Tuesday 16 April 2013

దీనికి ముందు పోస్టులో ఈ పుస్తకం లో ఉన్న ఇంట్రడక్షన్ గురించి రాయడం జరిగింది. ఈ పోస్టులో రచయిత ప్రతిపాదించిన ఆరు కారణాల్లోని మొదటి కారణమైన Competition చాప్టర్ కాపీ కొట్టడమైనది.

రెండు నదులు
  • మింగ్ సామ్రాజ్యపు చక్రవర్తి గ్రాండ్ కెనాల్ ని పునరిద్దరించాక,  ఈ కాలవ మీద 12,000 ధాన్యపు నౌకలు రవాణా అయ్యేవి. వీటి సంరక్షణకి సుమారుగా 50,000 ఉద్యోగులతో ఈ పరిశ్రమ కళకళలాడుతూ ఉండేది.
  • 1420 లో ఐదు నుంచి పది లక్షల జనాభాతో Nanjing ప్రపంచంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటి. సిల్క్, కాటన్ వ్యాపారాలకి కేంద్రంగా, విద్యా, విషయసేకరణల్లో ముందున్న నగరం. 2000 scholars తో 11,000 volumes తో అతిపెద్ద encyclopedia ని ఆ కాలంలోనే చైనీస్ రూపొందించగలిగారు.
  • చైనా మింగ్ చక్రవర్తులు Nanjing తో సరిపెట్టుకోలేదు. Yongle పదవిలోకి వచ్చిన అతికొద్దికాలంలోనే కొత్త రాజధాని బీజింగ్ నిర్మాణానికి భారీ సన్నాహాలు మొదలయ్యాయి. 1420 కల్లా ముగిసిన Forbidden City నిర్మాణంతో చైనా civilized world లో శిఖరాగ్రస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు.
  • Yangzi నదిని చూసిన కళ్లతో , ఇదే సమయంలో London లోని థేమ్స్ నదిని చూస్తే, అదొక backwaters గా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఆ సమయంలో London యూరప్ ఖండంలో రద్దీగా ఉండే పోర్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ వ్యాపార లావాదేవీల్లో, వాటి పరిమాణంలో చైనాలోని గ్రాండ్ కెనాల్ తో పోల్చతగ్గదిగా ఉండేది కాదు. ప్రధానంగా ఉన్ని ఎగుమతులకీ, ఫ్రాన్స్ తో నిరంతరంగా జరిగే యుద్దానికీ, మనుషుల సరఫరాకీ ఈ పోర్టు ఉపయోగపడేది.
  • ఇక లండన్ టవర్ ని Forbidden City తో అసలే పోల్చి చూడలేం. Nanjing నగరం, London నగరం కన్నా ఎంతో పెద్దది.
  •  1540 కీ, 1800 కీ మధ్య ఇంగ్లాండ్ లో సగటు ఆయుపరిమితి 37 సంవత్సరాలు మాత్రమే. షుమారు ప్రతి ఐదు శిశువుల్లో, ఒక శిశువు మొదటి సంవత్సరం ముగిసేలోగానే మరణించేవారు. సాక్షాత్తూ Henry V ఇరవైఆరు సంవత్సరాలకి రాజయ్యి, ముప్పైఐదు సంవత్సరాలకల్ల మరణించాడు.
  • France తో ఎప్పటికీ అంతమవ్వని యుద్దం, మధ్యలో Welsh, Scots, Irish లతో యుద్దాలూ, అవీ లేదంటే కిరీటం కోసం అంతర్గత యుద్దాలతో ఇంగ్లాండ్ దేశం లో హింస ఎప్పుడూ రాజ్యమేలుతుండేది.
  • Black Death యూరప్ ని ఊడ్చిపెట్టిన విధానం మానవచరిత్రలోనే ఒక అతిదయనీయమైన ఘట్టం. 1655 లో సమాజ మానసికపరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే తమ్ముణ్ణీ, చెల్లినీ భర్తనీ, వారి ఐదుగురు పిల్లల్నీ ప్లేగ్ వ్యాధి కబళించేసిన తర్వాత Italian artist Salvator Rosa L'umana fragilita (Human Frality) వేసిన పెయింటింగ్ లో మానవుడెంత నిస్సహాయుడో గమనించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఆ పెయింటింగ్ మీద రాసిన నాలుగు చిన్న వ్యాక్యాలు యూరప్ లో, ఆనాటి జీవితాలకి అద్దం పడతాయి.
    Conception is Sin, Birth is Pain, Life is Toil, Death is Inevitable

సాంకేతికాధిపత్యం:
  •  ఏషియాలో వ్యవసాయాధిరత ఉత్పత్తులు యూరప్ లో కన్నా చాలా ఎక్కువగా ఉండేవి.తూర్పు ఏషియాలో ఒక ఎకరం భూమిలో పండే బియ్యం ఒక కుటుంబానికి సంవత్సరం పొడుగునా ఆహారాన్ని సమకూర్చగలిగేది. యూరప్ లో దాదాపు అదే పంట పండించడానికి ఒక ఇరవై ఎకరాలు అవసరమొచ్చేది. బహుశా ఇది కూడా ఒక కారణమేమో తూర్పు ఏషియాలో జనాభా ఎక్కువుండటానికి.
  • మొట్టమొదటి వాటర్ క్లాక్ ఎవరు కనిపెట్టారో బహుశా మనకి తెలియకపొవచ్చేమో, కానీ మెకానికల్ క్లాక్ ని మాత్రం 1086లో Su Song అందించాడు 40 foot tall contraption కట్టడం ద్వారా. అది టైమ్ చెప్పడమే కాదు, సూర్య చంద్రుల గమనాల్ని సైతం తెలియచెప్పేది. షుమారు వంద సంవత్సరాల తర్వాత చర్చ్ ల కోసం నిర్మించిన astronimcal clocks వచ్చేంత వరకీ సాంకేతికంగా దీనికి దరిదాపుల్లో సరితూగగల క్లాక్ యూరప్ లో ఉండేది కాదు.
  • మనందరికీ తెలిసిన విషయమే జర్మనీలో పదిహేనవ శతాబ్ధంలో ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టారని. నిజానికి అంత అధునాతనమైనది కాకపోయినా , మొదటి ప్రింటింగ్ ప్రెస్ చైనీస్ పదకొండవ శతాబ్ధంలోనే నిర్మించగలిగారు. పేపర్ నిర్మాణం కూడా చైనాలోనే తొలిసారిగా జరిగిందన్న సంగతి తెలిసిన విషయమే. అలాగే పేపర్ మనీ,వాల్ పేపర్, టాయిలెట్ పేపర్ లు కూడా.
  • 1311 లో Wang Zhen యొక్క Treatise on Agriculture గ్రంధం లో వ్యవసాయ విప్లవానికి సంబంధించిన యూరప్ కి తెలియని ఎన్నో విషయాలుండేవి
  • Iron ని melt చేయడం కోసం మొట్టమొదటి blast furnace చైనాలో క్రీస్తు పూర్వమే ఉండేది
  • క్రీస్తు శకం మొట్టమొదటి శతాబ్ధానికి చెందిన suspension bridge ఆనవాళ్ళు చైనా Ching-tung లో ఈనాటికీ గమనించవచ్చు.
  • అంతెందుకు. 1788 లో కూడా బ్రిటన్ లో ఇనుము ఉత్పత్తులు, చైనాలో 1078 లో, అంటే ఏడొందల ఏళ్ళ క్రితం ఇనుము ఉత్పత్తులకన్నా తక్కువే.
  • Spinning Wheel నీ, Sil reeling frame ని కనిపెట్టడం ద్వారా Textile Production లో చైనా పదమూడవ శతాబ్ధంలోనే విప్లవాలు సాధించి Italy కి ఎగుమతి చేసింది.గన్ పౌడర్ ని కనుక్కున్నది కూడా చైనానే.
  • ఇంకా ఇతర చైనా పరిశోధనా ఫలితాలు. కెమికల్ పురుగుల మందులు, Fishing reel, అగ్గిపుల్ల,అయస్కాంత దిక్సూచి, పేక ముక్కలు,టూత్ బ్రష్,Wheel Barrow
                                                               భారీ పడవల నిర్మాణం
ఇవన్నీ ఒక ఎత్తయితే. 1400 సంవత్సరం మొదలయ్యేనాటికి చైనా ప్రపంచాధిపత్యాన్ని సంపాదించే అతి ముఖ్యమైన సాంకేతిక విజ్ణానాన్ని సమకూర్చుకుంటోంది. ప్రపంచం కనీ వినీ ఎరుగని రీతిలో, చైనా భారీ ఓడలని నిర్మించడం మొదలుపెట్టింది . సుదూర సముద్రయానాన్ని అతి సులువు చేయడమే కాక, వర్తక వాణిజ్య సామాగ్రి సరఫరా పెంచడమే కాకుండా, ఈ భారీ సైజు నౌకలు చైనా శక్తి,యుక్తులకి ప్రతీకగా ఇతరదేశాలకి చాటిచెప్పేవి.

ఈరోజుకి కూడా Nanjing లో Treasure Ship అసలు సైజు నకలు ని చూడొచ్చు. 400 feet పొడవుతో ఉన్న ఈ పడవ సైజు, Christopher Columbus అట్లాంటిక్ మహాసముద్రాన్ని 1492 లో దాటిన Santa Maria కన్నా ఐదింతలు పెద్దది.




అంతే కాదు, సముద్రం మీద ప్రయాణించడానికి చైనా ఉపయోగించే 300 పెద్ద నౌకల్లో , ఈ Treasure Ship కేవలం ఒక నౌక మాత్రమే.

Zheng He నాయకత్వం లోని నౌకాదళం 28,000 సిబ్బందితో చైనా వర్దిల్లేది. First world war దాకా అంత పెద్ద నౌకాదళం పశ్చిమార్ధం లో ఏ దేశానికి లేదు.

ఈ పడవలనుపయోగించే 1405 - 1424 మధ్యలో Zheng He థాయ్ లాండ్, సుమాత్ర, జావా, ఇండియాలో కాలికట్(కేరళ) , సింగపూర్, సిలోన్, కటక్(ఒరిస్సా) నుంచీ, జెడ్డా దాకా నౌకాయానం ద్వారా ప్రయాణించాడు.

ఈ నౌకా యాత్రల్లో Zheng He మరియు అతని సిబ్బందీ Porcelain, iron cauldrons, gifts, oil, wax etc ఇతరదేశాల్లొంచి కొనుగోలు చేసేవారు. అలాగే ఇండియన్ వ్యాపారులు అమ్మే porcelain, silk and musk, peppers, pearls, precious stones, ivory and rhinoceros horns ఇవన్నీ కూడా కొనుగోలు చేసేవారు.

వాణిజ్యం, కొనుగోళ్ళూ, కప్పం తో పాటుగా ఈ నౌకాయాణాల ద్వారా చైనా శక్తిని ప్రదర్శించి, వివిధ బహుమానలివ్వటం ద్వారా బార్బేరియన్ దేశాల భయభక్తులని సాధించాలని ఆరాటపడటంతో పాటుగా, ఆఫ్రికా దేశాల పరిపాలకులకీ, చైనాకి మధ్య సంబంధాల్నినెలకొల్పటం లాంటి ఇతర లక్ష్యాల్ని కూడా చైనా సాధించగలిగింది. (African Malindi(Kenya) Sultan చైనా చక్రవర్తికి ఎన్నో exotic gifts తో పాటుగా ఒక కొత్త యానిమల్ జిరాఫీ ని బహుకరించిన ఘట్టం లో చైనా చక్రవర్తి మాట్లాడుతూ చెప్పిన మాటల్లో రాజ్య, ధన కాంక్షకన్నా, కీర్తి కాంక్ష ఎక్కువ కనపడటం మనం గమనించవచ్చు). 

కాని 1424 వచ్చేప్పటికల్లా Yongle చక్రవర్తి చనిపోవడంతో, పరిస్థితులు తారుమారయ్యి, ఆయనతో పాటే, చైనా ఆశయాలన్నీ చెదిరిపోవటం మొదలయింది. Zheng He నౌకాయాత్రలన్నిటినీ వెనువెంటనే నిలిపివేయటం జరిగింది. పెద్ద నౌకల తయారీని నిషేదించారు. 1500 సంవత్సరం వచ్చేప్పటికల్లా చైనాలో రెండు పెద్ద తెరచాపల కన్నా ఎక్కువున్న పడవని నిర్మించడం, ఉరిశిక్షార్హం, అంటే పరిస్థితులు ఎంత విషమించాయో అర్ధం చేసుకోవచ్చు.

అంత గొప్ప ఓడల్నీ, నౌకల్నీ నిర్మించి, వాటియాత్రల ద్వారా విదేశివాణిజ్యం తో సముద్రాలకవతల విజయకేతనాన్ని ఎగరవేయటానికి సిద్దమయిన చైనాలో , అకస్మాత్తుగా పరిస్థితులన్నీ తారుమారవడానికి కారణాలేమిటి?
  • Yongle చక్రవర్తి చనిపోయిన తరవాత , వచ్చిన ఆర్ధిక సంక్షోభాలా? లేక దేశాధిపత్యం కోసం జరిగిన అంతర్గత రాజకీయ లొసుగులా?
  • వియత్నాం తో జరుగుతున్న యుద్దం వల్ల అదుపుతప్పిపోయి పెరిగిన ఖర్చులా?
  • లేక ఇతర కారణాలా?
బహుశా ఇదమిద్దంగా ఇదీ కారణమని మనకెప్పటికి తెలియకపోవచ్చు. కానీ, ఆ కాలంలో Zheng He ఓడప్రయాణాలు, 1960 ల కాలంలో space race లో అమెరికా తన విజయదుంధుభిని మ్రోగించి, ప్రపంచానికి తన శక్తిని ప్రదర్శించడంతో పోల్చతగినవి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండబోదు.

SPICE RACE.

పైన పేర్కొన్న గొప్ప నావికుడూ, ప్రపంచ చరిత్రలో రాజ్యాధికారశక్తులకి అతిసమీపంగా ఉండడమే కాకుండా అత్యంత పలుకుబడి సాధించిన Eunuch గా పేరొందిన Zheng He, నావికాదళం శక్తులతో పోలిస్తే, పోర్చుగల్ నుంచి ప్రపంచానికి సుపరిచితం కాబోతున్న నావికుడు వాస్కోడిగామా నౌకలు నాలుగురెట్లు చిన్నవి.

  •  వాస్కోడిగామా సిబ్బంది కేవలం 170 మంది మాత్రమే. కానీ, గామా నౌకాయాత్రల లక్ష్యాలు భిన్నమైనవి.

  • Spices కోసం మొదలయిన ఈ నౌకాయాణాలు ప్రపంచాన్ని, పశ్చిమం వైపు మొగ్గు చూపడానికి నాందిగా పేర్కొనవచ్చు.

  • Cinnamon, Cloves, mace and nutmeg యూరప్ లో పండేవి కాకపోవడంతో వాటిని దిగుమతి చేసుకోక తప్పేది కాదు.


అయితే శతాబ్ధాల నుంచీ కూడా ఈ spices అన్ని యూరప్ దాకా రావడానికి స్థిరపడిన దారులు రెండే. హిందూమహాసముద్రం నుంచి Red Sea పైగా ఒక మార్గమయితే, Areabia and Anatolia భూభాగం ద్వారా ఇంకో మార్గం. ఇవి రెండూ కాకుండా, ఆఫ్రికా ఖండం పశ్చిమతీరం వెంట, దాని చుట్టూ ప్రయాణించి, Cape of Good Hope మీదుగా Indian Ocean లో ప్రవేశించగలిగే లాంటి, ఇతర మార్గాలేవైనా అన్వేషించగలిగితే వ్యాపారం అంతా తమదే అవుతుందన్న సంగతి పోర్చుగీస్ అర్ధం చేసుకుంది.




ఇక్కడ ఒక ముఖ్యమైన సంగతి గమనించాలి. King Manuel(Portugese) ఆదేశాలలో పాశ్చాత్య దేశాలు ఇతరఖండాలకి ఎలా వ్యాపించాయో తెలుసుకోవచ్చు. ఆఫ్రికా చుట్టూ తిరిగి మరీ explore చేయడంలో మతలబు చైనా చక్రవర్తి లాగా కేవలం ఇతర దేశాల భయభక్తులనీ, గౌరవాన్నీ, వాణీజ్యాన్నీ, కప్పం నీ సాధించడమొక్కటే కాదు. యూరప్ లో తమ ప్రత్యర్ధులయిన స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల కన్నా పొలిటికల్ గా, ఎకనమికల్ గా ముందడుగు వేయడం వాళ్ళ మనుగడకి ఒక అవసరం. గామా కనక కొత్త మార్గాన్వేషణ లో విజయం సాధిస్తే Lisbon, Venice ని మట్టికరపించినట్లే.

14 July 1497 న ప్రయాణం మొదలుపెట్టిన వాస్కోడిగామా, April 1498 లో Malindi ని చేరతాడు. అంటే, Zheng He Malindi మీద అడుగుపెట్టిన ఎనభైరెండు(82) సంవత్సరాల తరవాత!!.

చైనా పెద్దగా ఏం మిగల్చకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయిన Malindi లో వాణిజ్యానికి మంచి కేంద్రం కాగల అవకాశాలు వాస్కోడిగామాకి బాగా కన్పిస్తాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న భారతీయ వ్యాపారస్తులని చూట్టం తనలో ఉత్సాహాన్ని నింపుతుంది. బహుశా ఈ భారతీయులే గామాకి భారతదేశ మార్గం చూపడంతో పాటుగా, Calicut కి వెళ్ళడానికి Monsoon Winds ని పరిచయం చేసి ఉంటారు.

ఇక్కడ జరిగిన చరిత్రని చూస్తే చైనీస్ కి, పోర్చుగీస్ కి కనపడేది వ్యాపారావకాశాల ఆత్రుత ఒక్కటే తేడా కాదు అని తెలుసుకోవచ్చు. Zheng He ప్రదర్శించినదానికన్నా, ఎన్నో రెట్ల నిర్ధాక్షిణ్యతా, కరడుగట్టిన క్రూరత్వం పోర్చుగీస్ అమలుపరచిందని అర్ధమవుతుంది .

ఉదాః Calicut రాజు, వాస్కోడిగామా Lisbon నుంచి తెచ్చిన సామాగ్రిని అప్రసన్నంగా చూసినప్పుడు గామా వెంటనే దాడి చేసి పదహారుమంది జాలరులని బంధీలుగా ఉపయోగించుకున్నాడు. అతని రెండవ భారత యాత్రలో పదిహేను ఓడల దళంతో వెళ్ళి Calicut మీద దాడి చేయడమే కాక, తను బంధించిన మనుషుల శరీరాయవలని దారుణంగా గాయపర్చి, ఛిధ్రం చేసాడు. తదుపరి యాత్రల్లో ఒకసారి మెక్కాకి వెళ్తూన్న పడవలో ప్రయాణీకులని లోపలే బంధించి పడవకి నిప్పంటించాడు.

వాస్కోడిగామా నాయకత్వంలో పోర్చుగీస్ నావికాదళం, వారికి ఎదురవబోయే ప్రతిఘటనని అణచివేయటానికి అతిదారుణమైన హింసకి ఒడిగొట్టిందన్నది చారిత్రక సత్యం. దానికి సాక్ష్యం, పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ఇండియాకి నియమింపబడ్డ రెండవ గవర్నర్ Afonso de Albuquerque తన దేశానికి పంపిన ఒక నివేదిక లో చూడవచ్చు: 
  •  "మన ఆగమన పుకారు వస్తే చాలు, ఇక్కడ ఉన్న పడవలు అన్నీ ఒక్కమాటున మాయమయ్యేవి, చివరికి పక్షులు సైతం నీళ్ళ మీదకి షికారుకి రావడానికి భయపడేవి"
పోర్చుగీస్ సముద్రజైత్రయాత్ర ఇండియా దాటి కొనసాగింది. మధ్య మధ్యలో కొన్ని అపజయాలు చవిచూడకపోలేదు. ఉదా: మొట్టమొదటి నౌకాయాత్రలోనే సగానికి సగం సిబ్బంది ప్రాణాలు కోల్పోయి, కేవలం రెండే నౌకలు Lisbon కి తిరిగిచేరగలగాయి. చివరకి గామా సైతం తన మూడవ ఇండియా ప్రయాణంలో మలేరియా బారినపడి మరణించాడు.
కానీ మిగతా పోర్చుగీస్ అన్వేషకులు ఇండియాని దాటి, చైనా వరకి సముద్రయాత్రలని కొనసాగించారు.

చైనాకి అవసరమైన వాణిజ్య సామాగ్రి ఏదీ పెద్దగా, పోర్చుగీస్ దగ్గర లేకపోయినా, పేపర్ మనీని వదిలించుకొని, కాయిన్ కరెన్సీ వాడకాన్ని పెంచడానికి కృషి చేస్తున్న మింగ్ చైనా కి ఎంతో అవసరమైన వెండిని మాత్రం తీసికెళ్ళగలిగారు.చివరకి 1557 లో చైనాలోని Macau పోర్చుగీస్ స్వాధీనమవుతుంది. 1587 కల్లా ఒక ముఖ్యమయిన వ్యాపారనగరంగా గుర్తింపు చెందుతుంది.

ఎక్కడో Lisbon(Portugese) లో మొదలుపెట్టి, ఆఫ్రికా చుట్టూ, అరేబియా చుట్టూ, ఇండియా చుట్టూ తిరిగి, Malacca నుండి దూసుకెళ్ళి, Spice Lands లో విజయపతాకాల్ని ఎగరవేసుకుంటూ కొనసాగిన జైతయాత్ర, చివరకి Macau ని దాటి ముందుకు కొనసాగుతుంది.

సముద్రాలకావల విస్తరిస్తున్న తమ ప్రత్యర్ధుల విజయాలూ, పొందిన లాభాలూ, ఇతర యూరోపియన్ దేశాల కన్నుదాటిపోలేదు. మొట్టమొదటగా రంగంలోకి దూకిన స్పెయిన్ ఫిలిప్పీన్స్ లో నాటిన జెండాతో ఏషియాలో తన మొదటి స్థావరాన్ని స్థాపించి, ఈ మార్గం గుండా చైనాకి కావలసిన ఎంతో వెండిని రవాణా చేయగలుగుతుంది. 

కానీ పోర్చుగీస్ కనుగొన్న కొత్త Spice route లో ఉన్న సువర్ణావకాశాల్ని స్పెయిన్ వదులుకోదల్చుకోలేదు. కొత్తమార్గం మీద దృష్టి కేంద్రీకరించిన స్పెయిన్1600 మధ్యలో కల్లా కొత్త రవాణామార్గంలో పోర్చుగీస్ ని అధిగమించి, తమ ప్రత్యర్ధి కన్నా అధిక నౌకల్నీ, సామాగ్రినీ రవాణా చేయగలుగుతుంది.

తమ సమీప దేశాల అభివృద్దిని గమనించిన ఫ్రాన్స్ దేశం కూడా బరిలోకి దిగుతుంది.

మరి ఇంగ్లాండ్ ఏం చేస్తుందీ కాలంలో? 

ఎప్పుడూ ఫ్రాన్స్ ని ఆక్రమిద్దామన్న ఆశయమే తప్ప, అంతకుమించి విజయకాంక్ష లేని ఇంగ్లాండ్ దేశం, మధ్యయుగాల్లో ఉన్నిని అమ్ముకోవడం తప్ప అంతకుమించి ఒక నూతనఉపాయాన్ని సాధించలేని ఇంగ్లాండ్ దేశం, తమ తోటి యూరోపియన్ దేశాల విస్తరణనీ, వారి వ్యాపారలాభాల్నీ చూస్తూ ఉండలేకపోయింది.

ఇంకేముంది? 1496 లో John Cabot మొదటిసారిగా అట్లాంటిక్ ని దాటడానికి ప్రయత్నిస్తాడు. 1553లో Hugh Willoughby and Richard Chancellor నార్త్ ఈస్ట్ పైనుంచి ఇండియాకి రావడానికి ప్రయత్నించి, మార్గంలో Willoughby ప్రాణాలు కోల్పోయినప్పటికీ, Richard భూమార్గం ద్వారా ఇండియా దాటి ప్రయాణించి మాస్కో చేరుకుంటాడు.

ఇంగ్లాండ్ కి తిరిగి వచ్చిన Chancellor చేసిన మొట్టమొదటి పని, రష్యాతో వ్యాపార వాణిజ్య నిమిత్తం మొట్టమొదటి
కంపనీని స్థాపిస్తాడు. ఈ రోజున గమ్మత్తుగా కనపడే ఆ కంపెనీ పేరులోనే అప్పటి ఇంగ్లాండ్ ఆశయాలని గమనించొచ్చు . (పేరు: The Mystery and Company of Merchant Adventurers for the Discovery of Regions, Dominions, Islands, and Places unknown). కాలక్రమేణా ఇలాంటి కంపనీలు, సంస్థలు ఇంగ్లాండ్ రాజరికపు తోడ్పాటుతో ఎన్నో తెరమీదకొచ్చి, అట్లాంటిక్ కి ఆవలే కాకుండా, కొత్త Spice Route లో సైతం వ్యాపారాన్ని కొనసాగించాయి.

పదిహేడవ శతాబ్ధపు నడుమకల్లా England వ్యాపారం Belfast నుంచి Boston వరకీ, Bengal నుంచీ Bahamas వరకీ విస్తరించి మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.

Cut-throat Competetion తో ప్రపంచం కొత్తగా చెక్కబడుతోందన్న విషయం మనకి సుస్పష్టంగా కనపడుతోంది. కాని మన ప్రశ్న మన దగ్గిరే మిగిలి ఉంది. చైనీస్ లో కనపడని వ్యాపార వ్యాణిజ్య ఆరాటం, దుగ్ధా, దూకుడూ యూరోపియన్స్ లో ఎందుకు కనిపించింది?

వాస్కోడిగామా సొమ్ము, సంపాదనల కోసం అంతగా ఎందుకు ప్రాకులాడాడు, చివరకి మనుషుల్ని దారుణంగా హింసకి గురిచేసి చంపేంత పాపానికి ఒడిగట్టాడు?.

దానికి సమాధానం మధ్యయుగాల్లో యూరప్ పటం లో దొరుకుతుంది. వందలకొద్దీ చిన్న చిన్న నగర సంస్థానాలతో, రాజ్యాలతో నిండిపోయిన కాలమది Baltic నుండి Adriatic వరకీ, Lubeck నుండి Venice వరకీ దాదాపు వెయ్యి రాజ్యసంస్థానాలుండేవి పద్నాలుగో శతాబ్ధంలో.  చైనా జాగ్రఫీని పరిశీలిస్తే మూడు నదులు Yellow, Yangzi and Pearl west నుండి east కి వెళ్తూంటాయని అర్ధమవుతుంది. అదే యూరప్ లో ఎన్నో నదులు, ఎన్నో డైరక్షన్స్ లో ప్రవహిస్తూంటాయి. ఇహ Alps నుండీ Pyrenees వరకీ విస్తరించిన పర్వతశ్రేణులూ, Germany Poland ల నిండా ఉన్న అడవులతో నుండి ఉన్న ప్రాంతం కన్నా, గుర్రాలమీద దాడికి వచ్చే Mongols కి విశాలంగా ఉండే చైనా మీద దాడిచేయటం బహుశా సులభమయ్యి ఉంటుంది. దాంతో చైనాకి అవసరమయినంత ఐకమత్యం, యూరప్ లో ఉన్న చిన్నచిన్న రాజ్యాలకి అవసరమయి ఉండకపోవచ్చు. ఈ కారణంగానూ, కలసివచ్చిన ఇతర కారణాలవల్ల కూడానూ విడివిడిగా ఉండిపోయిన యూరప్ దేశాలు చివరకి ఒకదానితో ఒకటి పోటీ పడి తమ ఉనికిని, అభివృద్దినీ కాపాడుకోక తప్పలేదు.

ఇదిలా ఉండగా, యూరప్ లో సముద్రం పైన ఓడల నిర్మాణం చిన్న సైజు లోనే కొనసాగింది.వైరి వర్గాలు గురిచూసి దాడి చేయడానికి అనువుగా ఉండే చైనా నిర్మించిన అతి పెద్ద ఓడలతో పోలిస్తే, వేగానికీ, ఫైర్ పవర్ కీ కీ కూడా సౌలభ్యంగా ఉన్న ఈ ఓడల సైజు, సులభంగా మలుపులు తిరగగలగడమే కాక, శత్రు వర్గాలకి వీటిని గురి చేయటానికి కష్టంగా ఉండేది.

1501 లో ఫ్రెంచ్ ఓడల మీద ఫిరంగుల ని పెట్టి, కాల్చడం సాధించిన తర్వాత, ఈ ఓడలు, సంచార యూరోపియన్స్ యుద్దసేనకి, నీటిమీదతేలేకోటలు గా పరిణమించాయి. ఇహ ఎదురనేదే లేకుండా పోయింది.  

ఈ నిరంతర యుద్దాల కారణంతో యూరప్ రాజ్యాధిపతులు, ప్రజల మీద పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానాకి సరిపడినంత ఆదాయాన్ని సమకూర్చుకోగలిగారు. ఉదా: 1520-1630 మధ్యలో చిన్న దేశాలైన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు, ఎంతో పెద్ద దేశమైన చైనా కన్నా అధిక ఆదాయాన్ని పన్నుల రూపంలో రాబట్టగలిగారు.

ఇటలీ మరియి ఇతర యూరప్ దేశాలు ఆ కాలంలోనే కనీవినీ ఎరుగని రీతిలో, Modernbond markets నమూనాలో గవర్నమెంట్ బారోయింగ్ ని ప్రవేశ పెట్టాయి. అలనాటి కాలంలో ప్రజల సమూహపు అప్పు (Public Debt) అనేది Ming China కి ఊహకి కూడా అందనిది.

ఇహ ప్రపంచాన్ని మార్చేసిన అత్యంత నూతన ఆర్ధిక ఐడియాని Dutch ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా కంపెనీల్లో షేర్ల ద్వారా పెట్టుబడి దాని లాభాల్నీ, నష్టాల్నీ పంచి పెట్టే ఆలోచనకి మూలాల్ని 1602 లో Dutch స్థాపించిన Dutch East India Company లో చూడొచ్చు.అయితే దీనివల్ల ప్రభుత్వఖజానాకి రాబడి పెరిగింది కానీ, కంపనీల్లోభాగస్వాములు పెరిగేసరికి క్రమక్రమంగా రాజ్యాధికారాలు తగ్గిపోయాయి.

వీటన్నిటినీ మించి తరాల కొద్దీ సాగిన అంతర్గత సంఘర్షణ, ఏ ఒక్క దేశాన్నో,రాజునో ఎదురులేని శక్తిగా మార్చి, యూరప్ అంతటినీ ఏలే అవకాశం లేకుండా చేసింది. చివరకి బయటనుంచి వచ్చిన తుర్కులు తూర్పు యూరప్ మీదకి దండెత్తి వచ్చినప్పుడు కూడా, యూరప్ అంతటినీ కలిపి మాట్లాడే గొంతు లేకుండా పోయింది. మింగ్ చైనా లాగా ఓడల నిర్మాణం ఆపేయమని ఆదేశించడానికీ, సముద్రప్రయాణాలాపేసి మీదకి దూసుకొస్తూన్న శత్రువునాపడానికి మనందరం పోరాడుదాం అని చెప్పడానికి కూడా ఒక కేంద్రీకృత అధికారం లేకుండా పోయింది. పైగా యూరప్ లోని ప్రతి మోనార్క్ కూడా సముద్రాలని దాటి కాలనైజేషన్ నీ, ఆక్రమణలనీ, వాణిజ్య వ్యాపారాలనీ ప్రోత్సహించారే తప్ప , వాటికడ్డుగా ఏనాడూ నిలవలేదు.

యూరప్ లో ఒక వంద సంవత్సరాల పాటు సాగిన Reiligious War కూడా సముద్రాలు దాటి పోయేటందుకు ఒక ప్రేరకమయింది. పై అన్ని కారణాల వల్లా, యూరప్ లో ఎప్పుడూ అధికారం ఒక పీఠం చుట్టూ కేంద్రీకృతమయి స్థిరపడిపోలేదు.
  • అధికారికంగా Henvry V ఇంగ్లాండ్ రాజే అయినా, అసలు అధికారమంతా భూమి యజమానులకీ, కార్పోరేట్ సంస్థలకీ ఉండేది. ఆ కాలంలోనే ఎన్నో నగరాలు స్వీయనిర్ణయాధికారంతో, స్వతంత్ర ప్రతిపత్తితో మసలేవి . ఒక కార్పోరేషన్ గా విస్తార అధికారాలు కలిగిన The City of London Corporation అనేది ఎనిమిదివందల సంవత్సరాల క్రితమే స్థాపించబడింది.
  • 1130 లోనే Henry I రాజు జ్యోక్యాన్ని నిర్మూలిస్తూ లండన్ ప్రజలకి తమ షరీఫ్ ని స్వంతంత్రంగా ఎన్నుకొనే అధికారాన్నిచ్చాడు.
  • 1191 లో Richard I మేయర్ ని నియమించే అధికారాన్ని వదులుకొని , ప్రజల ఎన్నికకే వదిలేసాడు
  • తదుపరి జరిగిన ఎన్నో పరిణామాల్లో లండన్ నగరం రాజు అధికారాన్ని నిరంతరంగా ఎదిరిస్తూ, ఎన్నో హక్కుల్నీ, స్వయం పాలనాధికారాల్ని సమకూర్చుకుంది.

పొలిటికల్ వ్యవస్థల్లోనే కాదు, టెక్నాలజీలో కూడా ఒక దేశాన్ని మించి ఇంకొక దేశం ముందడుగు వేయడంలో కూడా వివిధ దేశాల మధ్యా , వివిధ నగరాల మధ్య ఉన్న పోటీ గణనీయమైన పాత్రని పోషించింది. ఉదా:  a)1330 లో Richard of Wallingford యూరప్ లో అధునాతనమైన మెకానికల్ క్లాక్ ని స్థాపించగలిగిన తరవాత, ఒక నగరం లోని చర్చ్ లో కంటే పక్కనగరం లోని చర్చ్ లో మరింత అధునాతనమైన క్లాక్ ని స్థాపించటం కోసం ప్రయత్నం చేయటం, తద్వారా ఈ క్లాక్స్ సమయాన్ని చూపించటమే కాకుండా చంద్రగమనాన్నీ, వివిధ గ్రహాల గమనాలనీ, సముద్రపు ఆటుపోటులనీ కూడా ఖశ్చితంగా అంచనా వేసేవి. b) ప్రొటెస్టెంట్ వాచ్ మేకర్స్ ని ఫ్రాన్స్ తమ దేశంలోకి అనుమతించకపోతే, స్విట్జర్లాండ్ సంతోషంగా స్వాగతం చెప్పేది. చివరకి పదహారవ శతాబ్దపు చివరకి చైనాలో ఉన్న మెకానికల్ క్లాక్స్ ని తలదన్నే రీతిలో యూరోపియన్స్ క్లాక్స్ తయారయ్యాయి.

ఈ కాలంలో యూరప్ లో జరుగుతున్న నిరంతర మార్పుతో పోలిస్తే, చైనా ఒక స్థబ్ధమైన ప్రదేశం. భారీ పెట్టుబడులేమన్నా జరిగాయీ అంటే ఉత్తరదిశగా ఉన్న శత్రుభయం తగ్గించుకోవటం కోసం జరిగిన చైనా గ్రేట్ వాల్ నిర్మాణం లోనూ, మరియు ఇరిగేషన్ రంగంలో జరిగిన కెనాల్ నెట్ వర్క్స్ నిర్మాణం లో మాత్రమే.

యూరప్ లో అధికారమంతా రాజకిరీటం, చర్చ్, వివిధ నగరాల సంస్థలూ, ప్రభుత్వశాఖలూ పంచుకొన్నాయి. కానీ చైనాలో దిశా నిర్దేశాధికారమూ, రాజనీతి నిర్ణయాధికారాలూ ఒక ఇంపీరియల్ పవర్ అథారిటీలో ఉండిపోయాయి.

THE MEDIOCRE KINGDOM:

నాగరికతలు బహు సంక్లిష్టమైనవి. శతాబ్ధాల పాటు బలంతోనూ, సిరిసంపదలతోనూ వర్ధిల్లుతాయి. అంతే అకస్మాత్తుగా దిశ తప్పి అగమ్యగోచరంగా సాగిపోయి రాలిపోతాయి.


మింగ్ డైనాస్టీ 1368 లో పుట్టుకొచ్చింది. మింగ్ చైనా దాదాపు మూడొందల సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అత్యంత నాగరికతా దేశంగా వర్ధిల్లింది. కానీ పదిహేడవ శతాబ్ధపు మధ్యలోకొచ్చేపటికల్లా ఆ రధచక్రాలు ఊడొచ్చేసాయి. పొలిటికల్ వర్గ తగాదాలూ, ఆర్ధిక సంక్షోభాలూ, వెండి కొనుగోలు శక్తి పడిపోవడాలూ, పన్నురాబడి క్షీణించడమూ ఇవన్నీ కలిపి చైనాని ఒక నిస్సత్తువ శక్తిగా మార్చేసాయి. దీనికి తోడు క్షామమూ, పేట్రేగిన వ్యాధులూ కలసి తిరుగుబాటుకి దారి తీసాయి. చిట్టచివరి మింగ్ చక్రవర్తి అవమానంతో ఉరితీసుకోని చనిపోయాడంటే చైనా పతనావస్థని ఊహించుకోవచ్చు. ఒక క్రమపద్దతిలో అధికారాన్ని అంచెలంచెలుగా శిఖరాగ్రం వరకీ నిర్మించి, గొప్ప కన్ఫ్యూషియస్ ఫిలాసఫీని పాలనలోకీ, అధికార ప్రవేశ పరీక్షల్లోకి తీసుకొచ్చిన చైనా, ఏ రూల్సూ, రెగ్యూలేషన్సూ లేకుండా Anarchy లోకి జారిపోవడానికి పదేళ్ళ కన్నా ఎక్కువకాలం పట్టలేదు.


ఏం జరిగింది?

ప్రపంచం మీదనుంచీ, బాహ్యపరిణామాల మీదనుంచి చైనా దృష్టి మళ్ళి లోపలి వైపు శ్రద్దపెట్టింది. బయటనుంచి ఒక బలవంతమైన శక్తిగా కనపడిన చైనా అంతర్గతంగా పెళుసుగా మిగిలిపోయింది. గ్రామాలు ఓ మోస్తరుగా నిలబడగలగాయి కానీ, ఒక జాతిగా మాత్రం చైనా స్థబ్ధంగా మిగిలిపోయింది. ఒక శక్తివంతమైన ఉక్కులాంటి అధికారానికి అలవాటు పడిన ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైన ఇన్నోవేషన్ కీ తావులేకుండా పోయింది. ఓ మోస్తరుగా సాధించిన అభివృద్ది కనీసావసారలకి సరిపోవడంతో పెద్ద లక్ష్యాలమీద నుంచి దృష్టి మరల్చి, క్రమక్రమంగా పెద్దపెద్ద అడుగులు వేసిన బాటలదృశ్యమయ్యి, జాతి మొత్తం చిన్నచిన్న అడుగులకి అలవాటుపడింది.

దీనికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్ పదిహేడవ శతాబ్ధపు చివరలో సముద్రాలని జయించి సాధించిన రాజ్యవిస్తరణ ఈ దేశాన్ని, తామున్న వలలోంచి బయటపడేసింది. అట్లాంటిక్ మీదుగా సాగిన వ్యాపారవ్యాణిజ్యాలు కొత్తగా అధిక పోషకాహారవిలువగల పొటాటోస్ నీ, షుగర్ నీ తీసుకొచ్చాయి. ఒక ఎకరంలో పండే షుగర్ కేన్ పంటలో వచ్చే ఎనర్జీ, పన్నెండెకరాల గోధుమపంటలో సైతం వచ్చేది కాదు. పెరుగుతున్న వ్యాపారం, దాంతోపాటే పెరుగుతున్న పోటీ ప్రొడక్టివిటిని పెంచింది, క్రమంగా ఆదాయాన్నీ, పోషకాహార విలువలు గల కొత్త పంటల్నీ సైతం పట్టుకొచ్చింది.

చైనా ఒక్కటే కాదు, అదే కాలంలో జపాన్ ని చూసినా కూడా బాహ్యదృష్టిని మానేసి, కేవలం లోపలివైపు మాత్రమే దృష్టిసారించటం వల్ల అభివృద్ది కుంటుపడిందన్న విషయం గమనించవచ్చు. 1640 లో జపాన్ బయటిదేశాలతొ దాదాపు పూర్తిగా సంబంధాలని తెంచుకోని ఒంటరిదయ్యింది. చైనా, జపాన్ లు విదేశీవ్యాపారానికి విముఖత చూపి , కేవలం రైస్ పంటదిగుబడులని పెంచడం మీద దృష్టి పెట్టాయి.

పరిస్థితులు క్రమంగా క్షీణించటం మొదలయ్యింది. 1793 లో Macarney చైనా ప్రయాణంలో Qianlong Emperor ని తిరిగి వ్యాపారానికి ద్వారాలు తెరవమని ఒప్పించటానికి ప్రయత్నిస్తాడు.

Macarney తెచ్చిన జర్మన్ మేడ్ ప్లానెటోరియం, టెలిస్కోప్ లనీ, theodolites, air-pumps, electrical machines లనీ , సైన్స్ గురించి వివరించే మరెన్నో పరికరాలు ఏ కారణం చేతనో చైనీస్ చక్రవర్తి ని ముగ్ధుణ్ణి చేయలేకపోతాయి. పైగా King George III కి మీ దేశం తయారు చేసినవేవీ మాకక్కర్లేదని సందేశం కూడా పంపించడం జరుగుతుంది.
తన పూర్వీకులకు కనీసం మెకానికల్ క్లాక్స్ మీద ఉన్నంత ఉత్సుకత కూడా Qianlong Emperor కి లేకపోవడంతోఒకప్పుడు ఎన్నో ఇన్వెషన్స్ జరిగిన Middle Kingdom , చివరకి Mediocre Kingdom లా తయారవుతుంది.

1842 లో తమ ఓపియం నిల్వలని ఒక చైనీస్ అధికారి తగలబెట్టేసాడని , ప్రతీకారంతో Royal Naval gunboats , Yangzi నదిమీదుగా ప్రయాణించి Grand Canal లోకి ప్రవేశించడంతో Western World Ascendancy పూర్తిగా ధృవపడిందని చెప్పుకోవచ్చు. నష్టపరిహారంగా చైనా ఇరవైఒక్క లక్షల సిల్వర్ డాలర్స్ నీ, ఐదు నౌకరేవులని బ్రిటీష్
వ్యాపారం కోసం తెరవాల్సి వస్తుంది. అంతేకాదు హాంగ్ కాంగ్ ని కూడా వదులుకోవాల్సి వస్తుంది చివరకి.

******

ఈ రోజున చైనాలో మళ్ళీ అతిపెద్ద ఓడలని నిర్మిస్తున్నారు. నేను(పుస్తక రచయిత) జూన్2010 లో షాంగయ్ కి వెళ్ళినప్పుడు , భీతి గొల్పే సైజ్ లో ఓడల నిర్మాణం జరుగుతోంది. Wenzhou లో ఉన్న ఫ్యాక్టరీల్లో కార్మికులు వందలవేల సంఖ్యల్లో కోట్ లనీ, పదులలక్షల సంఖ్యలో పెన్నులనీ తయారు చేయటం జరుగుతోంది. బొగ్గు, సిమెంట్, మిగతా ముడిసరుకులతో నిండి ఉన్న ఎన్నో పడవలతో Yangzi నది కిక్కిరిసిపోయి కనపడుతోంది.

కాంపిటీషన్, కంపనీలు, మార్కెట్లు, విదేశీవ్యాపారము ..వీటన్నిటినికి విముఖత చూపించిన ఒకప్పటి చైనా ఈరోజున వాటిని అక్కున చేర్చుకుంది. ఈ రోజున Admiral Zheng He చైనాలో ఒక హీరో.

చరిత్ర గమ్మత్తైనది. ముప్పై సంవత్సరాల క్రితం, రాబోయే అర్ధశతాబ్ధంలో చైనా ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ఆర్ధికశక్తిగా అవతరించబోతుంది అని మనమంటే, మనల్నెవరూ సీరియస్ గా తీసుకునేవాళ్ళు కారు.

కానీ 1420 లో , వెస్టర్న్ యూరప్ ఒక రోజున ఏషియా మొత్తం కన్నా ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తుంది అనీ, ఒక సగటు బ్రిటీష్ పౌరుడు, సగటు చైనా పౌరుడికన్నా తొమ్మిదింతలు రిచ్ గా ఉండబోతాడని మనం జ్యొస్యం చెప్పి ఉంటే కూడా మనల్నెవరూ నమ్మేవాళ్ళు కారు. Western Europe లో Competition అంతటి చైతన్యవంతమైన ప్రభావాన్ని చూపించిందని వెనక్కి తిరిగి చూస్తే అర్ధం చేసుకోవచ్చు.

1 comment:

  1. Very Interesting Kumar ji,
    కానీ మొత్తం ఆసియా లో ఒక్క చైనాకే ఇంత ఇంపార్టెన్స్ ఏంటి ? అంత పవర్ఫుల్ గా ఉండేదా ?

    1540 కీ, 1800 కీ మధ్య ఇంగ్లాండ్ లో సగటు ఆయుపరిమితి 37 సంవత్సరాలు మాత్రమే
    -------------------------------
    ఇది చదవగానే ఒక్కసారిగా జలతరించింది :-)
    ఓ ఇప్పుడు మనం చూస్తున్న స్టాక్ మార్కెట్ కి పునాదులు 1602 లో Dutch East India Company పడ్డాయన్న మాట :-)

    Thank you !

    ReplyDelete