"మరి నువ్వు రాకపోతే?"
"నాకిష్టం లేదని అర్ధం" అని జవాబు వినిపిస్తుందా అమ్మాయికి, అప్పటికే వెనక్కి తిరిగిన బైక్ మీదనుంచి
రాలేకపోతే? అన్న ప్రశ్న తట్టని నమ్మకాల చెలిమీ, వయసూ
అడగని ప్రశ్న గుమ్మం తెరిచి ఎటో ఈడ్చుకెళ్తున్నప్పుడు,
ఇచ్చిన జవాబు ఆఖరుదనుకుంటుందేమో అనుకొని ప్రాణాలకి తెగిస్తాడా ఆ అబ్బాయి.
పైమెట్టు అంచున నల్ల చీర జరీ అంచునానించి వేచిచూస్తున్న అమ్మాయికి అర్ధమయ్యేలోగానే
తన ప్రాణం జారిన అదే మెట్ల మీదుగా, అమ్మాయిలో నయగరా విరిగి జారి నీరయిపోతుంది
***
యుగాల ఐస్ ఏజ్ కమ్మేసిన కాలం లో..
చుట్టూ ఉన్న వాళ్ళ కోసం గడ్డ కట్టుకుపోయినవన్నీ చుట్ట చుట్టుకుని
పరాయి దేశం వెళ్ళిపోయాక చాన్నాళ్లకి
***
చలికి కొంగు చుట్టుకుని కూర్చున్నప్పుడు మెడ పక్కన కనిపించిన పరాయి చెయ్యికి అదాటుగా తలతిప్పి చూస్తే రెండో భుజం మీదుగా కూడా నిండా దుప్పటి కప్పి వెళ్తున్న అతను.
అసలెవరితను?
ఎగరగలిగీ తనెళ్ళేదాకా తనకోసం పంజరం లోపలే ఉండిపోయిన తోటి పావురం కాదూ ?
స్నేహం చేయలేని నాకు, కంపరమేస్తోందన్న నామీద, ఈ కరుణకి
ధమనుల్లో కంపన తో మొదలయిన రాగమేదో ఎగసి గొంతులోనే ఆగిపోయినపుడు కళ్లల్లో ఊరిన ఆ పాట
పాడిన నిశ్శబ్ధ గీతం కృతజ్ఞతా లేక కరుగుతోన్న ఘనీభవ స్థితా
***
ఎవరిక్కావాలి, నీకా తనకా అన్న ప్రశ్నలకి
లేదు అంతా ఆ అమ్మాయికే అనకుండా బరువు తన మీద వేసుకొని సమాధానాలన్నీ అతనే చెప్పినపుడు, తన కళ్లల్లో చలనం తనకైనా తెలిసిందా?
***
మనసుకు కష్టం కలిగినపుడు దిశ లేకుండా గొణుక్కుంటూ బయటకి నడ్చుకుంటూ వెళ్ళడమే తెలిసిన తనకి,, అతనికి కష్టం వచ్చినపుడు తను మొట్టమొదటిసారిగా గుడికి వెళ్ళి నిశ్శబ్ధంగా దేవుడి ముందు నిలపడ్డప్పుడు స్నేహానికి మించిన బంధమేదో పరిచయమవుతుంది ఆ అమ్మాయికీ
***
పసుప్పచ్చ వెలుతురూ, నల్లటి నీడలూ, అందమైన ఇల్లూ, మధ్యలోకి తెరుచుకుని తిరిగే ఇంత పెద్ద తలుపూ, ఫైన్ వుడ్ గోడలూ, రూఫ్ టాప్ కి మెట్లూ,
బీటిల్స్ వింటూ వంట చేసే అమ్మాయీ, తను పిల్లోస్ తో చేసిన లేయిడ్ బాక్ సెటప్సూ, ఇద్దరే మనుషులూ, ఒకరికొకరు ఇచ్చుకునే స్పేసూ
***
అంతగా తెలియని ఊరు, పైగా చివర్లో ప్లాన్ మారి ఒక్కణ్ణే వెళ్ళాల్సి వచ్చింది. సినిమా హాల్ తలుపులు తెరిచాకా ఎక్కడ నడుస్తున్నానో, ఎక్కడికెళ్తున్నానో, అసలు నడుస్తున్నానో తేలుతున్నానో ఉనికి తెలియని ఒక ట్రాన్స్. మనుషులెవరూ లేని ఒక ప్రాంతం గుండా కదుల్తున్నానని మాత్రం తెలుస్తోంది. చుట్టూ చల్లగా, కాదు కాదు వార్మ్ గా.. లోపలెక్కడో ఫైర్ ఐస్క్రీం గుండె గోడల మీదుగా జారుతున్నట్లుగా ఒక ట్రాన్సెండంటల్ స్టేట్, "నేను" అన్నదంతా ఆవిరయి ఒక మేఘం లా మారి వెన్నెలంతా తాగుతున్న ఒక స్థితి. అలా చాలా సేపు గడిచాకా గజిబిజి జనాల సమ్మర్ధంలో భగభగ మండే ఎండలో మిర్యాలగూడ అనే ఒక ఊరులో నడుస్తున్నానని అర్ధమయింది.
అలాంటి భావనలున్న ప్లేన్ లోకి అంతసేపు నన్ను తీసికెళ్లగలిగిన ఒకే ఒక్క సినిమా అది. దాదాపు ముప్పై రెండేళ్ల తరువాత మొన్న చూసినపుడు కూడా అద్భుతం అనుకున్నాక అపుడు నా వయసున్న ఇప్పటి అమ్మాయికి చూపించినపుడు, Meh అనకుండా ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ నాన్నా అన్నప్పుడు ఎక్కడో ఏదో సర్కిల్ కంప్లీట్ అయిన తృప్తి.
0 comments:
Post a Comment