Monday 22 April 2013


నాగరికత చక్రభ్రమణాల గురించి New York Historical Society లో వరసగా అయిదు పెయింటింగ్స్ ఉన్న The Course of Empire కన్నా మెరుగైన ఉదాహరణ ఉండదేమో!


మొదటి పెయింటింగ్ అయిన The Savage State లో, వేకువసమయంలో మేఘాలతో కమ్ముకొని రాబోయే తుఫానుతో పచ్చటి పచ్చికబయళ్ల మధ్య, నాగరికతకి పూర్వమున్న అతి కొద్ది మంది ఆటవిక జాతి ప్రజలు తమ ఉనికికి మార్గమేసుకుంటూంటారు.


రెండవ పెయింటింగ్ అయిన Pastoral State ఎంతో సంతోషభరితమైన వ్యవసాయిక స్వర్గధామం. అందులోని వాస్తవ్యులు,  అక్కర్లేని అరణ్యం లా ఉన్న చెట్లని తొలగించి, పంటలని వేసి, బహు సుందరమైన గ్రీక్ టెంపుల్ ని నిర్మించారు.




మూడవదీ, అతి పెద్దదీ అయిన The consummation of empire లో లాండ్ స్కేప్ మొత్తం మార్బుల్ బజారుతో నిండి ఉండగా, గత పెయింటింగ్స్(కాలాల)ల లో తృప్తిగా బతికినట్లుగా కనపడ్డ మనుషుల స్థానంలో, ఖరీదైన దుస్తుల్లోని వర్తకులతో, వినియోగ-పౌరులతో నిండిపోయి ఉంటుంది.జీవన చక్రం లో ఇది మధ్యాహ్నకాలం.



ఆ తరువాత వచ్చే పెయింటింగ్ The Destruction. నగరం మంటల్లో మునుగుతుంది . విచారంగా అలుముకున్నఆకాశం కింద ఉన్న నగరంలోని పౌరులు దోపిడీ, రేప్ ముఠాల నుంచి పారిపోతుంటారు.
చివరగా The Desolation లో చంద్రోదయమవుతుంది. ఒక్క ప్రాణి కూడా కనపడదు, విడిచిపెట్టేయబడిన శిథిలాలు, చెట్ల పొదలూ తప్ప.





1830 లో Cole వేసిన ఈ పెయింటింగ్ ఉద్దేశం స్పష్టం: ఎంత గొప్ప నాగరికతలయినా, చివరికి అన్ని నాగరికతలూ క్షీణించి, నశించవలసిందే అని. శతాబ్ధాల నుంచీ చరిత్ర కారులు, రాజకీయ వ్యాఖ్యాతలూ, ఆంథ్రోపాలజిస్టులూ, నాగరికతల ఉథ్థాన పతనాల దశ, దిశలు పైన చెప్పిన క్రమాన్నేఅనుసరిస్తాయని భావించారు. 



Polybius Histories లో Rome గురించి ఉన్న Book VI లో, రాజకీయభ్రమణాలు ఈ కింది విధంగా వెళ్తాయని రాసి ఉంది. 1. Monarchy 2. Kingship 3. Tyranny 4. Aristocracy 5. Oligarchy 6. Democracy 7. Ochlocracy ( mob rule).  ఈ రకమైన దృష్టికోణం Machiavelli రచనలతో వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇలాంటి పురావృత దశల గురించి Ming నియో-కన్ఫ్యూషియనిజం, అరబ్ చరిత్రకారుడు Ibn Khaldun లు అంతకుముందే చెప్పి ఉన్నారు.

Scienza nuova(1725) లో ఇటాలియన్ ఫిలాసఫర్ Giambattista Vico సివిలైజేషన్స్ అన్నీ కూడా మూడు దశల్లోంచి వెళ్తాయని చెప్పాడు: the divine, the heroic and the human or rational, then reverting back to divine again. 1738 లో బ్రిటీష్ ఫిలసాఫర్ అయిన Henry St John, Viscount Bolingbroke "మంచి వ్యవస్థలతో ఉన్న ప్రభుత్వాలు, మంచి మిశ్రితంలో ఉన్న జంతువుల గుంపుల్లాంటివే, రెండింట్లోనూ అంతర్గతంగా వాటి వినాశానికి దారితీసే విత్తనాలు దాగుంటాయి. అవి కొద్ది కాలం పాటు వృద్ధి సాధించి, అభివృద్ది లోకి వస్తాయి, కాని చివరకి క్రమంగా అదృశ్యమయిపోతాయి" అని అభిప్రాయపడ్డాడు.

భావవాదులూ, భౌతికవాదులూ సైతం ఒక విషయంలో ఏకీభవించారు. హెగెల్ మరియు మార్క్స్ ఇద్దరూ కూడా 'గతితర్కం(dialectic) చరిత్ర కి క్రమం తప్పని రిథమ్ ని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు.

మరి కొంతమంది చరిత్రకారులు, సివిలైజేషన్ ని ఋతువుల తో పోల్చారు. The Decline of the West ( 1918-22) రాసిన జర్మన్ చరిత్రకారుడయిన Oswald Spengler మెటిరీయలిజం, స్కెప్టిసిజం, సోషలిజం, పార్లమెంటేరిజం, డబ్బు
ల విజయాలతో కూడి ఉన్న పంతొమ్మిదవ శతాబ్ధాన్ని పాశ్చాత్య శీతాకాలం గా అభివర్ణించాడు.

బ్రిటీష్ చరిత్రకారుడు Arnold Toynbee ఇరవై సంపుటిల Study of History (1936-54) లో సివిలైజేషన్ ని " సమస్యల మీద సృజనాత్మక మైనారిటీ వర్గాలు చేసే తిరుగుబాటు" గా చూసాడు. అయితే ఆ తరువాత, నాయకులు పెరుగుతున్న సమస్యలకి క్రియేటివ్ పరిష్కారాలని వెతుక్కోక పోతే, ఆ నాగరికత క్రమంగా క్షీణిస్తుందని అభిప్రాయపడ్డాడు.

Quigley నాగరికతల జీవన చక్రాల గురించి క్లాసిక్ నిర్వచనం ఇలా చెప్పాడు: "ఇదొక పరిణామ క్రమం. ప్రతీ నాగరికతా పుడుతుంది.. ఆ తరువాత తన పరిణామాన్నీ, బలాన్నీ పెంచుకుంటూ అంతర్గతంగా వ్యవస్థాపకమయిన సమస్యలూ, సంక్షోభాలూ మొదలయ్యే దశ వరకీ శరవేగంగా వ్యాపిస్తుంది.. . సంక్షోబాన్ని పరిష్కరించుకొని పునర్వ్యవస్థీరించుకున్నాక తనలో ఉండే దుడుకూ, ఉత్సాహమూ, పట్టుదలా నెమ్మదించి, క్రమంగా నిశ్చలన స్థితికి చేరుకుంటుంది. శాంతి, అభివృద్ది లతో గడపిన స్వర్ణయుగం గడిచాక అంతర్గతంగా మళ్లీ ఒక సంక్షోభం ముంచుకొస్తుంది. ఈ సమయంలో మొట్టమొదటిసారిగా పట్టు సడలిన చిహ్నాలు కనిపించి , బాహ్యశత్రువుల నుంచి తనను తను రక్షించుగోలదా అని తన శక్తి, సామర్ధ్యాల మీద అనుమానాలు మొదలవుతాయి. అక్కణ్నుంచీ నాగరికత క్రమంగా బలహీనమవడం మొదలయ్యి, శత్రువుల దాడిలో మునిగిపోయి, చివరకి అంతమవుతుంది".

పైన చూసిన ప్రతి నిర్వచనమూ, నమూనాలు ఒకదానికొకటి వేరయి ఉండవచ్చు, కానీ వాటన్నిటిలోను చరిత్ర ఒక రిథమ్ ని అనుసరిస్తుందన్న అనుకోలు ఉంది.

1987 లో Paul Kennedy రాసిన The Rise and Fall of the Great Powers రాసిన చరిత్రలో కూడా ఇదే విధంగా గొప్ప శక్తివంతమైన సామ్రాజ్యాలు వాటి వాటి పారిశ్రామిక ఉత్పత్తులూ, వాటి భాధ్యతల నిష్పత్తుల ప్రకారం ఎగసి పడిపోతాయన్న సిక్లికల్ మోడల్ ని ప్రతిపాదిస్తారు. రాజ్యవిస్తరణ ఒక పరిమితి దాటినప్పుడు అయ్యే ఖర్చులు, వచ్చే లాభాల కన్నా ఎక్కువవుతాయి. ఈ రకమైన అత్యాశ గొప్ప-సామ్రాజ్యాల పతనానికి ముందు చరిత్రలో గమనించవచ్చని అంటాడు Kennedy.

2005 లో Jared Diamond రాసిన Collapse: How Societies Choose to Fail or Succeed లో కూడా పదిహేడవ శతాబ్ధం లోని Easter Island దగ్గర్నుంచీ ఇరవైఒకటో శతాబ్ధం లోని China వరకీ తమతమ సహజపర్యాయణాల పరిరక్షణని ప్రథమ కర్తవ్యంగా చేపట్టకుండా ఎలా తమ సమాజాలని ప్రమాదం వైపు నెట్టుతున్నాయో వివరిస్తాడు. 

Jared Diamond ప్రకారం Mayan Societies ఈ పుస్తకం ముందు చాప్టర్లల్లో చెప్పబడిన Malthusian Trap లోకి జారిపోయాయి. జనాభా వ్యవసాయ ఉత్పత్తుల కన్నా పెరగింది. ఎక్కువ జనాభా మరింత వ్యవసాయాన్నీ, ఆ పెరిగిన వ్యవసాయ అవసరాలు అరణ్యాల తరుగుదలనీ, భూమి సాంద్రత క్షీణించడాన్నీ, కరువునీ తీసుకొచ్చింది. దీనివల్ల అంతర్గత యుద్దాలు చెలరేగి చిట్టచివరకి Mayan civilization అంతమయిపోయింది. Diamond చెప్పదల్చుకున్నదేంటంటే, ఈ రోజున్న ప్రపంచం కూడా Mayan Civilization లాగే అంత్యదశకు చేరుకోవచ్చని.

***

అయితే పైన ప్రతిపాదించిన సిద్దాంతాలన్నీ తప్పవచ్చు. Cole వేసిన చిత్రాలు చరిత్రకి సరైన దర్పణం కాకపోవచ్చు. ఒకవేళ చరిత్ర,  చక్రం తిరిగినట్లు మందగమనంలో నడిచేది కాకుండా, ఒక్కోసారి వయొలెంట్ గా వేగంగా మలుపులు తిరిగేదయితే? ఇంకా ముఖ్యంగా నాగరికత కూలిపోవడానికి శతాబ్ధాలు పట్టకుండా, రాత్రికి రాత్రి కూలిపోతే?

సివిలైజేషన్స్ అనేవి ఎన్నో పరస్పర సంపర్క భాగాలతో, అత్యంత సంక్లిష్టంగా నిర్మితమయి ఉంటాయి. అవి ఒక పథకం ప్రకారం నిర్మించినట్లుగా, ఒక్కొక్క ఇటుకా పేర్చినట్లుగా , ఈజిప్షియన్ పిరమిడ్స్ లా నిలబడి ఉండవు. ఒక నమీబియన్ టర్మైట్స్ గుంపులా ఉంటాయి. అవెప్పుడూ కూడా Order కీ, Disorder కీ మధ్య ఊగుతూ ఉంటాయి, గందరగోళం అంచు దాకా వెళ్లొస్తుంటాయి.

అయితే ఎప్పుడో ఒకప్పుడు, సరైన సమయంలో పరిష్కరించకుండా ఉంచేసిన ఒక సమస్య ఊహించకుండా పెద్దదయి సమాజాలనీ, దేశాలనీ కుదిపేస్తుంది, చివరకి ఆ అంచుమీదనుంచి తోసేస్తుంది. ఇందులోని సంక్లిష్టతని అర్దం చేసుకోవాలంటే ,తమకు తాము ఓ పద్దతిలో ఆర్గనైజ్ చేసుకుని , హాఫ్-మిలియన్ సంఖ్యలో గుంపుగా ఎగిరే టర్మైట్స్ ని గమనించాలి. హ్యుమన్ ఇంటెలిజెన్స్ కూడా అత్యంత దుర్లభమైన నెట్వర్క్ తో, బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ లోంచి వచ్చిన అంతిమ ఫలితం. మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా అంతే. ఎంతో చిక్కగా చిక్కుబడిన యాంటీ-బాడీస్ నెట్వర్క్ తో, బయటనుంచి వచ్చే ఫారిన్ ఏజెంట్స్ మీద యుద్దం కోసం నిర్మించబడ్డ సిస్టమ్.

సహజ ప్రపంచంలో ఉండే సంక్లిష్టంగా ఉండే ప్రతీ సిస్టమ్ లో కూడా కొన్ని కామన్ లక్షణాలని గమనించవచ్చు. చిన్న ఇన్-పుట్ , ఒక్కోసారి ఊహించని అత్యంత పెద్ద ఫలితాలని తీసుకొస్తుంది. దీన్నే మనం 'యాంప్లిఫయిర్ ఎఫెక్ట్' అంటాం. కారణ-ఫలిత చక్రం సరళరేఖగుండా ప్రయాణించదు. అందుకే సంక్లిష్టమయిన నాగరికతలలో జరుగుతున్న వాటిని గమనించి, అంతిమ ఫలితాలని ఊహించే సిద్దాంతాలు ప్రతిపాదించటం అంత తెలివైన పని కాదు.

ఈ కోణం లోంచి చూస్తే, స్ప్రింగ్ 2007 కల్లా గ్లోబల్ ఎకానమీ మాక్సిమమ్ కెపాసిటీకి చేరుకున్న ఒక ఎలక్ట్రికల్ గ్రిడ్ లాంటిదని చెప్పుకోవచ్చు. మహత్తరమైన, శక్తివంతమైన ఆర్ధికవ్యవస్థతో పోలిస్తే చిన్నదైన సబ్ ప్రైమ్ మార్ట్గేజ్ క్రైసిస్ అనే ఒక చిన్న సర్జ్ తోపిడి, సమస్తం గ్రిడ్ ని ట్రిప్ అయ్యేలా చేసి, ప్రపంచం నిండా బ్లాక్-అవుట్ ని, అంధకారాన్నీ తీసుకొచ్చింది.

ఫిజిసిస్టూ, మీటియారలిజిస్టూ అయిన Lewis Fry Richardson గ్రూప్ హత్యల దగ్గర్నుంచీ, పెద్ద యుద్దాల వల్ల జరిగిన మృతుల సంఖ్య లని బేస్ 10 ఆల్గారిథంతో కొలిచే ప్రయత్నం చేసాడు. టెర్రరిస్టు దాడిలో జరిగిన 100 మంది మృతిని 2 మాగ్నిట్యూడ్ అనుకుంటే, ఒక మిలియన్ మంది చనిపోయిన యుద్దం మాగ్నిట్యూడ్ 6 అవుతుంది.1815 నుండీ 1945 మధ్యలోనే, 2,5 మాగ్నిట్యూడ్ దాటిన ఘర్షణలు కనీసం 300 ఉన్నట్లుగా Richardson కనుక్కున్నాడు. దీంట్లో 7 మాగ్నిట్యూడ్ ఉన్న యుద్దాలు కనీసం 36 మిలియన్ల మందిని పొట్టనపెట్టుకున్నాయి. మృతులే కాక, యుద్దం వల్ల చెల్లాచెదురయిన జీవితాలు కనీసమ్ ఇంకో పది మిలియన్లు ఉంటాయని అంచనా.

ముందు చాప్టర్లల్లో చూసినట్లుగా, వెస్టర్న్ సివిలైజేషన్ మొదటి అవతారమయిన రోమన్ ఎంపైర్ శిథిలమవడానికి దీర్ఘకాలం పట్టలేదు. ఐదవ శతాబ్ధం లోని తొలి దశలో బార్బేరియన్ల దాడులతో, ఒక తరం లొనే అంచుమీదనుండి తోయబడింది.1530 లో Incas దక్షిణ అమెరికాలో తిరుగులేని శక్తిగల వారు. కాని గుర్రాల మీద, గన్ పౌడర్ తో, దేశం బయట నుంచి వచ్చిన ముష్కరులు కేవలం ఒక దశాబ్ధకాలం లోనే Incas సామ్రాజ్యాలని చిత్తుచిత్తు చేసారు.

17 వ శతాబ్ధంలో మింగ్ సామ్రాజ్యం శరవేగంగా అంతమయిపోయింది. అలాగే ఫ్రాన్స్ లో Bourbon monarchy పఠిష్టమయిన దశనుండి , పతనదశకి చేరుకోడానికి ఎంతో కాలం పట్టలేదు. అదేవిధంగా అమెరికన్ రివల్యూషన్ వార్ లో, ఇంగ్లాండ్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికన్స్ కి తోడ్పాటునందించడం ఫ్రాన్స్ కి మొదట తెలివైన ఉపాయంగా తోచింది, కానీ తనందించిన సహాయం తనకి శక్తికి మించి ఫ్రాన్స్ ని ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతే కాదు, 1908 లో కూడా Ottoman Empire అంతర్గతంగా సంస్కరణలని చేపట్టే శక్తివంతమైన ఎంపైర్ గానే కనపడింది, కానీ 1922 కల్లా చిట్టచివరి సుల్తాన్ ఇస్తాన్బుల్ నుండి బ్రిటీష్ యుద్దనౌక వెళ్లిపోవడంతో Ottoman Empire అంతమయిపోయింది.

1942 లో జపాన్, తన చరిత్రలోనే అతి పెద్ద సామ్రాజ్య విస్తరణని సాధించింది, కాని అమెరికా మీద జరిపిన Pearl Harbor దాడితో 1945 కల్లా ఆ సామ్రాజ్యం కనపడకుండా పోయింది.

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో మొదలయిన కారుమేఘాలు, అతివేగంగా ఆ సామ్రాజ్యాన్ని చీకటిలో ముంచెత్తేసాయి. చర్చిల్ 1945 లో  రూజ్వెల్ట్, స్టాలిన్ లతో పాటుగా బిగ్-థ్రీ గా పేరొంది, వివిధ దేశాల దిశలని ప్రభావితం చేసే నాయకుల్లో ఒకరు. కానీ రెండవ ప్రపంచ యుద్దం అంతమవగానే పదవీచ్యుతుడయ్యాడు. కేవలం ఒక డజను సంవత్సరాలలోనే యునైటెడ్ కింగ్డమ్ బర్మా, ఈజిప్ట్, ఘనా, ఇండియా, ఇజ్రాయిల్, జోర్డాన్, మలయా, పాకిస్తాన్, సిలోన్, సూడాన్ లకి స్వాతంత్రాన్నిచ్చి తప్పుకోవాల్సి వచ్చింది. 1956 కల్ల సూయజ్ కెనాల్ లో యునైటెడ్ స్టేట్స్ ని ధిక్కరించి స్వంత నిర్ణయాన్ని తీసుకోలేని దశకి చేరుకోవటంతో యునైటెడ్ కింగ్డమ్ సామ్రాజ్యానికి తెరదిగింది.


సమీప చరిత్రలో ఉదాహరణ కావాలంటే సోవియట్ యూనియన్ కేసి చూడాల్సిందే. వెనక్కి తిరిగి పైనుంచి చూసినప్పుడు దృష్టి పథంలో సమస్తం కనపడే ఒక సౌలభ్యం ఉంటుంది. ఆ దృష్ట్యా సోవియట్ యూనియన్ కష్టాలకి మొదటి విత్తనం బ్రెజ్ఞేవ్ కాలంలోనే పడిందని చెప్పవచ్చు. కానీ ఆ కాలంలో అది అంత స్పష్టం కాదు కదా. 1985 లో గోర్భచేవ్ సోవియట్ జనరల్ సెక్రటరీ అయినప్పుడు CIA సోవియట్ యూనియన్ ఎకానమీ అమెరికా ఎకానమీలో 60 శాతం ఉంటుందని (తప్పుగా) అంచనా వేసింది. సోవియట్ యూనియన్ న్యూక్లియర్ ఆయుధ సంపత్తి అమెరికాకన్నే ఎక్కువే. థర్డ్ వర్ల్డ్ గా పేరొందిన ప్రపంచంలోని వియత్నాం నుంచి నికరాగువా వరకీ అప్పటికి ఇరవై సంవత్సరాల క్రితం నుంచే సోవియట్ యూనియన్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కానీ, గోర్బచేవ్ పదవి చేపట్టిన కేవలం ఐదు సంవత్సరాలలోనే మధ్య, తూర్పు యూరప్ ల దేశాల మీద సోవియట్ యూనియన్ పట్టు సడలిపోయింది. చివరకి 1991 లో స్వయాన సోవియట్ యూనియన్ కూలిపోయింది.

చరిత్రలో ఏదైనా సామ్రాజ్యం, క్రమంగా జారిపోకుండా అకస్మాత్తుగా అగాధం అంచు మీద నుంచి పడిపోయిందీ అంటే , అది లెనిన్ స్థాపించిన సామ్రాజ్యమే.

కొన్ని నాగరికతలు క్రమంగా క్షీణించకుండా, శరవేగంగా శిథిలమవుతాయి అనుకున్నప్పుడు మరి ఈరోజున వెస్టర్న్ సివిలైజేషన్ ఉన్న పరిస్థితి ఏంటి? అదెలాంటి ప్రభావితాలకి లోనవుతోంది?

***


గత చాప్టర్లల్లో వెస్ట్, ఈస్ట్ ని దాటేసి ఎలా ముందుకెళ్లిందో చెప్పుకున్నాం. 6 killer apps వెస్టర్న్ సివిలైజేషన్ ని ఊర్ధ్వదశకి పట్టుకెళ్ళాయి. ఆ యాప్స్ ని గత కొన్ని దశాబ్ధాలుగా ఈస్టర్న్ సమాజాలు డౌన్ లోడ్ చేసుకుంటూ ఎంతో ప్రగతినీ, అభివృద్దినీ సాధిస్తున్నాయి.

చైనాలో ఆర్ధిక సంస్కరణలు కేవలం ముప్పై సంవత్సరాల క్రితమే మొదలయ్యాయి . ఈ రోజు(పుస్తకం రాసే సమయానికి) చైనా per-capita GDP యు.ఎస్ GDP లో 19 శాతానికి చేరుకుంది. హాంగ్ కాంగ్, జపాన్ లు ఆ స్థానానికి 1950 లకే చేరుకున్నాయి. తైవాన్ 1970 ల లోనూ, సౌత్-కొరియా 1975 లలోనూ ఆ దశకి చేరుకున్నాయి. కాన్ఫరెన్స్ బోర్డ్ లెక్కల ప్రకారం, సింగపూర్ per-capita GDP ప్రస్తుతం US కన్నా 21 శాతం ఎక్కువుంది. ఇండస్ట్రియల్ రివల్యూషన్ అతి పెద్ద ఎత్తున, అతి వేగంగా కొనసాగుతోంది. కేవలం ఇరవై-ఆరు సంవత్సరాలలో GDP పదింతలు పెరిగింది!! UK కి 1830 తరువాత GDP నాలుగింతలవడానికి 70 సంవత్సరాలు పట్టింది. IMF ప్రకారం గ్లోబల్ GDP లో చైనా పదిశాతాన్ని 2013 కల్లా దాటుతుంది. ఆర్థిక సంక్షోభానికి ముందు Goldman Sachs చైనా, అమెరికా GDP ని 2027 కల్లా అధిగమిస్తుందని అంచనా వేసింది. కాని ఆర్ధిక సంక్షోభం చైనా కన్నా, అమెరికా ఆర్థికాభివృద్ది రేటుని అధికంగా దెబ్బ తీసింది.

ఇంకో విధంగా చెప్పాలంటే ఏషియన్ శతాబ్దం ఇప్పటికే వచ్చేసిందని చెప్పుకోవచ్చేమో. జర్మనీ, జపాన్ లని దాటి దూసుకెళ్లిన చైనా, గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో అమెరికాని వెనక్కి తోసేయటానికి అతి సమీప దశలో ఉంది. చైనా లోని షాంఘై, అమెరికాలోని ఏ నగరం తో పోల్చినా కూడా పెద్దదే.

సంఖ్యాపరంగా చూస్తే ఏషియా ప్రపంచం మొత్తం మీద అధిక జనాభా కల ప్రాంతం. కానీ ఆఫ్రికాలో పెరుగుతున్న జనాభా వెస్ట్ పతనాన్ని నిర్దారించేసింది. Samuel Huntington నిర్వచించిన 'West' ప్రాంతాలయిన్ వెస్ట్రన్ యూరప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలేషియా ల లో జనాభా, 1950 లో ప్రపంచ జనాభాలో ఇరవై శాతంగా అంచనా వేసారు. ప్రస్తుతం యునైటెడ్ నేషన్స్ అంచనాల ప్రకారం 2050 కల్లా అది 10 శాతానికి చేరుకుంటుంది. Huntington స్వంత లెక్కల ప్రకారం Western Decline విభిన్న కోణాల ప్రకారం ఈ పాటికే మొదలయిపోయింది. Language (western share 1958 నుండి 1992 కి 3 శాతం పడిపోయింది), Religion (1970 నుండి 2000 కి దాదాపు ఒకశాతం దిగజారింది), territory controlled (1971-1993 కి 1 శాతం పతనం), population (1971 నుంచి 3 శాతం తగ్గుదల), GDP(1970-1992 కి 4 శాతం పతనం), military manpower (1970-1991 కి 6 శాతం దిగజారింది)

2007 లోని ఆర్ధిక సంక్షోభం వెస్ట్ లో ఎప్పుడో మొదలయిన పతనానికి యాక్సలరేటర్ గా అభివర్ణించవచ్చు. ఇది 1930s లలో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ అంతటిది కాకపోయినా, అదే కోవలోకి చేర్చదగినది. కాని గ్రేట్ డిప్రెషన్ అంతటి మహాపతనపు ప్రభావాన్ని చూపించకపోవడానికి మూడు కారణాలని గమనించవచ్చు. 1. చైనా విపరీతంగా ఇచ్చిన బ్యాంక్ రుణాలు వెస్ట్ కి ఎక్స్ పోర్ట్స్ ని దెబ్బతీయకుండా కాపాడాయి 2. Federal Reserve Bank chairman Ben Bernanke యుఎస్ మానిటరీ పాలసీ బేస్ ని అత్యధికంగా విస్తరించాడు 3. కేవలం అమెరికాయే కాక ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు కూడా అత్యధికంగా ద్రవ్యలోటు ని అనుభవిస్తూండటమే.

కానీ ప్రభుత్వాలు ప్రజాధనంతో మంజూరు చేసిన స్టిమ్యులస్ నిధులతో ఈ రోజు డెవలప్డ్ ప్రపంచం, మత్తులో మునిగి ఉంది. వివిధ కారణాల వల్ల యూరోజోన్ లోని గ్రీస్, ఐర్లాండ్, పోర్చుగల్ ఇన్వెస్టర్స్ దృష్టిలో నమ్మకాన్ని కోల్పోయాయి.

చరిత్రలో నాగరికతలు, ఎక్కువ సార్లు ఆర్ధిక ఇబ్బందులతోనే నిట్టనిలువుగా కూలిపోయాయని ఈ దశలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం.

పైన ఉదహరించబడిన పతనాలలో, దాదాపు ప్రతీ పతనము ఆర్ధిక కారణాలతో ముడిపడి ఉన్నదే. 16వ శతాబ్ధంలో స్పెయిన్ ఆదాయం కన్నా కట్టవలసిన వడ్డీ ఎక్కువయి కృంగిపోయింది. ఫ్రాన్స్ విషయంలో 1751 నుండి 1778 కల్లా వడ్డీ, వచ్చే ఆదాయంలో 25 నుండి 62 శాతానికి చేరుకొని ఊపిరాడని దశకి చేరుకుంది. Ottoman Empire విషయంలో కూడా ఇదే స్టోరీ కొనసాగింది, 1868 లో ఆదాయంలో 17 శాతం ఉన్న అప్పులు, 1877 కల్లా 50 శాతానికి చేరుకొని Ottoman Empire ని చిన్నాభిన్నం అవడానికి నాంది పలికింది.

చివరగా బ్రిటన్ కేసు చూద్దాం. 1921 కల్లా బ్రిటన్ ఖర్చుల్లో అప్పుల వల్ల అయ్యే ఖర్చు 44 శాతానికి చేరుకుంది. అది 1937 దాకా డిఫెన్స్ ఖర్చు కన్నా కూడా పెరగసాగింది. కాని బ్రిటన్ నిజమైన సమస్యలన్నీ 1945 తరువాతే మొదలయ్యాయి. రెండవ ప్రపంచ యుద్దం అంతం కల్లా 21 బిలియన్ పౌండ్ల అప్పులో 3.4 బిలియన్ పౌండ్ల అప్పు ఇతరదేశాల క్రెడిటర్స్ కి చెందిందే!!

2001 తరువాత కేవలం పది సంవత్సరాలలోనే అమెరికా దేశ అప్పు GDP లో 32 శాతం నుండి, 66 శాతానికి చేరుకుంది. నిజానికి CBO లెక్కల ప్రకారం కొన్ని ఆర్ధిక గణాంక శాతాలలో అమెరికా పరిస్థితి రాబోవు కాలాలలో
గ్రీస్ కన్నా కూడా తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ సంఖ్యలన్నీ నిరాశపూరితంగా కనపడుతుండొచ్చు, కానీ ఆర్ధికస్థిరత్వం అనే రంగంలో, నిజం కన్నా నమ్మకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతానికి ప్రపంచమంతా అమెరికా ఎలాగోలా ఈ కష్టకాలంలోంచి ముక్కుతూ, మూలుగుతూ అయినా బయటపడుతుందని నమ్ముతోంది. ఈ సందర్భంలో చర్చిల్ అమెరికా గురించి అన్న మాటలు స్ఫురణకి రాక మానవు. 'అమెరికా ఎప్పుడూ సరయిన బాటలోనే నడుస్తుంది, కానీ మిగతా అన్ని బాటలన్నీ మూసుకున్నాక మాత్రమే" అని చర్చిల్ చమత్కరించాడొకసారి.

అమెరికా గురించి ప్రమాదగంటలు మోగడం ఇదే మొదటిసారి కాదు. 1980లలో కూడా అమెరికా ఆర్ధికపరిస్థితి గురించి ఆందోళనలకేం తక్కువ లేదు. కాని 1990 లకల్లా అమెరికా మిగులుబడ్జెట్ లని సమర్పించే స్థాయికి చేరుకుంది. మరి ఎందుకు చింతించటం? ఇలా నిమ్మకు నీరెత్తినట్లుండే ధోరణే సంక్షోభానికి దారి తీసుంది. ఏదో ఒక రోజు ఒక బ్యాడ్ న్యూస్ తో ఏ క్రెడిట్ ఏజెన్సీ రేటింగ్ డౌన్ గ్రేడ్ తోనో, అకస్మాత్తుగా పండిట్లే కాక సాధారణ ప్రజలు కూడా అమెరికా ఆర్థికపరిస్థితి గురించి ఆందోళన చెందటం ప్రారంభిస్తారు. ఈ రకమయిన దృష్టి మార్పే అతి కీలకమయినది.సబ్-ప్రైమ్ మార్కెట్లలలో రుణగ్రస్తులు చెల్లింపులిక చేయలేరేమోనన్న కొత్త దృక్పథం చిగురులు తొడిగి, ఇంతింతై వటుడింతై 2007 లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలన్నీ కూలిపోవడానికి దోహదపడింది.

ఇదే ఇన్వెస్టర్లు అమెరికా ప్రభుత్వం తీసుకునే స్టిమ్యులస్, జీరో ఇంట్రస్ట్ రేట్ల విధానాలు సత్ఫలితాలనివ్వదనీ, ద్రవ్యోల్భణాన్ని పెంచుతుందనీ నమ్మ్మిన రోజున, కొత్త ఆర్ధికసంక్షోభాలు రాక మానవు. ఇలాంటి విధానాలన్నీ self-fulfilling అని అంటాడు Thomas Sargent. ఎందుకంటే ద్రవ్యోల్బనాన్ని నిర్ణయించేవి మనీ సర్కులేషన్ లోని వేగం తప్ప, కేవలం మనీ సప్లై ఒక్కటే కాదు. అలాగే debt-to-gdp ratio కన్నా కూడా ఇన్వెస్టర్లు డిమాండ్ చేసే ఇంట్రస్ట్ రేట్లే ప్రభుత్వాలు గడువులోపల అప్పుల చెల్లింపులు చేయగలవా లేదా అని నిర్ణయిస్తాయి. నమ్మకాలు దెబ్బతిన్నప్పుడు ఇన్వెస్టర్లకి బాండ్స్ మీద చెల్లింపులు పెంచాల్సి రావచ్చు, తద్వారా మూలిగే నక్కమీద తాటిపండు చందానా ఆర్ధికవ్యవస్థ మీద మరింత పెనుభారం పడవచ్చు. తగ్గిపోతున్న విశ్వాసం, బాండ్స్ పై చెల్లింపుల పెరుగుదల, పెరుగుతున్న ద్రవ్యలోటులన్నీ కలిసినప్పుడు వచ్చే ఫలితం ఒక మరణవలయం. సరిగ్గా ఇదే జరిగింది 2010 లో గ్రీస్ , ఐర్లాండ్, పోర్చుగల్ లలో.

నిజమే, జపాన్ ఇంతకన్నా ఎక్కువ debt-to-gdp ratios ని తట్టుకోని నిలబడగలిగింది, ఇన్వెస్టర్ల నమ్మకాలు సడలకుండా. కాని జపాన్ అప్పులో అధికశాతం జపనీస్ ఇన్వెస్టర్లదే. కాని US అప్పులో సగం కన్నా ఎక్కువ అప్పు విదేశీ ఇన్వెస్టర్ల చేతిలో ఉంది, ముఖ్యంగా ఇరవై శాతం వరకీ చైనాదే.

అమెరికన్ డాలర్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ అవడం వల్ల అమెరికాకి దొరికిన అత్యంత విలువైన సౌలభ్యం, కరెన్సీని ప్రింట్ చేసుకుంటూ పోవటం. కేవలం ఆ సౌలబ్యం వల్లే అమెరికాకి ఊపిరిదొరకడానికి అవకాశం లభిస్తోంది. ఇదే వెసులుబాటు మీద చైనా ఇప్పుడు దాడి చేస్తోంది. అమెరికా డాలర్స్ జారీ అదుపుతప్పుతోందనీ, అంతర్గతంగా వినియోగవస్తువుల ధరలు పెరుగుతున్నాయనీ చైనా కామర్స్ మినిస్టర్ Chen Deming October 2010 లో అన్నారు. US నియంత్రణ లేని,బాధ్యత లేని విధానాలతో కరెన్సీ ని ప్రింట్ చేస్తోందని చైనా ఎకనమిక్ అడ్వైజర్ Xia Bin సైతం సెలవిచ్చారు.

చైనా ఆందోళనలు అర్ధం చేసుకోవచ్చు. సంక్షోభం పిదప కొన్ని కమ్మోడీటీస్ ధరలు అమెరికాలో పెరిగాయి. US Treasuries లో చైనా నిల్వలు 2009 నుండి 2010 వరకీ, 10 శాతం తగ్గాయి. గోల్డ్ ఔన్స్ కి $1400 ఉన్నప్పటికీ 2010 లో చైనా గోల్డ్ కొనుగోళ్లు ప్రారంభించింది, కాలపరీక్షకి నిలదొక్కుకున్న పెట్టుబడి అన్న నమ్మకంతో.

ఇంత జరుగుతున్నప్పటికీ, అమెరికా కి ప్రస్తుతం ఉన్న భయం inflation కాదు, deflation. 1950s తరువాత, ధరలు ఈ కాలంలోనే అత్యంత తక్కువ స్థాయిలో పెరగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ రుణాల మంజూరీ కఠినతరమై కాపిటల్ దొరకటం కష్టమవుతోంది.

వివిధకారణాల వల్ల ఆర్థికాభివృద్ది రేటు మందకొడిగానే ఉండబోతోంది. అందువల్ల ఫెడరల్ గవర్నమెంట్ ద్రవ్యలోటును పూడ్చుకోవటం దుర్లభమవుతుంది. దాంతో కట్టాల్సిన ఇంట్రస్ట్ రానురాను పెరుగుతుంది. CBO అంచనాల ప్రకారం ఫెడరల్ ఆదాయం లో ఈ రోజు 9 శాతం ఉన్న అప్పు, 2020 కల్లా 20 శాతానికీ, 2040 కల్లా 58 శాతానికి చేరుకోబోతోంది.

ఇలాంటి సంఖ్యలు, అమెరికా మిలటరీ కమిట్మెంట్స్ ని తగ్గించుకోకతప్పదేమోనన్న అనుమానలని రేకెత్తిస్తాయి. ఇలాగే కొనసాగితే, ఫెడరల్ ఆదాయంలో మిలటరీ ఖర్చు శాతం కన్నా, ఇంట్రస్ట్ పేమెంట్స్ ల ఖర్చు ఎక్కువ శాతానికి చేరుకోకతప్పదు.

(ఇక్కడ రచయిత Samuel Huntington రాసిన Clash of Civilizations గురించీ అందులో రాసిన విషయాలు, జ్యోస్యాలూ వాటిల్లో కొన్ని ఎలా నిజం కాలేదో వివరించారు. అలాగే చరిత్రలో ఒక సివిలైజేషన్ కీ, మరొక సివిలైజేషన్ కి మధ్య జరిగిన యుద్దాలూ, ఘర్షణలకన్నా ఒకే నాగరికత, సంస్కృతి లోపల అంతర్గతయుద్దాలు ఎలా ఎక్కువగా జరిగాయో, అవి ఆయా సమాజాల మీద ఎంత ప్రభావితం చూపాయో చెప్పారు)

ఆ వివరించిన నేపథ్యంలో...

చైనా ఎదుగుదలని జాగ్రత్తగా అర్ధం చేసుకోవలసిన అవసరమున్నది. 'Quiet Rise' మా ఉద్దేశం, గ్లోబల్ ఆర్డర్ ని కదిలించే ఉద్దేశం మాకు లేదని చైనా చెపుతున్నప్పటికీ కొంతమంది కామెంటేటర్స్ Samuel Huntington చెప్పిన civilizations clashes యొక్క మొదటి గుర్తులు కనపడుతున్నాయని భావిస్తున్నారు.

2010 చివర్లో US Federal Reserve Bank చేసిన quantitative easing తో, చైనా, యు.ఎస్ ల మధ్య కరెన్సీ వార్ కి నిప్పంటుకున్నట్లుగా అనిపించింది కొద్ది కాలం. "చైనా తన కరెన్సీ ని మానిప్యులేట్ చేసి ఆర్టిఫిషియల్ గా తగ్గించే ప్రయత్నాలు ఆపక పోతే, యు.ఎస్ తనని కాపాడుకోవటానికి వేరే విధానాలు అవలంబించాల్సి వస్తుంది" అని ప్రసిడెంట్ ఒబామా హెచ్చరించారు. చైనీస్ ప్రీమియర్ Wen Jiabao ఏ మాత్రం ఆలస్యం చేయలేదు ప్రతిస్పందించటానికి. "మమ్మల్ని మా కరెన్సీ గురించి వత్తిడి చేయద్దు.... ఎన్నో ఎగుమతుల కంపనీలు మూసుకోవాల్సి వస్తుంది మేము, నగరాలకి వలస వస్తూన్న శ్రామికులందరూ పల్లెలకి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. చైనా లో సాంఘిక, ఆర్థిక కల్లోలాలు ఏర్పడితే అది ప్రపంచానికే మంచిది కాదు" అని తిరిగి హెచ్చరించారు.

నిజానికి కరెన్సీ వార్స్ చైనా-యు.ఎస్ మధ్యలో జరగట్లేదు. చైనా+అమెరికా కరెన్సీలకీ, మిగతా ప్రపంచానికీ మధ్య జరుగుతున్నాయి. యు.ఎస్ కొత్త కరెన్సీ ప్రింట్ చేస్తూన్నకొద్దీ, చైనా ఆ కరెన్సీకి వత్తాసు పలుకుతూ తన కరెన్సీ ని అడ్జస్ట్ చేస్తూన్న కొద్దీ, ఇద్దరూ లాభపడ్డట్లే. నిజంగా నష్టపోయింది ఇండోనేషియా, బ్రెజిల్ లాంటి దేశాలు, వాటి రియల్ ట్రేడ్ ఎక్చేంజ్ రేట్స్ Jan 2008-Nov 2010 మధ్య 18, 17%s పెరిగాయి..

అయితే Chimerica కి ఊర్ధ్వదశ ఇప్పటికే దాటిపోయింది. ఒక spender కీ, ఒక saver కీ మధ్య జరిగిన ఆర్ధికవివాహం, విడాకుల వైపు వెళ్లబోతోందన్న చిహ్నాలు కనపడుతున్నాయి.

ఆర్ధిక సంక్షోభం కి పిదప, 2010 చైనా ఉత్పత్తులు 20 శాతం పెరిగితే, యు.ఎస్ 2 శాతం తగ్గాయి. ఈ రకమైన పరిస్థితి అప్పిచ్చేవాడికే లాభం చేకూర్చేలా ఉంటుంది కానీ, తీసుకునేవారికి కాదు. కొంతమంది అమెరికన్ పాలసీ మేకర్స్ చైనా మనకెంత అవసరమో, మనమూ చైనాకి అంతే అవసరం అన్న మంత్రాన్ని ముప్పొద్దులా చెపుతూ ఉంటారు. కానీ చైనా లీడర్స్ ఇప్పటికే అమెరికన్ డాలర్ మీదా ఆధారపడ్డం తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రణాళిక లు ఏర్పరుచుకున్నారు. చైనా ముఖ్యోద్దేశం ప్రపంచంలో తిరుగులేని శక్తిగా, ప్రపంచాన్ని చెప్పుచేతల్లో ఉంచుకుందామన్నట్లుగా పైకి కనపడదు. చైనా ప్రణాళికల సారాంశాన్ని ఈ క్రింది విధంగా చెప్పుకోవచ్చు.

1. Consume more 2. Import more 3. Invest abroad more 4. Innovate more.

పైన చెప్పిన ప్రతీ ఆర్ధికవ్యూహం చివరికి భౌగోళిక-రాజకీయ లాభాల్ని తెచ్చిపెట్టేదే. Consume ఎక్కువ చేయటం వల్ల చైనా trade-surplus ని తగ్గించుకుంటుంది. ఇప్పటికే చైనా యు.ఎస్ ని కార్ల అమ్మకాలలో అధిగమించింది. వచ్చే కొన్నేళ్లల్లో అవి పదిరెట్లు అవుతాయని ఒక అంచనా. International Energy Agency అంచనాల ప్రకారం 2035 కల్లా గ్లోబల్ ఎనర్జీలో చైనా 20 శాతం ఉపయోగించుకుంటుంది. Global Coal Consumption లో 46 శాతం చైనాలోనే జరుగుతుంది. దాదాపు అదే శాతం వినియోగం అల్యూమినియం, కాపర్, నికెల్, జింక్ లలో జరుగుతుంది. వినియోగం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు ఇలాంటి మార్కెట్లు ఎక్స్ పోర్టర్లకి ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఇప్పటికే చైనా ఆస్ట్రేలియా ఎక్స్ పోర్ట్ లలో 22 శాతాన్ని ఆక్రమించిన అతిపెద్ద మార్కెట్. బ్రెజిల్ నుంచి 12%, సౌత్-ఆఫ్రికా నుండి 10 శాతం ఎక్స్ పోర్ట్ లు చైనాకి వెళ్తున్నాయి. జపాన్, జర్మనీ ల నుండి హై-వాల్యూ కొనుగోళ్లని కూడా చైనా చేపట్టింది. ఒకప్పుడు చైనా కేవలం తక్కువ ధరల మానుఫాక్చరింగ్ ప్రాడక్ట్స్ ఎక్స్ పోర్ట్ లకి పేరొందిన దేశం. ఇప్పుడలా కాదు. గ్లోబల్ అభివృద్ది లో ఇరవై శాతం ఆక్రమించిన చైనా ఈ రోజున, ఇతర దేశాలకి చైతన్యవంతమయిన మార్కెట్. ఆ స్థానం ఫ్రెండ్స్ ని సంపాదించిపెడుతుంది.

కానీ చైనా ఆందోళనలు చైనాకున్నాయి.ప్రపంచ మార్కెట్లల్లో commodities prices లో ఉండే ధరల అనిశ్చితి , ముఖ్యంగా 2004-10 మధ్యలో జరిగిన అతిపెద్ద ధరల మార్పులని చూసి చైనా ఆందోళన చెందక మానదు. అందుకే దేశం వెలుపల commodity-producing assets అయిన అంగోలా లోని ఆయిల్-ఫీల్డ్స్ నుంచి, జాంబియాలో కాపర్ మైన్స్ వరకీ కొనుగోలు చేస్తుంది. కేవలం ఒకే నెలలో (Jan 2010) లో చైనా ఇన్వెస్టర్లు $2.4 billion డాలర్లని 420 overseas enterprises లలో పెట్టుబడులు పెట్టారంటే చైనా ప్రపంచ మార్కెట్ల మీద ఎంతగా దృష్టి కేంద్రీకరించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇందులో అధిక శాతం ఏషియా(45%) , ఆఫ్రికా(42%) ల లో జరిగాయి.

ఈపాటికి చైనా అవలంబించే పద్దతులు అర్ధమయ్యే ఉండాలి. హైవే, మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ , మైన్స్, అగ్రికల్చర్ లాండ్ లలో దీర్ఘకాల లీజ్ ల మీద చైనా దృష్టి సారించింది. ఇతర దేశాల్లోని సహజ వనరుల మీద పెట్టుబడుల వల్ల డాలర్ మీద ఆధారపడ్డం తగ్గుతుందని చైనా ఆలోచన. అదే సమయంలో తన ఆర్ధిక పలుకుబడి కూడా పెరుగుతుంది. నౌకాదళ శక్తిని పెంచుకొని సముద్రమార్గాల మీదా, రవాణా మీదా పట్టు సాధించాలన్న చైనా ఆశయాలకి ఈ పెట్టుబడులు సహకరిస్తాయి అని చైనా కి తెలుసు. South-China నది ఇప్పటికే core-national interest కింద పరిగణించబడుతోంది, దానికి తోడు deep water ports పాకిస్తాన్ వరకే కాక, బర్మా, శ్రీలంక వరకీ సాగుతున్నాయి.

ఈ నమూనా ఒకప్పటి చైనా Admiral Zheng He పాటించిన దానికి భిన్నమైనది. చైనా మీద ఆధిపత్యానికి అలనాడు బ్రిటీష్ విక్టోరియన్ రాయల్ నావీ అవలంభించిన మోడల్ ఇది. 

చివరగా, "కాలిఫోర్నియాలో డిజైన్ చేయబడిన ప్రొడక్ట్ లని ఉత్పత్తి చేయడానికి అసెంబ్లీ లైన్స్ లా ఉపయోగబడేది మాత్రమే చైనా" అన్న ఇమేజ్ ని దాటి ముందుకెళ్తోంది. Wind Turbines, Photovoltaic Panels లలో కొత్త కొత్త ఇన్నోవేషన్లతో ప్రపంచంలోనే పెద్ద ఉత్పత్తిదారవాలనుకుంటోంది.

కొత్త పేటెంట్ల దరఖాస్తుల సంఖ్యలో జర్మనీ ని దాటేసింది. పేటెంట్ల జారీలో 2004 లో బ్రిటన్ నీ, 2005 లో రష్యానీ, 2006 లో ఫ్రాన్స్ ల కన్నా ముందుకు దూసుకెళ్లిన చైనా మిగతా పశ్చిమ దేశాలని అధిగమించడానికి సమాయత్తమవుతోంది.

చైనా గత దశాబ్దంలో R&D రంగంలో ఖర్చుని ఆరింతలు పెంచి, శాస్త్రజ్ణులని రెట్టింపు చేసి, ఒక సంవత్సరంలో ప్రజంట్ చేసే సైంటిఫిక్ పేపర్స్ లోనూ, సూపర్-కంప్యూటింగ్ శక్తి సామర్ధ్యాలలో యావత్ ప్రపంచంలో యు.ఎస్ తరువాత రెండవ స్థానం లోకి ఎదిగింది. ఇదంతా కూడా Eastern Ascendancy story లో ఒక భాగం.

ఇవన్నీ ఒకెత్తయితే, తూర్పుదేశాల ఎదుగుదలకి అతి పెద్ద నిదర్శనం ఎడ్యుకేషన్ రంగంలో చూడవచ్చు. Organization for Economic Cooperation and Development చేసిన study ప్రకారం, South-Korea, Japan లకీ, Britain, Italy లకీ 25-34 మధ్య ఉన్న యువకుల అకడమిక్ అచీవ్ మెంట్స్ లో ఎంతో తేడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే రకమయిన తేడా 14 సం.ల పిల్లలలో మాథమేటికల్ ఆప్టిట్యూడ్స్ టెస్ట్ స్కోర్స్ లో కూడా ఉంది.

సింగపూర్ విద్యార్థులు, ప్రపంచ సగటు కన్నా 19 శాతం పైన ఉంటే స్కాట్లాండ్ విద్యార్థులు అదే సగటుకి 3 శాతం కింద ఉన్నారు.

***

మరి చైనా ప్రభంజనానికి అడ్డొచ్చే విషయాలేమైనా ఉన్నాయా? 

చైనా అధిరోహణకి ఆటంకాలకి కనీసం నాలుగు రకాల సిద్దాంతాలు కనపడతాయి.

మొదటిది:  
జపాన్ గురించి ఇవేరకమయిన అంచనాలూ, ప్రొజెక్షన్స్ వేయబడ్డాయి ఒకప్పుడు. జపాన్ కూడా అమెరికా కన్నా బలమయిన ఆర్ధికశక్తిగా ఎదుగుతుందని భావించారు. కానీ అది జరగలేదు. 1989 తరువాత జపాన్ విధి ఏమయిందో తెలిసిందే, అదే రకంగా చైనా కూడా స్థంబిస్తుందని కొంతమంది నిపుణుల అంచనా.
రాజకీయ, ఆర్ధిక వ్యవస్థలు నిజమైన పోటీతత్వం మీద ఆధారపడినవి కావనీ, రియల్-ఎస్టేట్, స్టాక్-మార్కెట్ లలో రాబోయే సంక్షోభాలు చైనాని భారీగా దెబ్బతీసి దివాళాకోరు బ్యాంకులూ, నెమ్మదించిన ఆర్థిక ప్రగతీ, డిఫ్లేషన్ లతో చైనాని అతలాకుతలం చేస్తాయ వీరంటారు. 

మరి కొంతమంది యూరేషియా తూర్పున కేవలం కొన్ని ఐలాండ్స్ ల సమూహాలు, పశ్చిమాన ఒక ఖండమంత ఉన్న అమెరికాకి ఎప్పటికీ పోటీ కాలేవని వాదిస్తారు. జపాన్ కూడా పశ్చిమ ప్రపంచ దేశాలని దాటేస్తుందన్న అంచనాలు ఒకప్పుడు ఇంతే నమ్మకంగా కన్పించాయనీ, నిజానికి బ్రిటన్ ని దాటినప్పటికి, అమెరికాని జపాన్ అందుకోలేకపోయిందనీ, నిజానికి 1945 లో అమెరికా చేతిలో ఓటమి పొందిన తరువాత జపాన్ సాధించిన ప్రగతి సమస్తం, తన భధ్రత కోసం అమెరికా మీద ఆధారపడి సాధించిందే అని వీరంటారు. 

రెండవది:  
అంతర్గతంగా భధ్రతా సమస్యలూ, ఆందోళనలూ జరగడం చైనా చరిత్రలో కొత్తేమీ కాదు. అవి భవిష్యత్తులో వస్తాయన్నదే ఈ రెండవ వాదం. చైనా ఈ రోజుకీ కూడా పేద దేశమే. తలసరి ఆదాయంలో చైనా 86 వ స్థానంలో ఉంది. 150 మిలియన్ల ప్రజలు అనగా పదింట ఒక్కరు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. ఎయిర్, వాటర్, గ్రౌండ్ పొల్యూషన్లతో చైనా సతమతమవుతోంది. సాధించిన ప్రగతి అంతా అర్బన్ ప్రాంతాలలో కావడంతో, నగరాలకి వలస పెరిగి, నగరాల మీద వత్తిడి పెరుగుతోంది. పల్లె ప్రాంతాల అభివృద్ది నగరాల స్థాయిలో లేకపోవటంతో, పల్లెప్రజల్లో అశాంతులు రేగవచ్చు. 

కానీ ఈ రోజున ఏ రకమయిన ఊహల్లో కూడా చైనాలో విప్లవమొస్తుందన్న ఆలోచన లేదు. సర్వేలు అదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. అసమనాతలు పెరిగినప్పటికీ చైనా ప్రజలు కమ్యూనిస్ట్-కాపిటలిస్టు మిశ్రమ పద్దతిని అవలంభిస్తున్న తమ ప్రభుత్వం పట్ల సానుకూల దృష్టితో ఉన్నారు.

కొన్ని సర్వేల ప్రకారం ఫ్రీ-మార్కెట్ ఎకానమీ విధానలపట్ల ఈ రోజున అమెరికా ప్రజల కన్నా , చైనా ప్రజలు ఎక్కువ నిబద్దత కనపరుస్తున్నారు.

నిజానికి చైనా కి రాబోతున్న ప్రమాదం తన డెమోగ్రఫీ లో దాగుంది. 1979 లో అమల్లోకి తీసుకొచ్చిన one-child policy వల్ల 2030 కల్లా చైనాలో తన పొరుగు దేశమైన ఇండియా కన్నా, వృద్దుల శాతం ఎక్కువవబోతోంది. 1980లో 5 శాతమున్న 65 yrs+ జనాభా 16 శాతానికి చేరుకుంటుంది. Anhui, Hainan, Guangdong, Jiangxi లలో స్త్రీల కన్నా 38 శాతం ఎక్కువున్న పురుషుల జనాభాతో, స్త్రీ-పురుష నిష్పత్తి లో సమతుల్యం దెబ్బతింది.

మూడవది: 
పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, రాజకీయాలలో వారి మాటకి ఇప్పుడున్నదానికన్నా మరింత ప్రాధాన్యత లభించాలని ఆశించవచ్చు. పశ్చిమ దేశాల చరిత్రలో ఇదే సంభవించింది. చైనా ఒకప్పుడు గ్రామీణ దేశం. నాలుగింట మూడవ వంతు ప్రజలు పల్లెల్లో నివసించేవారు. ఈరోజు 45 శాతం జనాభా నగరాలలో ఉంది. 2030 కల్లా అది 70 శాతానికి చేరుకోవచ్చని అంచనా. అర్బన్ చైనాలో మధ్యతరగతి వేగంగా విస్తరిస్తోంది. మొబైల్ ఫోన్ల , ఇంటర్నెట్ యుగంలో ప్రభుత్వ పరిధిలోకి రాని, ప్రజల నెట్ వర్క్స్ ఏర్పడవచ్చు. నిజానికి అసమ్మతిదారుడిగా పేరొంది 2010 నోబుల్ శాంతి బహుమతి పొందిన Liu Xiaobo కంటే, తనకున్న ప్రజాదరణని కొత్త టెక్నాలజీ ద్వారా మరింత శక్తివంతంగా ఉపయోగించుకొని బాధితుల తరఫున ఉద్యమాలు లేవదీసిన ఆర్టిస్ట్ Ai Weiwei లాంటి వల్లే చైనా ప్రభుత్వానికి మరిన్ని సమస్యలు రావచ్చు. 

కానీ, దీనికి వ్యతిరేకమయిన వాదం కూడా ఉంది. అది బీజింగ్ లో ఈ పుస్తకం కోసం రీసర్చ్ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేసిన టేలివిజన్ ప్రొడ్యూసర్ మాటల్లో చూడవచ్చు. "మా జనరేషన్ చాలా అదృష్టవంతులమని భావిస్తాం. మా తాతల తరం Great Leap Forward లో పాల్గొన్నారు. మా తండ్రుల తరం Cultural Revolution లోంచి వెళ్ళారు, కానీ మేం చదువుకుంటున్నాం, ట్రావెల్ చేస్తున్నాం, డబ్బు సంపాదించుకుంటున్నాం. అందుకనేమో మేము ఆ స్క్వేర్ గురించి అంతగా ఆలోచించం". ఆ స్క్వేర్ Tiananmen Square అని అర్ధమయింది. డెమొక్రసీ కోసం Tiananmen Square లో జరిగిన ఉద్యమాన్ని మిలటరీ అత్యంత దారుణంగా అణచివేసిన విషయం మనకి తెలిసినదే.

నాలుగవది: 
చైనా తన పొరుగుదేశాలకి కంటగింపయింది. పరిస్థితి మరింత విషమించినప్పుడు ఆ దేశాలన్నీ కలిపి యు.ఎస్ వెనక సంఘటితమవవచ్చు. చైనా తన బలాన్ని ప్రదర్శిస్తున్న రీతి మీద గుర్రుగా ఉన్న ఏషియా దేశాల సంఖ్య తక్కువేమీ కాదు. Qinghai-Tibetan పీఠభూమి నుంచి నీటివనరులని తరలించాలన్న చైనా ప్రణాళికలు బంగ్లాదేశ్, ఇండియా, కజక్స్తాన్ లకి సమస్యలు తీసుకురావచ్చు. చైనా అలవాటుగా, వియత్నాం లోని బాక్సైట్ మైన్స్ లో తన ప్రజలనే ఉద్యోగాల్లో నియమించటం పట్ల Hanoi లో ఓపిక నశిస్తోంది. Senkaku/Diaoyu Islands లలో rare-earth exports మీద చైనా విధిస్తున్న ఆంక్షలు జపాన్ తో చైనా సంబంధాలని దెబ్బతీసాయి.

1972 లోని రిచర్డ్ నిక్సన్- హెన్రీ కిసింజర్ ల చైనా చర్చల ఫలితం వల్ల తిరిగి ప్రారంభమయిన దౌత్య సంబంధాలని అమెరికా ఫారిన్ పాలసీ చరిత్రలోనే అతి పెద్ద మలుపు గా పేర్కొంటారు. 2010 లో India, Indonesia ల పర్యటనలతో తూర్పు వైపు దృష్టి సారిస్తున్నట్లుగా అన్పించినప్పటికి, ప్రస్తుతం వైట్-హౌస్ లో నివసిస్తున్న అమెరికా అధ్యక్షుడు చైనా మీద అంతగా శ్రద్ద పెడుతున్నట్లుగా గోచరించదు.

"వెళ్లిపోతోన్న" ఒక శక్తి కి, "రానున్న" శక్తి తీసుకొచ్చే తలనొప్పుల డైలమా అంతా ఇంతా కాదు. ఎదుగుతోన్న జర్మనీ ని నిరోధించే ప్రయత్నంలో బ్రిటన్ చాలా కోల్ఫోవాల్సి వచ్చింది. ఆ ఖర్చుల కన్నా యు.ఎస్ కి ఒక జూనియర్ పార్ట్నర్ గా ఉండిపోవడం బ్రిటన్ సులభమయింది.

మరి అమెరికా, చైనా ని నియంత్రించాలా లేక చైనా ని ప్రసన్నం చేసుకోవాలా?

ఒపీనియన్ పోల్స్ లో అమెరికన్ ప్రజలు, తమ అధ్యక్షుడి లాగే ఎటూ తేల్చుకోలేని ధోరణిని వ్యక్తపరుస్తున్నారు. ఒక పోల్ ప్రకారమ్ 49 శాతం అమెరికన్ ప్రజలు ప్రపంచ సుపీరియర్ పవర్ గా అమెరికాని చైనా అధిగమించదని భావిస్తే, 46 శాతం ప్రజలు చైనా సూపర్ పవర్ అవుతుందని అభిప్రాయపడ్డారు. సోవియట్ యూనియన్ పతనమయిన తరువాత, ఏకధృవ ప్రపంచంలో ఎదురులేని శక్తిగా అమెరికా కి లభించిన స్థానంతో కొంతమంది కామెంటేటర్స్ తలలకి మత్తెక్కింది. నిజానికి కోల్డ్-వార్ నలభై సంవత్సరాలు సాగింది, సోవియట్ యూనియన్ యు.ఎస్ ఎకానమీని అధిగమించే స్థాయికి కనీస దూరం లోకి ఎప్పుడూ రాలేదు.

కానీ, మనమిప్పుడు పశ్చిమప్రపంచపు ఐదొందల సంవత్సరాల ఆధిపత్య అంత్యదశలో ఉన్నాం. ఈ సారి తూర్పు ప్రపంచం నుంచి పైకెదుగుతూ సవాల్ విసురుతున్న పోటీదారుడు ఆర్ధికంగా శక్తివంతమైనవాడే కాక, భౌగోళిక-రాజకీయాలలొ కూడా బలంగా ఎదుగుతున్నవాడు.

We are the Masters now అని చైనా ప్రకటించుకోవడానికి సమయమింకా ఆసన్నం కాలేదు, కానీ వారు ఎప్పుడో అప్రెంటిస్ దశని దాటి వచ్చేసారు. కానీ ఈ ధృవాల మధ్య Samuel Huntington ఊహించిన Clash of Civilizations ల ఘర్షణ బహుశా జరగకపోవచ్చు. బహుశా గత ఐదొందల సంవత్సరాలలో జరిగినట్లుగానే వెస్ట్ వైపే బలం మొగ్గవచ్చు. కానీ, ఒక సివిలైజేషన్ బలహీనపడి, మరొక సివిలైజేషన్ బలపడ్డప్పుడు కీలకమయిన ప్రశ్న అవి రెండూ ఘర్షణ పడతాయా, లేదా అన్నది కాదు. బలహీనపడ్డ శక్తి అంచు మీద నుంచి జారి ఒకేసారి కూలిపోతుందా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.

హిందూ-కుష్ పర్వతాల నుంచి వైదొలగడమూ, మెసపొటేమియా మైదానాల్లోంచి వెనక్కి మరలడమూ, క్షీణించి నశించబోతున్న సోవియట్ యూనియన్ కి సంకేతాలుగా నిలచాయి. 1989 లో ఆఫ్ఘనిస్తాన్ లోంచి వైదొలగిన సోవియట్ యూనియన్ 1991 కల్లా అంతరించిపోయింది. జరిగిందాన్ని గమనించినప్పుడు ఎప్పుడో ఐదో శతాబ్ధం లో జరిగినట్లుగా సివిలైజేషన్స్ మెల్లిగా అవతరించి, వృద్దిలోకి వచ్చి, ప్రాభ్యవ్యాన్ని పొంది, ప్రపంచాన్ని శాసించి, క్రమంగా జారిపోవు. చరిత్రకారులు వెనక్కి తిరిగి చూసి చరిత్ర రాసినప్పుడు, సివిలైజేషన్స్ నశించడాన్ని అతినెమ్మదిగా జరిగే ప్రక్రియగా, నిర్ధారణగా తెలిసిన ఎన్నో కారణాలతో అంతమయిపోయాయి అన్నట్లుగా అభివర్ణిస్తారు. అది నిజం కాదు. ఈ చాప్టర్లోనే పైన చెప్పుకున్నట్లుగా సివిలైజేషన్స్ అతి సంక్లిష్టమయిన ఇతర వ్యవస్థల్లాగే ప్రవర్తిస్తాయి. ఒక పరిపూర్ణమయిన సమతుల్యంలో, మనం తెలుసుకోలేనంత కాలం సివిలైజేషన్స్ మన్నుతాయి, వెలుగుతాయి. ఆ పిదప అకస్మాత్తుగా అవి అంతరిస్తాయి. పైన చెప్పుకున్న Thomas Cole పెయింట్ The Course of Empire కన్నా, ఒకప్పుడూ ఎన్నోవేల కాలేజ్ హాస్టళ్లల్లో ఉన్న ఒక పోస్టర్ ఈ పరిస్థితికి దృశ్యచిత్రంగా నిలుస్తుందని చెప్పవచ్చునేమో. వేగంగా దూసుకెళ్తూన్న ఒక రైలు విక్టోరియన్ స్టేషన్ టర్మినల్ గోడని ఢీకొని ఆగక, కిందనున్న రోడ్డుమీదకి తలక్రిందులుగా జారిపోయిన వైనాన్ని చిత్రీకరించిన ఆ ఆ పోస్టరే బహుశా నిజానికి దగ్గరేమో!

వెస్ట్రన్ సివిలైజేషన్ ని ఈ ప్రమాదం నుంచి తప్పించడానికి అసలేమైనా చేయగలమా?

అన్నిటికన్నా ముందరగా మనం, వెస్ట్రన్ సివిలైజేషన్ అంత్యదశ ఆసన్నమయిందని నిర్ధారణగా అనుకోవటం మానేయాలి. నిజమే, మిగతా ప్రపంచం కన్నా వెస్ట్ ని ముందుంచిన విషయాలు ఈ రోజున కేవలం వెస్ట్ కే పరిమితమయి లేవు. ఈ రోజున చైనాలో కాపిటలిజం కూడా ఉంది. ఇరానియన్స్ దగ్గర సైన్స్ ఉంది. రష్యా డెమొక్రసీని తెచ్చుకుంది. ఆఫ్రికన్స్ (నెమ్మదిగా) మోడరన్ మెడిసిన్ ని సాధించుకుంటోంది. టర్కీ కన్స్యూమర్ సొసైటీగా ఎదుగుతోంది. వీటన్నిటి అర్దమేమిటంటే వెస్ట్రన్ దేశాల పనితీరు నమూనాలు క్షీణించట్లేదని, ఏవో కొన్ని భాగాల్లో తప్ప, అవి దాదాపు ప్రపంచమంతటా వర్ధిల్లుతున్నాయని.

రోజురోజుకీ మరింత ఎక్కువ మంది పశ్చిమేతరులు, పశ్చిమదేశాల ప్రజల్లాగా డ్రెసింగ్, ట్రావెలింగ్, డ్రింకిమ్గ్, ఈటింగ్, ప్లేయింగ్, వర్కింగ్, షవరింగ్, స్లీపింగ్ లు అలవాటు చేసుకుంటున్నారు.

మరింత ముఖ్యంగా వెస్ట్రన్ సివిలైజేషన్ కేవలం ఏదో ఒక్క విషయం కాదు, అదొక పాకేజ్. అది కేవలం కాపిటలిజమే కాదు, ఒక political pluralism కూడా (multiple states and multiple authorities). స్వేచ్చ ఆలోచనల్లోనే కాదు, సైంటిఫిక్ మెథడ్ లో కూడా. అది రూల్-ఆఫ్-లా, ఆస్థి-హక్కు లకి సంబంధించింది కూడా. ఈ రోజుకి కూడా వెస్ట్ లో ఉన్న వ్యవస్థలు , ఇతర ప్రపంచం కన్నా మెరుగైనవి. చైనాలో పొలిటికల్ - కాంపిటీషన్ లేదు. ఇరాన్ లో ఆత్మప్రభోధంగా నడుచుకునే స్వేచ్చ లేదు. రష్యాలో వోటు-హక్కు రావచ్చేమో కాక, కాని అక్కడ రూల్-ఆఫ్-లా అవినీతితో కూడుకున్నది. ఈ దేశాలేవీ కూడా స్వేచ్చాపూరిత జర్నలిజం ని అనుమతించవు. బహుశా అందుకేనేమో ఈ మూడు దేశాలన్నీ కలిపి కూడా 'National Innovative Development' and 'National Innovation Capacity' ల లాంటి నాణ్యతాకొలబద్దల్లో వెస్ట్రన్ దేశాల కన్నా వెనకపడి ఉంటాయి.

వెస్టర్న్ సివిలైజేషన్ లో లోపాలకేం కొదవ లేదు. చారిత్రాత్మకమయిన తప్పిదాలు పశ్చిమ నాగరికత చాలానే చేసింది. ఇంపిరీయలిజంతో అది చేసిన ఘోర కృత్యాలూ, తన వినియోగసంస్కృతి లోని డొల్లతనం, దాని తీవ్రమైన మెటీరియలిజం లన్నీ కూడా ఆ తప్పిదాల పరిణామాలే. ప్రొటెస్టెంట్ ఎథిక్ గురించి Max Weber ఎంతో గొప్పగా చెప్పుకున్న క్రమశిక్షణా, వాంఛా-కోరిక ల పట్ల స్వీయ-నియంత్రణ లని పశ్చిమనాగరికత ఏనాడో కోల్పోయింది.

అయినప్పటికీ, ఉన్నదాంట్లో మెరుగైన ఆర్ధిక, సాంఘిక, రాజకీయ వ్యవస్థల పాకేజ్ గా ఈ వెస్టర్న్ పాకేజ్ ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాలని ఆకర్షిస్తోంది. వ్యక్తి స్థాయిలో మానవ సృజనాత్మకతని ఎంతో ప్రేరేపించే వ్యవస్థలుగా, 21వ శతాబ్ధం లోని రానున్న సమస్యలకి ఇదే పరిష్కారంగా ప్రపంచం నలుమూలలా ఈ నమూనాలని దిగుమతి చేసుకుంటున్నాయి.

గత అర్ధ-సహాస్రాబ్దంలో మరే ఇతర సివిలైజేషన్ కూడా ఇంతగా, మానవ సమాజం లో ఎక్కడో మరుగున ఉన్న టాలెంటెడ్ వ్యక్తులని కనిపెట్టి, వారిని ఎడ్యుకేట్ చేయలేదు. కానీ మన ముందున్న పెద్ద ప్రశ్న ఈ పాకేజ్ కి అంతర్గతంగా ఉన్న శక్తులని మనం గుర్తిస్తున్నామా, లేక మర్చిపోతున్నామా అన్నదే.

మూలాల్లోకి వెళ్లి చూస్తే, స్కూళ్లల్లో ఏవయితే భోధిస్తున్నారో అవే నాగరికత గా చెప్పుకోవచ్చు.. చైనా నాగరికత ఒకప్పుడు Confucius భోధనల మీద నిర్మించబడింది, ఇస్లాం నాగరికత ఈ రోజుకీ ఖురాన్ మీద ఆధారపడింది. మరి ఈ రోజున వెస్టర్న్ సివిలైజేషన్ స్కూళ్ల లో భోధించబడుతున్న ముఖ్య గ్రంధాలేమిటి? పైన చెప్పుకున్న వ్యవస్థల మిశ్రమమైన పాకేజ్ ఒక ఫలితంగా వచ్చేలా పశ్చిమదేశాలలోని స్కూళ్లు ఈ రోజున ఎంత ప్రభావితంగా భోధించగలుగుతున్నాయి? బహుశా వెస్టర్న్ సివిలైజేషన్ కి నిజమైన ప్రమాదం చైనా, ఇస్లాం, కార్బన్ ఎమిషన్స్ రూపంలో రావట్లేదేమో, పూర్వీకుల నుంచి సంక్రమించిన నాగరికతలో పశ్చిమ దేశాల ప్రజలకి నమ్మకం పోవటం వల్ల వస్తుందేమో?

***

P.G.Woodhouse అన్నట్లుగా పశ్చిమ నాగరికత, ఒక అపరిపక్వ-అనుసరణ కాదు.


"సమాజంలో నిలదొక్కుకున్న ఆచారాలకీ, నమ్మకాలకీ, వారి కోరికలకీ తగ్గట్లుగా, పాలక పక్షం నడచుకోవాలని రాజ్యాంగంలో ప్రకటించుకొని దానికి నిబద్దులవడమే, పశ్చిమ నాగరికత కేంద్రంలో ఉన్న ముఖ్యమైన నియమం" అని ఎంతో విలువైన మాటని తన ఉపన్యాసం లో చెప్పాడు Churchill.


అదే స్పీచ్ లో ప్రస్తావించిన ఆ బార్బారిక్, ఆటవిక శక్తులు ఆ రోజున బ్రిటన్ బయటున్నాయి, ముఖ్యంగా జర్మనీ లో. కానీ, ఆ ఆటవిక శక్తులు కూడా పశ్చిమ నాగరికతలోంచి వచ్చినవే అని మనమీ రోజున వెనక్కి తిరిగి చూసి గమనించవచ్చు. అదే విధంగా ఈ రోజున వెస్టర్న్ సివిలైజేషన్ కి ప్రమాదం బయటనుంచి వస్తున్నది కాదు, అంతర్గతంగా వస్తున్నదే. ఎన్నో ధోరణుల వల్ల స్వయాన బలహీనంగా, పిరికిగా తయారవుతున్న సమాజాల వల్ల వస్తున్నదే. చరిత్ర మీదున్న అజ్ణానం తో, ఏ విలువలూ, నియమాలూ, ధోరణులూ, దృక్పథాలూ తమని ఒకప్పుడు మిగతా ప్రపంచం కన్నా ముందు నిలబెట్టాయో అన్న విషయం మరవడం వల్ల వస్తున్నదే.

1 comment:

  1. చాలా బావుంది కుమార్ జీ !
    మొత్తానికి నాగరికత ఏదైనా చివరికి ఏదో ఒక రిధం ఫాలో అవుతూ నశించక తప్పదు అన్నమాట :-) మనిషి జీవితం లాగే నాగరికత దశలు ఉన్నట్లున్నాయి .
    మొత్తం పుస్తకం అంతా translate చేసినందుకు మీకు మెనీ థాంక్స్ !

    ReplyDelete