04/2013 02:36:00 pm with No comments
క అందమైన సాయంత్రం.......

వీడికి అమాయకత్వం ఎప్పటికీ పోదేమోనన్న కొడుకుతో.. ఇంటి వెనకాల.. సస్యశ్యామలం పాఠ్యపుస్తకాల్లో కాకుండా కంటికెదురుగా ఆరోగ్యంగా, అహ్లాదంగా , ఏపుగా.. సంధ్యాసమయాన, అనాది నాదమేదో జోరున జారిపోతున్నన నీళ్ళల్లోంచి..సృష్టి చైతన్యం లోకి నిండుతూ..మానవ చైతన్యం లోకి ఇంకుతూ...

ఇహ చీకటిపడుతోందని లోపలికొచ్చాక, వాడికిష్టమయిన రెండు చదరంగపు ఆటలు, గెలుపెప్పుడూ నాదే అయినా మళ్ళీ మళ్ళీ అన్నీ సిద్దం చేసి నాతో ఆడు నాన్నా అని నా దగ్గరికి వచ్చే పసితనం

ఏదో కదుపుతున్నానే కానీ..

అప్పట్నుంచీ పక్కన లేని ఈ మనుషులు(?) మెల్లిమెల్లిగా నరనరానా, ప్రతీ జీవకణం నిండా వాళ్లే నిండుతున్నారో, లేక వాటిల్లో జీవమే నింపుతున్నారో తెలీదు..

కళ్ళనిండా...కృతజ్ణత....నాగరికత చాచిన చేయి వేలి కొనలమీద నుంచి జారి..పచ్చిగా...తడిగా...

ప్రభూ...

మాటలు గొంతులో ఆగటం కాదు, అసలు మాటలే లేని ప్రపంచంలో నా చెర లోంచి నేను తప్పించుకున్నప్పుడు..నువ్వు నాతో మాట్లాడుతావని ఊహించలేదు.

ఏ ఆకాశమార్గానో తిరుగుతుంటావనుకోని తలెత్తి చూసేవాణ్ణి.. ఎంత అవివేకం.

నువ్వు సృష్టించిన ఈ విశ్వం నడిచే సూత్రాలేవో కనపడేవట ఐన్ స్టీన్ కి.... ఆ మాథమేటికల్ ఈక్వేషన్స్ లో నువ్వు కనపడ్డప్పుడు, నీ మాటలేవో ఆయనకి అర్ధమయ్యేవట.

అజ్ణానిని..మోర్టల్ బీయింగ్ కదా..నాకది అర్ధం కాదని కదా..అంతకన్నా అందమైన భాషేదో సృష్టించి...అది ఈ మహానుభావులకి నేర్పించి.

ఏమంటారు ప్రభూ దీన్ని?

నిశ్శబ్ధం నిండా నిండిన నీ ఈ గొంతుకి నా గుండె వొణుకుతోంది... కనిపించకుండా ఎంత దాచిపెట్టినా..

నా చుట్టూ కమ్ముకుంటూ, నన్ను వేరే లోకాల్లోకి తీసుకెళ్ళటం కాదు. ఆ లోకాలేవో.. ఆ నాన్-లోకల్ ఫీల్డ్స్ ఏవో..ఇక్కడికే ఇంపోర్ట్ చేసి.. వాటిల్లోకి నన్ను ఇమ్మర్స్ చేసి..

అది వేణువా!! ఆ వేణువు నిండా ఉన్న ఆ విశ్వగావాక్షాల్లోకి దూరి వాటిల్లోంచి దూకి నీలో ఐక్యమైపోవడం కన్నా పరమార్ధమింకేదన్నా ఉందా ప్రభూ ఏ జీవరాశికైనా!

దాన్ని సంతూర్ అంటారా! ఆ తంత్రుల మీద ఆడేవి అతని వేళ్లా లేక అది నీ నృత్యమా..

ఏ చిన్న పుణ్యం చేసుకున్నానో! కాస్తో కూస్తో కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు దేవుడు, ఈ జీవితానికిది చాలనుకునేవాణ్ణి..

ఎంత అల్పత్వం..ఎంబరాసింగ్!

చచ్చిపోవాలని ఉంది!

ఎప్పుడాగిపోతానో, ఎక్కడిక చాలనుకుంటానో తెలీదు..

తెలుస్తోందల్లా ఒక్కటే.. ఇవి సంతోషమరణ క్షణాలని.. ఏ విచారమూ లేని వీడ్కోలు సమయాలని..

(On a quality-lonely night, listen to these Angels...make sure you listen to both parts)

Pt Shivkumar Sharma and Pt Hariprasad Chaurasia - The Valley Recalls 

(May 2013)


0 comments:

Post a Comment